మలి వయసు ఊపిరి!

వయసు మీద పడుతున్నకొద్దీ ఆరోగ్యవంతుల్లోనూ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతూ వస్తుంది.

Updated : 23 May 2023 06:27 IST

వయసు మీద పడుతున్నకొద్దీ ఆరోగ్యవంతుల్లోనూ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. పొట్ట, ఛాతీని వేరుచేసే డయాఫ్రం పొర బలహీనపడటం, ఊపిరితిత్తుల కణజాలంలో సాగే గుణం తగ్గటం, పక్కటెముకల్లో మార్పుల వంటివన్నీ ఊపిరితిత్తుల వ్యాకోచం మీద ప్రభావం చూపుతాయి. దీంతో శారీరక సామర్థ్యమూ తగ్గుతుంది. ఇది పెద్ద వయసులో పలు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఫలితంగా కింద పడటం, ఆసుపత్రిలో చేరాల్సి రావటం వంటి ముప్పులూ పెరుగుతాయి. అయితే వయసుతో పాటు ఊపిరితిత్తులు బలహీనం కావటాన్ని వ్యాయామాల వంటి జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె, కండరాలే కాదు.. ఊపిరితిత్తులూ బలోపేతమవుతాయి.

సాధారణంగా గుండెజబ్బు, ఎముక క్షీణత, బలహీనత నివారణను దృష్టిలో పెట్టుకునే వృద్ధులకు వ్యాయామాలను సూచిస్తుంటారు. అయితే ఇవి గుండె, ఎముకలు, కండరాలతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్నీ పెంచుతాయి. ఈ వ్యాయామాలకు ప్రత్యేకించి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడే పద్ధతులూ తోడైతే మరింత మేలు కలుగుతుంది. శారీరక వ్యాయామాలు, శ్వాస మీద దృష్టి నిలిపే పద్ధతులతో వయసుతో పాటు ఊపిరితిత్తుల్లో తలెత్తే మార్పులు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చురుకుగా ఉండేవారిలోనే కాదు.. బలహీనంగా, అంతగా కదలని, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వృద్ధుల్లోనూ ఇవి మంచి ఫలితం చూపిస్తున్నట్టు తేలింది.

ఆక్సిజన్‌ వినియోగం మెరుగు

శ్రమ లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరం గరిష్ఠంగా వినియోగించుకునే ఆక్సిజన్‌ మోతాదు (వీఓ2) ఆధారంగా గుండె-శ్వాస సామర్థ్యాన్ని (సీఆర్‌ఎఫ్‌) లెక్కిస్తారు. పెద్ద వయసువారిలో దీన్ని తరచూ గమనిస్తుండాలని, దీన్ని కూడా కీలక ఆరోగ్య సూచికగా భావించాలన్నది అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) సిఫారసు. వాతావరణంలోంచి కణ కేంద్రకమైన మైటోకాండ్రియాకు ఆక్సిజన్‌ చేరుకునే సామర్థ్యాన్ని సీఆర్‌ఎఫ్‌ సూచిస్తుంది. అధిక రక్తపోటు, పొగ అలవాటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటి సంప్రదాయ ముప్పు కారకాల కన్నా మరణం ముప్పును అంచనా వేయటానికి ఇదే బాగా తోడ్పడుతుందని ఏహెచ్‌ఏ పేర్కొంటోంది. వ్యాయామంతో సీఆర్‌ఎఫ్‌ మెరుగువుతుంది. అంతేకాదు.. శ్వాసను బయటకు నెట్టే సామర్థ్యమూ పుంజుకుంటుంది. అంటే వయసుతో ముడిపడిన ఊపిరితిత్తుల క్షీణతనూ తగ్గిస్తుందన్నమాట. ఊపిరితిత్తుల పనితీరు తగ్గితే విషయ గ్రహణ సామర్థ్యం వేగంగా పడిపోతున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో జ్ఞాపకశక్తి తగ్గటం, సమయాన్ని సరిగా గుర్తించలేకపోవటం, రోజువారీ పనులు చేసుకోలేకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇలాంటి సమస్యలనూ నివారించుకోవచ్చు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ 65 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసువారు వారానికి 150 నిమిషాల సేపు ఒక మాదిరి-వేగం  వ్యాయామాలు చేయాలని సూచిస్తోంది. తీవ్ర వ్యాయామాలైతే 75 నిమిషాలు చాలని పేర్కొంటోంది. వీటితో పాటు బరువులెత్తటం వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కనీసం రెండు రోజులైనా చేయాలని చెబుతోంది. అయితే వృద్ధులు ఇతరత్రా సమస్యలతో బాధపడుతుండటం, బలహీనంగా ఉండటం వల్ల ఇవి అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి నిపుణులను సంప్రదించి, తమ శరీర సామర్థ్యాన్ని బట్టి తగిన వ్యాయామాలను ఎంచుకొని, సమయాన్ని నిర్ణయించుకోవటం మంచిది.

తేలికైన పద్ధతులతోనూ..

పరికరాల సాయం: బలహీనంగా, అంతగా కదల్లేని వారికి.. అలాగే సీవోపీడీ వంటి ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడేవారికి శ్వాసకోశ వ్యవస్థతో ముడిపడిన కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు మేలు చేస్తాయి. ఇందుకు స్పైరోమెట్రీ పరికరం బాగా ఉపయోగపడుతుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్షించటానికే కాదు, శ్వాసకోశ కండరాలు బలం పుంజుకోవటానికీ తోడ్పడుతుంది. దీన్ని వాడే విధానాన్ని డాక్టర్‌ను అడిగి తెలుసుకొని, ఎవరికివారు ఇంట్లోనే సాధన చేయొచ్చు. బుడగలో గాలి ఊదటం వంటివీ చేయొచ్చు. ఇలాంటి పద్ధతులతో ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతున్నట్టు బయటపడింది.

ప్రాణాయామం: శ్వాస మీద ధ్యాస నిలిపి, నియమబద్ధంగా గాఢంగా శ్వాసను తీసుకొని, వదిలే ప్రాణాయామం వంటి పద్ధతులూ మంచివే. బలహీనంగా ఉన్నవారు కుర్చీలో కూర్చునే దీన్ని సాధన చేయొచ్చు. ఇలాంటి యోగా శ్వాస పద్ధతులను 12 వారాల పాటు చేస్తే శ్వాసకోశ వ్యవస్థ సామర్థ్యం పుంజుకున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సీవోపీడీ గలవారిలో వ్యాయామం చేసే శక్తీ ఇనుమడిస్తున్నట్టూ బయటపడింది. శారీరక వ్యాయామాలు చేయలేనివారికీ వీటితో మంచి ఫలితం కనిపిస్తుండటం విశేషం.

పాడటం: శారీరక వ్యాయామాలు చేయలేనివారికి ఉపయోగపడే మరో మంచి పద్ధతి పాటలు పాడటం. ఎందుకంటే పాడటం, శ్వాస తీసుకోవటం రెండూ ఒకలాంటి శరీర ప్రక్రియలతోనే ముడిపడి ఉంటాయి. అందువల్ల పాడటం కూడా శ్వాసకోశ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలతో సమానంగా ఫలితం చూపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి 75 నిమిషాల చొప్పున 12 వారాల పాటు పాట కచేరీ సాధన చేసినవారిలో శ్వాసకోశ కండరాల పనితీరు పుంజుకున్నట్టు బయటపడింది. అంతేకాదు, విషయగ్రహణ సామర్థ్యమూ ఇనుమడించటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని