Diabetes: పాదాలకుతీపి చెద!

పాదానికేదో కొద్దిగానే గీసుకుపోవచ్చు. నొప్పేమీ ఉండకపోవచ్చు. నడుస్తున్నప్పుడూ ఇబ్బందేమీ లేకపోవచ్చు. చిన్న పుండే కదా, అదే మానుతుందిలే అనిపించొచ్చు.

Updated : 09 May 2023 08:51 IST

పాదానికేదో కొద్దిగానే గీసుకుపోవచ్చు. నొప్పేమీ ఉండకపోవచ్చు. నడుస్తున్నప్పుడూ ఇబ్బందేమీ లేకపోవచ్చు. చిన్న పుండే కదా, అదే మానుతుందిలే అనిపించొచ్చు. కానీ రోజులు గడుస్తున్నా మానదు. పైగా ఎక్కువవుతూ వస్తుంటుంది. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి, చీమూ పడుతుంది. అప్పటికీ కళ్లు తెరవకపోతే కణజాలం, ఎముక క్షీణించొచ్చు. కణజాలం పూర్తిగానూ చచ్చుబడొచ్చు. ఇన్‌ఫెక్షన్‌ విస్తరించి వేళ్లో, పాదమో, కాలో తొలగించాల్సిన పరిస్థితీ ఏర్పడొచ్చు. మధుమేహుల్లో పాదం మీద తలెత్తే పుండ్ల క్రమం ఇలాగే కొనసాగుతుంది. అలాగని ఇవేమీ అనివార్యమైనవి కావు. తగు జాగ్రత్తలతో నివారించు కోవచ్చు. పుండ్లు పడినా సత్వర చికిత్సతో నయం చేసుకోవచ్చు. కావాల్సిందల్లా వీటిపై అవగాహన కలిగుండటం.

నొప్పి, చురుకుదనం తగ్గటం, ఎరుపు, వేడి, వాపు. శరీరానికి ఎక్కడైనా గాయమైనప్పుడు తలెత్తే వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రధాన లక్షణాలివి. మన రోగనిరోధక ప్రతిస్పందనలో భాగంగా పుట్టుకొచ్చే ఇది గాయం నయం కావటానికి తోడ్పడుతుంది. కానీ దీర్ఘకాలంగా మధుమేహం గలవారిలో వాపు ప్రతిస్పందన మందగించటం, స్పర్శ తగ్గటం వల్ల నొప్పి గానీ ఇబ్బంది గానీ అంతగా ఉండవు. దీని మూలంగానే ఎంతోమంది పాదాల గాయాలను, పుండ్లను పట్టించుకోకుండా తిరుగుతుంటారు. దీంతో వీటి మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. దుమ్మూధూళీ అంటుకుంటుంది. సమస్య మరింత తీవ్రమవుతుంది. కొన్నిసార్లు పాదాలూ తొలగించాల్సి రావొచ్చు. మధుమేహులు ఆసుపత్రిలో చేరటానికి దారితీస్తున్న ముఖ్యమైన కారణాల్లో పాదాల మీద పుండ్లు పడటం ఒకటి. జనాభాలో మధుమేహం గలవారి సంఖ్య 10% కన్నా తక్కువే అయినా.. పాదాలు, కాళ్లు తొలగించాల్సిన వస్తున్నవారిలో మూడింట రెండొంతుల మంది మధుమేహులే కావటం గమనార్హం. మనదేశంలో మధుమేహంతో బాధపడుతున్నవారిలో పావు వంతు మందికి పాదాల సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంటుండగా.. వీరిలో 30% మందికి సమస్య తీవ్రంగా పరిణమిస్తున్నట్టు అంచనా. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మూలంగా ప్రతి నిమిషానికి ఒకరు కాలును కోల్పోతుండటం విచారకరం.


ఎందుకిలా?

మధుమేహుల్లో పాదాలకు పుండ్లు పడే ముప్పు ఎక్కువ. పెద్దగా దెబ్బలు తగలకపోయినా.. రాళ్లు, మట్టి గడ్డల వంటి వీటి మీద కాలు పడినా కూడా పుండు పడొచ్చు. పాదాల వాపు, ఆనెలు, గోళ్లు వెనక్కి తిరిగి పెరగటం, కొత్త చెప్పులు కరవటం వంటివీ పెద్ద పుండ్లకు దారితీయొచ్చు. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.

నాడులు దెబ్బతినటం: మనకు కాలికి గాజు పెంకో, ముల్లో గుచ్చుకుంటే నొప్పితో విలవిల్లాడతాం. దీనికి కారణం స్పర్శ తెలియటమే. కానీ దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల నాడులు దెబ్బతిని (న్యూరోపతీ) కాళ్లకు స్పర్శ, నొప్పి భావనలు తగ్గుతాయి. దీంతో పాదాలకు గాయాలయ్యే అవకాశం ఎక్కువవుతుంది. గాయమైనా ఆ విషయం తెలియదు. నొప్పి తెలియకపోవటంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. చిన్నదే కదా అని అలాగే తిరుగుతుంటారు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ మొదలై, త్వరగా పుండుగా మారుతుంది. నాడులు దెబ్బతినటం వల్ల పాదాల్లో అంతర్గత కండరాల పనితీరూ అస్తవ్యస్తమవుతుంది. దీంతో వేళ్లను లోపలికి లాక్కొని నడుస్తుంటారు. ఇది అరికాలులో ఆయా చోట్ల ఒత్తిడి ఎక్కువగా పడేలా చేస్తుంది. ఇదీ పుండ్లకు దారితీయొచ్చు.

రోగనిరోధకశక్తి తగ్గటం: మధుమేహుల్లో రోగనిరోధకశక్తి తగ్గటం మరో సమస్య. దీంతో ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశమూ పెరుగుతుంది. ఇవి మరింత తీవ్రమవుతుంటాయి కూడా. కొన్నిసార్లు రాత్రికిరాత్రే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రం కావొచ్చు.
రక్త ప్రసరణ తగ్గటం: మధుమేహుల్లో పాదాల పుండ్లు మానటమూ కష్టమే. దీనికి కారణం కాలి రక్తనాళాల గోడలకు కొవ్వు పేరుకొని, పూడికలు ఏర్పడటం (అథెరోస్క్లెరోసిస్‌). దీంతో లోపలి మార్గం సన్నబడుతుంది. కొన్నిసార్లు పూర్తిగానూ మూసుకుపోవచ్చు. దీంతో ఆయా భాగాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్తంతో పాటే ఆక్సిజన్‌, పోషకాల సరఫరా తగ్గుతుంది. కాళ్లకు రక్త సరఫరా తగ్గితే పుండ్లు మానటం ఆలస్యమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ ఇంకాస్త త్వరగా తీవ్రమవుతుంది కూడా. కణజాలమూ చచ్చుబడొచ్చు (నెక్రోసిస్‌). మధుమేహులకు ఇలాంటి రక్తనాళాల సమస్యలు తలెత్తే అవకాశం 5 రెట్లు ఎక్కువ.


నివారించుకోవచ్చు

పాదాల సమస్యలు కలవరం కలిగించేవే అయినా ఇవేమీ అనివార్యమైనవి కావు. వీటిని నివారించుకునే మార్గం లేకపోలేదు. అన్నింటికన్నా ముఖ్యం గ్లూకోజును కచ్చితంగా అదుపులో ఉంచుకోవటం. అదృష్టవశాత్తు ఇందుకోసం సురక్షితమైన, సులభమైన మార్గాలెన్నో ఉన్నాయి. గ్లూకోమీటర్లతో ఇంట్లోనే గ్లూకోజును పరీక్షించుకోవచ్చు. ఇన్సులిన్‌ పెన్నులతో ఇన్సులిన్‌ను తీసుకోవటం తేలికైంది. రక్తనాళాల జబ్బు ముప్పును తగ్గించే కొత్త మందులు ఉన్నాయి. పొగ తాగటం, పొగాకు వాడకం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఇవి రక్తనాళాల లోపలి మార్గం సన్నబడేలా చేస్తాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటివీ తగ్గించుకోవాలి.


పాదాల మీద శ్రద్ధ

రోజూ ముఖాన్ని చూసుకున్నట్టుగానే పాదాలనూ జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖం ఎరుపెక్కితే మహా అయితే అందం తగ్గొచ్చు. కానీ పాదాలు ఎరుపెక్కితే కదలటమే కష్టమవుతుందని గుర్తించాలి.

* ప్రతి రోజూ పాదాలను నిశితంగా గమనించుకోవాలి. చేత్తో అన్ని వైపుల నుంచి తాకుతూ ఏదైనా గీసుకుందా? ఎక్కడైనా చర్మం లేచి పోయిందా? కమిలిందా? పొక్కులేవైనా ఉన్నాయా? గోళ్లు వాడిగా ఉన్నాయా? లోపలికి తిరిగి పెరుగుతున్నాయా? అనేవి చూసుకోవాలి. పాదం ఎక్కడైనా చల్లగా లేదా వేడిగా ఉన్నా, కొత్తగా ఎలాంటి మార్పులు కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు.

* పాదాలను రోజూ సబ్బుతో, గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అయితే వేడి నీటితో కడుక్కోవద్దు. తువ్వాలుతో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ముఖ్యంగా వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. తడిగా ఉంటే చర్మం నాని ఫంగల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. పాదాలు తుడుచుకున్నాక వేళ్ల మధ్య యాంటీఫంగల్‌ పౌడర్‌ చల్లుకోవాలి.
*వేళ్లు, మడమలు పగలకుండా చూసుకోవాలి. వాజెలీన్‌ లేదా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. కానీ వీటిని వేళ్ల మధ్య రాసుకోవద్దు.
* మృదువైన, సౌకర్యంగా ఉండే చెప్పులు వేసుకోవాలి. చెప్పులు వేసుకునే ముందు లోపల ఇసుక, రాళ్ల వంటివి లేకుండా చూసుకోవాలి. సాయంత్రం వేళల్లో పాదాలు కాస్త ఉబ్బుతాయి. కాబట్టి కొత్త చెప్పులు, షూ సాయంత్రం పూట కొనుక్కోవటం మంచిది.
* గోళ్లను బ్లేడుతో కత్తిరించు కోవద్దు. నెయిల్‌ కట్టర్‌ అయితే సురక్షితం. అలాగే గోళ్లను మరీ దగ్గరికి కత్తిరించుకోవద్దు. అడ్డంగా తిన్నగా కత్తిరించుకోవాలి. అనంతరం అంచులను నున్నగా చేయాలి. చర్మం తెగకుండా చూసుకోవటమూ ముఖ్యమే.
* ఆనెలు వంటివి ఉంటే చికిత్స తీసుకోవాలి. ఆనెల తొడుగులను వాడొద్దు. ఇవి పుండ్లకు దారితీయొచ్చు. ఆనెలను రాళ్లతో రుద్దొద్దు. బాత్రూమ్‌లో వీటిని తొలగించే ప్రయత్నం చేయొద్దు.
* చెప్పులు వేసుకునే నడవాలి. ముఖ్యంగా ఆరుబయట, తోటలో ఉత్త పాదాలతో అసలే నడవద్దు. ఇంట్లోనూ పాదాలకు హాయిగా ఉండే చెప్పులు ధరించాలి.
* హీటర్లు, వేడి నీటి సీసాల వంటివి పాదాలకు నేరుగా తగలనీయొద్దు. స్పర్శ తగ్గటం వల్ల త్వరగా చర్మం కాలిపోయే ప్రమాదముంది.
* కూర్చున్నప్పుడు పాదాలను ఎత్తు మీద పెట్టుకోవాలి. తరచూ వేళ్లను కదిలిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అన్నింటికన్నా నడక తేలికైన, ఉత్తమమైన వ్యాయామం.


అవసరమైతే పరీక్షలు

చాలావరకు పుండును చూడగానే పరిస్థితి అర్థమవుతుంది. అవసరమైతే ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. వీటితో ఎముక, కీళ్ల ఆకారం.. ఎక్కడెక్కడ ఒత్తిడి ఎక్కువగా పడుతుందో తెలుస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ ఎముకకు పాకినా బయటపడుతుంది. కాళ్లకు రక్త సరఫరా తీరును గుర్తించటానికి అల్ట్రాసౌండ్‌ డాప్లర్‌ పరీక్ష కూడా అవసరమవుతుంది. సిరల ఉబ్బు, బర్గర్స్‌ డిసీజ్‌ వంటి ఇతరత్రా సమస్యలున్నా ఇందులో బయటపడతాయి.

చికిత్స

పాదం పుండ్లకు సత్వర చికిత్స తప్పనిసరి. పుండు మరింత తీవ్రం కాకుండా, వీలైనంత త్వరగా మానేలా చూడటం దీని ఉద్దేశం. పుండు తీరును బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.
* మామూలు సమస్య అయితే- ఇందులో స్పర్శ కొద్దిగానే తగ్గుతుంది. దూది మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంటుంది. మడమలు పగలటం, గోళ్ల ఆకారం మారటం వంటివీ ఉండొచ్చు. ఇలాంటివారు పాదాలను జాగ్రత్తగా చూసుకోవటం, నివారణ చర్యలు తీసుకోవటం, గోళ్లను సరిగా కత్తిరించుకోవటం ద్వారా పుండ్లు పడకుండా చూసుకోవచ్చు.
* ఒక మాదిరి సమస్య అయితే- ఇందులో పుండ్లు చిన్నగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ ఉండదు. వీరికి పుండ్ల నుంచి స్రావాలు రాకుండా చూడటం ముఖ్యం. ఇందుకు మందులతో కూడిన పట్టీలు ఉపయోగపడతాయి. ఇవి స్రావాలను పీల్చుకొని, కాస్త తేమగా ఉంచుతాయి. దీంతో కణాలు త్వరగా వృద్ధి చెంది, పుండు త్వరగా మానటానికి ఆస్కారముంటుంది. కొందరికి ఎముక లేదా కీలు ఆకారం మారిపోవచ్చు. దీన్ని సర్జరీతో సరిచేయాల్సి ఉంటుంది. గోళ్లు లోపలి వైపునకు తిరిగి పెరిగేవారికి ఫినోల్‌ అబ్లేషన్‌ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన చెప్పులతో పుండు పడిన చోట ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
* తీవ్ర సమస్య అయితే- ఇందులో పుండుతో పాటు రక్త ప్రసరణ తగ్గటం, ఇన్‌ఫెక్షన్‌ చాలా ఎక్కువగా ఉండటం, కుళ్లిపోవటం (గ్యాంగ్రీన్‌), ఎముక విరగటం, ఎముక లేదా కీలు ఆకృతి మారటం వంటివీ ఉండొచ్చు. పుండు పెద్దగా ఉండి, చాలాకాలంగా మానకుండా వేధిస్తుంటే శస్త్రచికిత్స అవసరమవుతుంది. కొందరికి డిబ్రైడ్‌మెంట్‌ పద్ధతిలో మృత కణజాలాన్ని తొలగించాల్సి రావొచ్చు. దీంతో లోపల పుండు మానటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. రక్తస్రావం మెరుగవుతుంది. క్రమంగా పుండు మానుతుంది. కొందరికి పుండు సైజు, లోతును బట్టి వేరే చోట నుంచి చర్మం లేదా కండను తెచ్చి అతికించాల్సి ఉంటుంది. దీంతో చుట్టుపక్కల భాగాలకు రక్త సరఫరా మెరుగుపడి పుండు త్వరగా మానుతుంది. ఎముక బాగా దెబ్బతింటే ఇతర భాగాల్లోంచి ఎముకను తీసుకొచ్చి, అతికించాల్సి రావొచ్చు కూడా. కాలి రక్తనాళాల్లో పూడికలు గలవారికి స్టెంటు అమర్చటం లేదా బైపాస్‌ మేలు చేస్తాయి.
* చికిత్స ఆలస్యమైతే పాదాల కణజాలం బాగా క్షీణించొచ్చు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రం కావొచ్చు. వాపుతో పాటు దుర్వాసన వస్తుండొచ్చు. మడమ మీద పుండు పడినా, చీలమండ వరకు ఇన్‌ఫెక్షన్‌ విస్తరించినా ప్రమాదమని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతరత్రా పద్ధతులేవీ ఉపయోగ పడకపోతే దెబ్బతిన్న భాగాన్ని శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. మిగిలిన భాగం త్వరగా కోలుకునేలా చూడటమూ ముఖ్యమే. ఇందుకు ఫిజియోథెరపీ కూడా మేలు చేస్తుంది. త్వరగా నడవటానికి, కృత్రిమ పాదం లేదా కాలు అమర్చటానికిది వీలు కల్పిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని