మెడ మీద సంకటం

చిన్నప్పుడు మెడ దగ్గర ఉబ్బటం.. గట్టిగా గడ్డ మాదిరిగా చేతికి తగలటం చాలామందికి తెలిసిందే. ఇది ఒకట్రెండు వారాల తర్వాత హఠాత్తుగా మాయమై పోవటమూ చూసే ఉంటారు. ఉబ్బు, నొప్పితో పాటు జలుబు, దగ్గు, జ్వరం రావటమూ మామూలే.

Updated : 06 Jun 2023 07:57 IST

శరీరంలో ఉబ్బు, వాపు ఎక్కడ మొదలైనా ఆందోళన కలుగుతుంది. అదే మెడ మీద ఏర్పడితే? జలుబు, ఫ్లూ తలెత్తినప్పుడు పిల్లల్లో గవద బిళ్లలు కట్టటం తెలిసిందే. టాన్సిల్స్‌ వాచినప్పుడూ వాపు చూస్తుంటాం. ఇవి మామూలే. ఎంత త్వరగా మొదలయ్యాయో అంతే త్వరగా తగ్గుతాయి. అయితే అన్నిసార్లూ మెడ ఉబ్బు ప్రమాదకరం కాదని అనుకోవటానికి లేదు. ఇది క్షయ, క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలకూ సంకేతం కావొచ్చు. సరైన సమయంలో గుర్తించి, తగు చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాబట్టి మెడ ఉబ్బును ఎప్పుడు ప్రమాదకరంగా భావించాలి? ఎక్కడ చికిత్స తీసుకోవాలి? అనేవి తెలుసుకొని ఉండటం మంచిది.

చిన్నప్పుడు మెడ దగ్గర ఉబ్బటం.. గట్టిగా గడ్డ మాదిరిగా చేతికి తగలటం చాలామందికి తెలిసిందే. ఇది ఒకట్రెండు వారాల తర్వాత హఠాత్తుగా మాయమై పోవటమూ చూసే ఉంటారు. ఉబ్బు, నొప్పితో పాటు జలుబు, దగ్గు, జ్వరం రావటమూ మామూలే. ఎప్పుడో అప్పుడు గవద బిళ్లలు కట్టటం.. దగ్గు, జలుబు తగ్గగానే అదృశ్యం కావటం పెద్ద విషయమేమీ కాదు. ఇలాంటి తాత్కాలిక ఉబ్బుకు ప్రధాన కారణం మెడ దగ్గరి అవయవాల్లో తలెత్తే ఇన్‌ఫెక్షన్లు. ముఖ్యంగా చెవి, దంత ఇన్‌ఫెక్షన్లు ఉబ్బుకు దారితీస్తుంటాయి. గొంతులో టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌, ముక్కు చుట్టుపక్కల ఉండే గాలిగదుల్లో వాపు వంటివీ కారణం కావొచ్చు. ఆయా సమస్యలు నయం కాగానే ఉబ్బూ తగ్గిపోతుంది. నిజానికిది మనల్ని రక్షించే ప్రక్రియే. రక్తనాళాల మాదిరిగానే మన శరీరంలో లింఫ్‌ నాళాల వ్యవస్థ ఉంటుంది. ఇందులో స్వచ్ఛమైన లింఫు ద్రవం ప్రవహిస్తుంటుంది. మెడ, చంకలు, గజ్జల వంటి చోట్ల లింఫ్‌ గ్రంథులుంటాయి. వీటిని తెల్ల రక్తకణాల కేంద్రాలని అనుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్లతో పోరాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాక్టీరియా, వైరస్‌ వంటి హానికారక సూక్ష్మక్రిములను వడకట్టి, శరీరంలో ఇతర భాగాలకు విస్తరించకుండా కాపాడతాయి. ఇన్‌ఫెక్షన్‌ను అక్కడికే పరిమితం చేస్తాయి. ఈ క్రమంలోనే అక్కడ లింఫ్‌ ద్రవం పేరుకుపోయి ఉబ్బు, వాపు తలెత్తుతాయి. అందుకే ఇన్‌ఫెక్షన్‌ తగ్గగానే ఉబ్బూ తగ్గిపోతుంది. ఇలాంటి తాత్కాలిక లింఫ్‌ గ్రంథుల ఉబ్బును లింఫడెనోపతీ అంటారు. కొద్దిరోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. ఇదేమీ ప్రమాదకరం కాదు. అయితే కొన్నిసార్లు ఉబ్బు తగ్గకుండా అలాగే ఉండిపోవచ్చు. యాంటీబయాటిక్‌ మందులు, జ్వరం మాత్రలు వేసుకున్నా ఫలితం కనిపించకపోవచ్చు. పైగా రోజురోజుకీ సైజు పెరుగుతూ రావచ్చు. ఇలాంటిది కనిపిస్తే నిర్లక్ష్యం తగదు.


సైజు ఎందుకు తగ్గదు?

మెడ వద్ద ఉబ్బు, వాపు రెండు, మూడు వారాలు దాటినా తగ్గకుండా అలాగే కొనసాగుతూ వస్తుంటే అప్రమత్తం కావాల్సిందే. ఊపిరితిత్తులు, మెడ ఎముకలో తలెత్తే క్షయ దీనికి కారణం కావొచ్చు. మనదేశంలో ఇలాంటి ఉబ్బు తరచూ చూస్తుంటాం. మన నోట్లో లాలాజల గ్రంథులుంటాయి. ఆహారం నములుతున్నప్పుడు ఇవి లాలాజలాన్ని విడుదల చేస్తుంటాయి. ఈ గ్రంథులు క్షయ ప్రభావానికి గురైతే మెడ మీద ఉబ్బు తలెత్తుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో.. ముఖ్యంగా కాచని, పాశ్చరైజేషన్‌ చేయని పాలు తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆవులు, గేదెలు, మేకల వంటివి క్షయకు గురయ్యా యనుకోండి. వీటి నుంచి పితికిన పాలను పూర్తిగా కాచకుండా తాగితే క్షయ సోకే ప్రమాదముంది. ఇలా పశువుల పాల నుంచి సోకే క్షయను బొవైన్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అంటారు.


సైజు పెరుగుతూ వస్తుంటే?

ఉబ్బు, వాపు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నా.. లేదూ మెడలో చాలాచోట్ల ఉబ్బుతున్నా తేలికగా తీసుకోవటం తగదు. ఇది ఊపిరితిత్తులు, శ్వాసనాళం క్యాన్సర్లకు చిహ్నం కావొచ్చు. అంతగా లక్షణాలు, ఇబ్బందులేవీ లేకుండా కొద్ది నెలలుగా లోలోపలే క్యాన్సర్‌ పెరుగుతున్నప్పుడు మెడ దగ్గర గడ్డ మాదిరిగా ఏర్పడుతుంది. సాధారణంగా 50 ఏళ్లు దాటిన తర్వాత ఊపిరితిత్తులు, శ్వాసనాళం క్యాన్సర్లు తలెత్తుతుంటాయి. అందువల్ల 50ల్లో ఉన్నవారు మెడ వద్ద శాశ్వతంగా గడ్డ ఉన్నా, అది నెమ్మదిగా పెరుగుతున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. కొందరు మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌లోనూ మెడ దగ్గర ఉబ్బు కనిపిస్తుంటుంది.


మరికొన్ని కారణాలు..

మెడ ముందు భాగానికి కరచుకొని ఉండే థైరాయిడ్‌ గ్రంథిలో పుట్టుకొచ్చే కణితులూ ఉబ్బునకు దారి తీయొచ్చు. ఉమ్మి మింగుతున్నప్పుడు ఉబ్బు పైకీ, కిందికీ కదులుతుంటే థైరాయిడ్‌ గ్రంథిలో వాపు ఉండొచ్చని అనుమానించాలి. కొన్నిసార్లు గతంలో మెడకు తాకిన గాయాలతోనూ ఉబ్బు పైకి కొట్టొచ్చినట్టుగా కనిపించొచ్చు. తాకితే చేతికి గడ్డ మాదిరిగానూ తగలొచ్చు.


లింఫోమాలతోనూ..

కొన్ని సందర్భాల్లో లింఫ్‌ నాళాలు, లింఫ్‌ గ్రంథుల ఆకారం హఠాత్తుగా, వేగంగా మారిపోవచ్చు. మెడలో కణితి మాదిరి గడ్డ ఏర్పడొచ్చు. సైజూ పెరుగుతూ రావొచ్చు. ఇలాంటి రకం కణితిని లింఫోమా అంటారు. ఇది సాధారణంగా మెడ వద్ద ఏర్పడుతుంటుంది. ఇందులో హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా, నాన్‌ హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా అని రెండు రకాలున్నాయి. వీటిని ఒకరకంగా సగం క్యాన్సర్ల విభాగంలో చేర్చొచ్చు. కొన్నిసార్లు వీటిల్లో క్యాన్సర్‌ మార్పులూ తలెత్తొచ్చు (లింఫాటిక్‌ కార్సినోమా).

* కొందరికి మెడలోని రక్తనాళాల్లోనూ కణితులు ఏర్పడొచ్చు. చాలా చిన్నగా, పైకి కనిపించకుండా ఉండే ఇవి పుట్టినప్పటి నుంచే ఉండొచ్చు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ ఇవీ పెద్దగా అవుతూ వస్తుంటాయి. కొన్ని కణితులు సిరల్లో ఏర్పడుతుంటాయి (లింఫోవీనస్‌ మాల్‌ఫార్మేషన్‌). ఇవి కదలవు. నెమ్మదిగా పెరుగుతూ వస్తాయి. తాకితే చేతికి తగలవు. అయితే కణితులు చేతికి తగులుతున్నా, టిక్‌ టిక్‌ మనే చప్పుడు వస్తున్నా అవి ధమనుల గోడకు అంటుకున్నాయనే అర్థం. లేదూ రక్తనాళాల గోడల్లోనే కణితి తలెత్తి ఉండొచ్చు. ఇది గుండె నుంచి మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన ధమనిలో (కెరటిడ్‌ బాడీ ట్యూమర్‌) ఏర్పడొచ్చు. ఇలాంటిది గమనిస్తే వెంటనే వ్యాస్కులర్‌ సర్జన్‌ను సంప్రదించటం మంచిది. ధమనికి రంధ్రం పడితే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి సూదితో ముక్కను తీసి పరీక్షించే నీడిల్‌ బయాప్సీ గానీ ట్రూ-కట్‌ బయాప్సీ గానీ అసలే చేయించుకోవద్దు.


ఏం చేయాలి?

మెడలో ఉబ్బు, వాపును చాలామంది తేలికగా తీసుకుంటారు. అదే తగ్గిపోతుందిలే అని అనుకుంటుంటారు. ఇది తగదు. ఉబ్బు తగ్గకుండా వేధిస్తుంటే వ్యాస్కులర్‌ సర్జన్‌ను సంప్రదించటం మంచిది. దీంతో మెడలోని రక్తనాళంలో కణితి ఉంటే సత్వరం గుర్తించటానికి వీలుంటుంది. అనవసరంగా బయాప్సీ చేయటం తప్పుతుంది. మెడలో ఇతర చోట్ల ఏర్పడిన కణితులకూ వ్యాస్కులర్‌ సర్జన్‌తోనే బయాప్సీ చేయించుకోవటం, తొలగించుకోవటం మంచిది. కణితికి చుట్టుపక్కల ఉండే రక్తనాళాలు దెబ్బతినే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. బయాప్సీ ఫలితాల అనంతరం చికిత్స కోసం ఇతర నిపుణులను కలుసుకోవచ్చు.


ఇతర పరీక్షలు 

చాలావరకు మెడ వద్ద ఉబ్బు, వాపు తీరు ఆధారంగా సమస్యను అనుమానిస్తారు. అవసరమైతే పరీక్షలు చేయిస్తారు. రక్త నాళాల్లో కాకుండా ఇతర చోట్ల ఏర్పడిన మెడ ఉబ్బులను నిర్ధరించటానికి ప్రధానమైన పరీక్ష ఫైన్‌ నీడిల్‌ ఆస్పిరేషన్‌ బయాప్సీ. ఇందులో సూది ద్వారా చిన్న ముక్కను బయటకు తీస్తారు. దీన్ని విశ్లేషించటానికి పరీక్షకు పంపిస్తారు. బయాప్సీలో తేలిన అంశాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు మెడ, ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలూ అవసరమవుతాయి. కొందరికి బ్రాంకోస్కోపీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో యాంజియోగ్రఫీ కూడా చేయాల్సి రావొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా గమనించాల్సిన విషయం- ధమనిలో ఏర్పడిన కణితికి ఎట్టి పరిస్థితుల్లోనూ బయాప్సీ చేయొద్దనేదే.


చికిత్స ఏంటి?

బయాప్సీలో క్షయ బయట పడితే వెంటనే చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా నిర్ణీత కాలం వరకు మందులు వాడితే క్షయ పూర్తిగా తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉండి.. ఛాతీలో నీరు, చీము చేరితే వీటిని బయటకు తీయటానికి సర్జరీ అవసరమవుతుంది. ఒకవేళ ఊపిరితిత్తి పాక్షికంగా గానీ పూర్తిగా గానీ దెబ్బతిన్నా.. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ తొలిదశలో ఉన్నా శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. దెబ్బతిన్న ఊపిరితిత్తిని, కణితిని తొలగించాల్సి ఉంటుంది. అయితే అన్ని ఆధునిక సదుపాయాలు గల ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి. మెడ ఉబ్బుకు దారితీస్తున్న కారణాలను సరిగా గుర్తించటం, తగు చికిత్స చేయటం చాలా చాలా ముఖ్యం. లేకపోతే అవనసర, తప్పుడు చికిత్సలకు దారితీస్తుంది. ఖర్చు, సమయం వృథా అవుతాయి. అప్పటికే పూడ్చుకోలేనంత నష్టం జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని