ఒంటికి గండి!

సమస్య చిన్నదే. తేలికగానే.. అదీ చికిత్స ఏదీ తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఇంటి చిట్కాలే సరిపోవచ్చు. అలాగని నిర్లక్ష్యం చేయలేం.

Updated : 21 Feb 2023 03:18 IST

నీళ్ల విరేచనాలు

సమస్య చిన్నదే. తేలికగానే.. అదీ చికిత్స ఏదీ తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఇంటి చిట్కాలే సరిపోవచ్చు. అలాగని నిర్లక్ష్యం చేయలేం. తీవ్రమైతే ప్రాణాల మీదికీ తెస్తుంది. అవును.. అంతా తేలికగా తీసుకునే నీళ్ల విరేచనాలు (అక్యూట్‌ డయేరియా) కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందిని బలి తీసుకుంటోంది మరి. ఐదేళ్ల లోపు చిన్నారులకైతే మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది. ప్రధానంగా ఆహారం, నీరు కలుషితం కావటం వల్ల తలెత్తే డయేరియా ఎండాకాలంలో మరింత ఎక్కువ. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది.

బ్యాక్టీరియా, వైరస్‌లతో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌ జబ్బులనగానే ముందుగా క్షయ, టైఫాయిడ్‌, డెంగీ, చికున్‌ గన్యా, ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ.. తాజాగా కొవిడ్‌-19 వంటి జబ్బులే గుర్తుకొస్తుంటాయి. కానీ నీళ్ల విరేచనాల సమస్యా తక్కువేమీ కాదు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అంతా దీంతో బాధపడ్డవారే అనటంలో సందేహం లేదు. సగటున ఒక్కొక్కరు ఏడాదికి నాలుగు సార్లయినా నీళ్ల విరేచనాల బారినపడుతుంటారని అంచనా. అవటానికి మామూలు సమస్యే అయినా ఇది బాగానే వేధిస్తుంది. బాత్రూమ్‌లోంచి బయటకు వచ్చామో లేదో కడుపులో గడబిడ సృష్టిస్తుంది. వెంటనే లోనికి పరుగెత్తిస్తుంది. శరీరానికి కింది నుంచి ఏదో గండి పడినట్టు లోపలున్న నీరంతా బయటకు చిమ్ముకొచ్చేస్తుంది. తీవ్రమైన కడుపు నొప్పితో చెమటలు పుట్టిస్తుంది. విరేచనాలు ఎక్కువైతే ఒంట్లో నీటి శాతం వేగంగా పడిపోతుంది (డీహైడ్రేషన్‌). నీటితో పాటు ఒంటికి శక్తినిచ్చే ఖనిజ లవణాలు, గ్లూకోజు మోతాదులూ తగ్గిపోతాయి. మన శరీరంలో సుమారు 75% వరకు ఉండేది నీరే. ఇది లేకపోతే జీవక్రియలన్నీ పడకేస్తాయి. ఖనిజ లవణాలు, గ్లూకోజు తగ్గిపోవటం వల్ల శరీరం చతికిల పడుతుంది. అలసట, నిస్సత్తువ ముంచుకొస్తుంది. కండరాలు బలహీనపడతాయి. తలనొప్పి, తికమక పడటమూ మొదలవుతాయి. అందుకే కోల్పోయిన నీటిని, లవణాలను వెంటనే భర్తీ చేయటం తప్పనిసరి. లేకపోతే ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుంది. ఐదేళ్ల లోపు పిల్లలు మృత్యువాత పడటానికి దారితీస్తున్న ప్రధానమైన కారణాల్లో రెండోది ఇదే కావటం గమనార్హం. దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నా, పూర్తిగా నివారించుకునే అవకాశమున్నా ఇలాంటి పరిస్థితి తలెత్తటం శోచనీయం.


ప్రపంచ వ్యాప్తంగా ఏటా 170 కోట్ల మంది పిల్లలు డయేరియా బారిన పడుతున్నారు.


ఐదేళ్ల లోపు పిల్లల్లో ఏటా 5,25,000 మంది డయేరియాతో చనిపోతున్నారు.


ఎందుకొస్తుంది?

రోజుకు మూడు, అంతకన్నా ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవటాన్ని డయేరియాగా భావిస్తారు. రెండు వారాల వరకు వేధిస్తుంటే ఆకస్మిక (అక్యూట్‌) సమస్యగా, అంతకన్నా ఎక్కువకాలం కొనసాగితే దీర్ఘకాలిక (క్రానిక్‌) సమస్యగా పరిగణిస్తారు. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. అయితే చాలామందిలో.. ముఖ్యంగా చికిత్స తీసుకోకుండానే కోలుకునేవారిలో విరేచనాలకు కారణమేంటన్నది తెలియనే తెలియదు.
వైరస్‌, బ్యాక్టీరియా: నీళ్ల విరేచనాలకు చాలావరకు ఇవే కారణం. ప్రధానంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఒంట్లోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్లు కలగజేస్తాయి. వైరస్‌లలో చెప్పుకోవాల్సింది- నోరోవైరస్‌, ఎంటెరిక్‌ అడినోవైరస్‌లు, ఆస్ట్రోవైరస్‌, సైటోమెగాలేవైరస్‌, హెపటైటిస్‌ వైరస్‌లు. పిల్లల్లో ఉన్నట్టుండి మొదలయ్యే నీళ్ల విరేచనాలకు మూలం రోటావైరస్‌. ఇ-కొలి, సి-డిఫ్‌ వంటి బ్యాక్టీరియా, కొన్నిరకాల పరాన్నజీవులూ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. ఇలాంటి సూక్ష్మక్రిములతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకున్న 12 గంటల నుంచి 4 రోజుల లోపు ఎప్పుడైనా లక్షణాలు మొదలవుతుంటాయి. ఇవి సాధారణంగా 3 నుంచి 7 రోజుల్లోపు తగ్గిపోతాయి.
మందులు: కొన్నిరకాల మందులు.. ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌తోనూ నీళ్ల విరేచనాలు పట్టుకోవచ్చు. యాంటీబయాటిక్స్‌ మనకు హాని చేసే బ్యాక్టీరియానే కాదు, మేలు చేసే బ్యాక్టీరియానూ చంపేస్తాయి. దీంతో పేగుల్లోని సూక్ష్మక్రిముల మధ్య సమతుల్యత దెబ్బతిని, విరేచనాలు తలెత్తొచ్చు. క్యాన్సర్‌ చికిత్సకు వాడే మందులు, మెగ్నీషియంతో కూడిన యాంటాసిడ్‌ మాత్రలూ విరేచనాలకు కారణం కావొచ్చు.
జబ్బులు: కొన్నిరకాల ఆహార పదార్థాలు పడకపోవటం (ఫుడ్‌ అలర్జీ) కూడా కొందరికి విరేచనాలకు దారితీయొచ్చు. వీటిల్లో ప్రధానమైంది పాలల్లోని ల్యాక్టోజ్‌ అనే చక్కెర పడకపోవటం. దీన్ని సరిగా జీర్ణం చేసుకోలేనివారిలో పాలు, పాల పదార్థాలను తిన్న తర్వాత విరేచనాలు మొదలవుతుంటాయి. ఈ సమస్య వయసుతో పాటు పెరుగుతూ వస్తుంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్నకొద్దీ ల్యాక్టోజ్‌ను జీర్ణం చేసే ఎంజైమ్‌ తగ్గుతుంది. పేగుపూత (ఐబీడీ) వంటి జీర్ణకోశ సమస్యలూ విరేచనాలతో ఇబ్బంది పెట్టొచ్చు.

ఇంటి చికిత్సతోనే ఉపశమనం

ఒక మాదిరి డయేరియాతో బాధపడేవారికి ఇంటి చికిత్సే సరిపోతుంది. ముఖ్యంగా 48 గంటల్లోపు లక్షణాలు తగ్గుముఖం పడుతుంటే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమేమీ ఉండదు.
తగినంత నీరు తాగటం: నీళ్ల విరేచనాలతో పెద్ద ప్రమాదం ఒంట్లో నీటి శాతం పడిపోవటం. కాబట్టి తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. మూత్రం రంగు, ఎన్నిసార్లు మూత్రం వస్తోందనే దాన్ని బట్టి నీటి అవసరాన్ని గుర్తించొచ్చు. మూత్రం తక్కువ సార్లు, అలాగే ముదురు రంగులో వస్తున్నట్టయితే నీటి శాతం తగ్గినట్టే. గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపి తాగటం మంచిది. ఇప్పుడు లవణాలు, గ్లూకోజుతో కూడిన ఓఆర్‌ఎస్‌ పొడి ప్యాకెట్లు కూడా లభిస్తున్నాయి. ఈ పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి. ఒక మాదిరి, మధ్యస్థ డయేరియా చాలావరకు దీంతోనే తగ్గిపోతుంది. నోటి ద్వారా ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చి, రక్తనాళం ద్వారా సెలైన్‌ ఎక్కించాల్సి ఉంటుంది.
ఆహారం: విరేచనాలు తగ్గటానికి ప్రత్యేకించిన ఆహారం, పదార్థాలేవీ లేవు. అయితే విరేచనాలు ఉద్ధృతంగా అవుతున్నప్పుడు తగినంత పోషకాహారం తప్పనిసరి. తేలికగా జీర్ణమయ్యేవి తినాలి. పెరుగన్నం, ఇడ్లీ వంటివి మేలు. ఒకవేళ ఆకలిగా లేనట్టయితే కొద్దిరోజుల వరకు కేవలం ద్రవాహారమే తీసుకోవటం మంచిది.
విరేచనం తగ్గించే మందులు: విరేచనాలు తగ్గటానికి మందులు అందుబాటులో ఉన్నాయి. రక్త విరేచనాలు, జ్వరం (శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువ) లేనట్టయితే వీటిని సురక్షితంగా వాడుకోవచ్చు. నిజానికి ఈ మందులు డయేరియాను నయం చేయవు గానీ తరచూ విరేచనం కాకుండా చూస్తాయి. లోపెరమైడ్‌ మందును వాడుకోవచ్చు. దీన్ని ముందు రెండు మాత్రలు (4 మి.గ్రా.) వేసుకోవాలి. తర్వాత విరేచనం అయిన ప్రతీసారీ ఒక మాత్ర (2 మి.గ్రా.) చొప్పున వేసుకోవాలి. అయితే డాక్టర్‌ సలహా లేకుండా రోజుకు 10 మి.గ్రా. కన్నా ఎక్కువ తీసుకోవద్దు. డాక్టర్‌ ప్రత్యేకించి సూచిస్తే తప్ప నిర్ణీత మోతాదు మించకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. నిర్ణీత మోతాదు మించితే కొందరిలో తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తొచ్చు. డైఫెనాక్సిలేట్‌, అట్రోపిన్‌ కలిసిన మందులూ అందుబాటులో ఉన్నాయి గానీ వీటితో కొన్ని ఇబ్బందులు కలగొచ్చు.
యాంటీబయాటిక్స్‌: ఆకస్మిక డయేరియాలో చాలావరకు యాంటీబయాటిక్స్‌ అవసరం లేదు. వీటిని అనుచితంగా వాడితే తర్వాత సమస్యలూ తలెత్తొచ్చు. రోజుకు 8 కన్నా ఎక్కువసార్లు విరేచనాలు అవుతున్నా, జ్వరం ఉన్నా, విరేచనంలో రక్తం పడుతున్నా, నీటిశాతం తగ్గినా, వారం దాటినా లక్షణాలు తగ్గకున్నా, రోగనిరోధక వ్యవస్థ క్షీణించినా యాంటీబయాటిక్స్‌ అవసరమవుతాయి. కొన్నిసార్లు ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయించాల్సి ఉంటుంది కూడా.

లక్షణాలేంటి?

విరేచనాల మూలంగా ఒంట్లో నీటిశాతం పడిపోవటమే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. దీంతో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. తొలిదశలో.. నిస్సత్తువ, అలసిపోవటం, నోరు తడారటం, కండరాలు పట్టేయటం, తలనొప్పి, మూత్రం రంగు మారటం, మూత్రం అంతగా రాకపోవటం, కూర్చొని లేచిన తర్వాత తల తేలిపోతున్నట్టు అనిపించటం వంటివి ఉంటాయి. నీటిశాతం మరీ తగ్గిపోతే.. కడుపు నొప్పి, ఛాతీ నొప్పి, తికమక పడటం, ప్రేలాపనలు, చెమటలు పట్టకపోవటం, కళ్లు లోతుకు పోవటం, చర్మం పొడిబారటం, ముడతలు పడటం, రక్తపోటు పడిపోవటం, గుండె వేగం పెరగటం, జ్వరం వంటివి వేధిస్తాయి.్చ

పిల్లల్లో డయేరియా

మామూలుగా కన్నా ఎక్కువ పలుచగా, ఎక్కువసార్లు విరేచనాలు అవుతుంటే పిల్లల్లో డయేరియాగా భావిస్తారు. చిన్నపిల్లల్లోనైతే మామూలుగా కన్నా రెట్టింపు సార్లు విరేచనాలు అవుతుంటే సమస్య ఉన్నట్టే. అదే పెద్ద పిల్లల్లో రోజుకు 3, అంతకన్నా ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవుతుంటే డయేరియాగా పరిగణించాల్సి ఉంటుంది. వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీరు, ఇతర ద్రవాలు తగినంత తాగేలా చూసుకోవాలి. పిల్లలకు విరేచనాలను ఆపేసే మందులు ఇవ్వద్దు. సాధారణంగా పిల్లలకు వీటి అవసరముండదు. వీరికివి క్షేమం కాదు కూడా. తీవ్రమవుతుంటే డాక్టర్‌కు చూపించాలి.
* 12 నెలల లోపు పిల్లల్లో రక్త విరేచనాలు అవుతున్నా, రెండు మూడు గంటలైనా ఏమీ తినకపోతున్నా, తాగకపోతున్నా.. కడుపునొప్పితో బాధపడుతున్నా, ఉండాల్సిన విధంగా లేకపోయినా, బలహీనంగా కనిపిస్తున్నా, పిలిచినా స్పందించకపోతున్నా వెంటనే డాక్టర్‌కు చూపించాలి. నోరు ఎండిపోవటం, దాహం, 4-6 గంటల వరకు మూత్రం పోయకపోవటం లేదా డైపర్‌ తడవకపోవటం (కాస్త పెద్ద పిల్లలైతే 6-8 గంటల వరకైనా మూత్రం పోయకపోవటం), ఏడుస్తున్నప్పుడు కన్నీరు రాకపోవటం వంటి డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపించినా తాత్సారం చేయరాదు. సత్వరం ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

దీర్ఘకాల డయేరియా

రెండు వారాలైనా విరేచనాలు తగ్గకపోతే దీర్ఘకాల డయేరియాగా పరిగణిస్తారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. విరేచనాలతో పాటు బరువు తగ్గటం, మలంలో రక్తం, రక్తహీనత ఉన్నట్టయితే నిశిత పరిశీలన అవసరం. పేగుపూత, పెద్దపేగులో పుండ్లు, పెద్దపేగు క్యాన్సర్‌, పేగుల్లో క్షయ వంటి సమస్యలేవైనా దీనికి కారణం కావొచ్చు. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) బారినపడ్డవారిలో కడుపునొప్పి.. అలాగే కొన్నిరోజులు మలబద్ధకం, కొన్నిరోజులు విరేచనాలు వేధిస్తుంటాయి. ఇది బాగా చికాకు కలిగిస్తుంది. దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
* వీరికి హిమోగ్లోబిన్‌, సీఆర్‌పీ, సీరమ్‌ అల్బుమిన్‌, సీఈఏ, ఫీకల్‌ కాల్‌ ప్రొటెక్టిన్‌, సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

నివారణే ముఖ్యం

నీళ్ల విరేచనాలను పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంది. ఆహారం, నీరు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం ప్రధానం.

ఆహార శుభ్రత

* అప్పుడే వండిన ఆహారం తినాలి. కలుషితమైన నీటిని తాగొద్దు.
* పచ్చి పాలు, పాశ్చరైజేషన్‌ చేయని పాలతో చేసిన పదార్థాలు తీసుకోవద్దు.
* పండ్లు, కూరగాయలను పూర్తిగా శుభ్రంగా కడిగానే తినాలి.
* ఫ్రిజ్‌లో 40 డిగ్రీల ఫారన్‌హీట్‌.. ఫ్రీజర్‌లో సున్నా డిగ్రీల ఫారన్‌హీట్‌, అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి.
* ప్యాకెట్లలో అమ్మే తినటానికి సిద్ధంగా ఉండే పదార్థాలు, ముందే వండిన వంటకాలను వీలైనంత త్వరగానే తినెయ్యాలి.
పచ్చి మాంసం, చేపలు, కోడి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు తగలనీయొద్దు. విడిగా ఉంచాలి.
* కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి కోసిన తర్వాత చేతులు, కత్తులు, కటింగ్‌ బోర్డులను పూర్తిగా శుభ్రం చేయాలి.
* మాంసాన్ని వండేటప్పుడు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి.
* పచ్చసొన గట్టిపడేంతవరకు గుడ్లను ఉడికించాలి.

చేతుల శుభ్రత

విరేచనాలను కారణమయ్యే సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదముంది. ఇవి చేతుల నుంచి నోటి ద్వారా పొట్టలోకి చేరతాయి. అందువల్ల విరేచనాలతో బాధపడేవారు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తోటి ఉద్యోగులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విరేచనాలు తగ్గేంతవరకు ఆఫీసుకు వెళ్లకపోవటం, పిల్లలను బడికి పంపించకపోవటం మంచిది.
* ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా చూసుకోవటానికి చేతులను శుభ్రంగా ఉంచుకోవటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. మల విసర్జన అనంతరం, భోజనానికి ముందు విధిగా చేతులు కడుక్కోవాలి. సబ్బుతో 15-30 సెకండ్ల పాటు బాగా రుద్దుకొని చేతులను కడుక్కోవాలి. గోళ్లు, వేళ్ల మధ్య, మణికట్టు కూడా శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. తర్వాత పొడి తువ్వాలుతో తుడుచుకోవాలి.
* అందుబాటులో ఉంటే సబ్బు, నీటితోనే శుభ్రం చేసుకోవటం మంచిది. ఇవి లేనప్పుడు ఆల్కహాల్‌ ఆధారిత ద్రావణంతో శుభ్రం చేసుకోవచ్చు. దీన్ని అరచేతుల్లోకి తీసుకొని, పూర్తిగా ఆరేంతవరకు చేతుల నిండా, గోళ్ల మధ్యలో, మణికట్టు చుట్టూ రుద్దుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ద్రావణంతో కూడిన తడి వైప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?

* పెద్దమొత్తంలో విరేచనం అవుతూ డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపించటం.
* విరేచనం తక్కువగా అవుతున్నా మలంలో రక్తం, జిగురు పడటం.
* రక్త విరేచనాలు లేదా మలం నల్లగా రావటం.
* శరీర ఉష్ణోగ్రత 102.3 డిగ్రీలు, అంతకన్నా ఎక్కువగా ఉండటం.
* రోజుకు 6, అంతకన్నా ఎక్కువసార్లు విరేచనాలు కావటం లేదా 48 గంటలైనా తగ్గకపోవటం.
* ​​​​​​​ తీవ్రమైన కడుపునొప్పి, విసర్జన సమయంలో నొప్పి రావటం.

వీటిల్లో ఒకటి, అంతకన్నా ఎక్కువ లక్షణాలుంటే తాత్సారం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. యాంటీ బయాటిక్స్‌ వాడిన తర్వాత విరేచనాలు వేధిస్తున్నా, 65 ఏళ్లు పైబడినా, ఇతరత్రా జబ్బులున్నా, రోగనిరోధకశక్తి క్షీణించినా త్వరగా డాక్టర్‌కు చూపించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని