మోకాలి నొప్పికి వ్యాయామ చికిత్స

మోకాలు, తుంటి నొప్పులతో బాధపడుతున్నారా? అయితే వ్యాయామాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

Published : 25 Apr 2023 00:23 IST

మోకాలు, తుంటి నొప్పులతో బాధపడుతున్నారా? అయితే వ్యాయామాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అన్నింటికన్నా తేలికైనది నడక. అయితే కొన్నిసార్లు సమయం దొరక్కపోవచ్చు. ఆరుబయట నడవటానికి వీలుండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఇంట్లోనే తేలికైన వ్యాయామాలనూ చేయొచ్చు.


* మోకాలు, తుంటి కీళ్లు సజావుగా పనిచేయటానికి తొడ ముందుభాగం కండరాలు (క్వాడ్రిసెప్స్‌) తోడ్పడతాయి. వీటిని బలోపేతం చేసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. దీనికి తేలికైన వ్యాయామం ఒకటి ఉంది. ముందుగా కుర్చీలో కూర్చోవాలి. పాదాలను నేలకు ఆనించాలి. వెన్ను తిన్నగా ఉంచాలి. ఒక కాలును నెమ్మదిగా తిన్నగా ముందుకు చాచాలి. కాసేపు అలాగే ఉంచి, యథాస్థితికి రావాలి. రెండో కాలుతోనూ ఇలాగే చేయాలి.


* కీళ్లు అరగటం వల్ల తలెత్తే నొప్పులతో తూలి కింద పడిపోయే ముప్పూ పెరుగుతుంది. అందువల్ల శరీరం తూలిపోకుండా, స్థిరంగా ఉండేలా చూసుకోవటం ముఖ్యం. దీనికీ తేలికైన వ్యాయామ మార్గముంది. పాదాలను కాస్త ఎడంగా పెట్టి కుర్చీ వెనక నిల్చోవాలి. చేతులను కుర్చీకి ఆనించి, ఒక కాలును మోకాలు వద్ద వంచుతూ వెనక్కు లేపాలి. కాసేపు అలాగే ఉంచి, కిందికి దించాలి. రెండో కాలుతోనూ ఇలాగే చేయాలి. శరీర స్థిరత్వం మెరుగవుతున్నకొద్దీ క్రమంగా వీటి సంఖ్య పెంచుకుంటూ రావాలి. వారానికి మూడు రోజులు చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.


* పిరుదు కండరాలు బలహీనం కావటంతోనూ మోకీళ్లు త్వరగా ఒత్తిడికి లోనవ్వచ్చు. కాబట్టి వీటిని బలోపేతం చేసుకుంటే మోకీళ్ల మీద తక్కువ భారం పడుతుంది. ఇందుకు ఆల్చిప్ప వ్యాయామం తోడ్పడుతుంది. ముందు ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. మోకాళ్లను, తుంటిని 90 డిగ్రీల కోణంలో వంచాలి. భుజాలు, తుంటి, పాదాలు ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. పై మోకాలును నెమ్మదిగా వీలైనంత పైకి లేపాలి. ఐదారు సెకండ్ల పాటు అలాగే ఉంచి, కిందికి దించాలి. రెండో వైపునకు మళ్లి, ఇలాగే చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని