ఎత్తు మరీ తగ్గుతుంటే..

వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నకొద్దీ మన ఎత్తు తగ్గుతూ వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం వెన్నుపూసలు మధ్యలోని డిస్కులు చదునుగా కావటం. కండరాల మోతాదు తగ్గుతుండటం. ఫలితంగా పూసల మధ్య ఖాళీ భాగం..

Updated : 01 Jan 2019 15:10 IST

ఎత్తు మరీ తగ్గుతుంటే..

వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నకొద్దీ మన ఎత్తు తగ్గుతూ వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం వెన్నుపూసలు మధ్యలోని డిస్కులు చదునుగా కావటం. కండరాల మోతాదు తగ్గుతుండటం. ఫలితంగా పూసల మధ్య ఖాళీ భాగం తగ్గిపోయి పొడవు తగ్గుతుంటుంది. ఇది వయసుతో పాటు వచ్చే సాధారణ మార్పేనని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది అన్నిసార్లూ నిజం కాకపోవచ్చు. అర అంగుళం, నుంచి ముప్పావు అంగుళం వరకు ఎత్తు తగ్గటం మామూలే. కానీ కొందరు 3-4 అంగుళాల ఎత్తు వరకూ తగ్గుతుంటారు. ఇలా మరీ ఎక్కువగా పొడవు తగ్గుతుంటే మాత్రం ఎముకలు గుల్లబారటానికి (ఆస్టియోపోరోసిస్‌) సూచిక కావొచ్చని గుర్తించాలి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత ఇలాంటి ధోరణిని గుర్తిస్తే జాగ్రత్త పడాల్సిందే. మనకు 30 ఏళ్ల వయసు వచ్చేవరకూ ఎముక సాంద్రత పెరుగుతూ వస్తుంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత దీని తీరు మారిపోతుంది. ఎముక దృఢం కావటం కంటే కూడా క్షీణించే వేగం ఎక్కువవుతూ వస్తుంటుంది. దీంతో క్రమంగా ఎముకలు గుల్లబారటం మొదలవుతుంది. మహిళల్లోనైతే నెలసరి నిలిచిన తర్వాత ఇది మరింత ఎక్కువ వేగం పుంజుకుంటుంది కూడా. గమనించాల్సిన విషయం ఏంటంటే- ఎముకలు గుల్లబారుతున్నా పైకి నొప్పి వంటి లక్షణాలేవీ కనబడకపోవటం. ఎముకలు గుల్లబారటం వల్ల చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవచ్చు. కొందరికి మామూలుగా తూలి కిందపడినా కూడా ఎముక విరిగిపోవచ్చు. చాలామంది తుంటి, వెన్నెముక, మోచేయి విరగటం బారినపడుతుంటారు. తుంటి ఎముక, వెన్నెముక విరగటం మూలంగానే ఎంతోమంది మంచాన పడి.. కోలుకోలేక ప్రాణాల మీదికి తెచ్చుకోవటం తరచుగా చూస్తున్నదే. అంతమాత్రాన చింతించాల్సిన పనేమీ లేదు. ఎముకలు గుల్లబారటాన్ని తగ్గించుకోవటానికి మార్గం లేకపోలేదు. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. కాబట్టి రోజుకు 1,200 మిల్లీగ్రాముల క్యాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది. నడక, జాగింగ్‌, సైకిల్‌ తొక్కటం, ఈత, బరువులు ఎత్తటం వంటివి ఎముకల్లోకి క్యాల్షియం చేరుకునేలా చేస్తాయి. ఫలితంగా ఎముక దృఢత్వం పెరుగుతుంది. ఏదైనా తేడా అనిపిస్తే ఎముక సాంద్రతను తెలిపే పరీక్ష చేయించుకోవటం మంచిది. మహిళలైతే నెలసరి నిలిచినప్పట్నుంచీ.. పురుషులైతే 60ల్లో ముందస్తుగా ఎముకసాంద్రత పరీక్ష చేయించుకోవటం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని