అబార్షన్‌ చేయించుకుంటే మున్ముందు ఇబ్బందులా?

సమస్య: నాకు 4 నెలల క్రితం పెళ్లయ్యింది. ఇటీవల జ్వరం వచ్చినపుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి గర్భం ధరించానని చెప్పారు. అయితే మేం ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఇప్పుడు అబార్షన్‌ ...

Published : 12 Oct 2018 22:27 IST

అబార్షన్‌ చేయించుకుంటే మున్ముందు ఇబ్బందులా?

సమస్య: నాకు 4 నెలల క్రితం పెళ్లయ్యింది. ఇటీవల జ్వరం వచ్చినపుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి గర్భం ధరించానని చెప్పారు. అయితే మేం ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఇప్పుడు అబార్షన్‌ చేయించుకుంటే మున్ముందు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? మందులతో అబార్షన్‌ చేయించుకోవటం మంచిదా? సర్జరీ పద్ధతి అయితే మేలా?

- సరస్వతి, హైదరాబాద్‌  

సలహా: అప్పుడే పిల్లలు వద్దనుకుంటే ముందుగానే డాక్టర్‌ దగ్గరికి వెళ్లి కుటుంబ నియంత్రణ సలహాలు తీసుకొని, ఆచరించటం అన్నింటికన్నా మంచి పద్ధతి. మీరు రాసిన ఉత్తరం చూస్తుంటే అలాంటి అబార్షన్‌ చేయించుకుంటే మున్ముందు ఇబ్బందులా?జాగ్రత్తలేవీ తీసుకోలేదనే అనిపిస్తుంది. ఇప్పుడు గర్భం ధరించానని చెబుతున్నారు గానీ ఎన్నో నెలో వివరించలేదు. ఒకవేళ 9 వారాల లోపైతే మందులతో గర్భస్రావానికి ప్రయత్నించొచ్చు. అయితే మందులతో పిండం పూర్తిగా బయటకు వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ ఏవైనా ముక్కలు లోపల మిగిలిపోతే గర్భసంచిని శుభ్రం చేయాల్సి వస్తుంది. గర్భం ధరించి 9 వారాలు దాటితే సర్జరీ ద్వారా అబార్షన్‌ చేయాల్సి ఉంటుంది. పద్ధతి ఏదైనా గానీ- గర్భసంచి లోపల ఏమైనా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తితే అండనాళాలు మూసుకుపోయే ప్రమాదముందని గుర్తించాలి. అదే జరిగితే తిరిగి గర్భం ధరించటం కష్టమవుతుంది. గర్భసంచిని శుభ్రం చేసేటప్పుడు లోపలి పొర ఎక్కడైనా దెబ్బతింటే అది గర్భసంచి కండరంలోకి చొచ్చుకుపోయి అడినోమయోసిస్‌ అనే సమస్యకు దారితీయొచ్చు. దీని మూలంగా నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా రావటం, రుతుస్రావం అధికంగా అవటం, సంతానం కలగకపోవటం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి ఇలాంటి అన్ని విషయాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది. ఒకవేళ అబార్షన్‌ చేయించుకోవాలని అనుకుంటే నైపుణ్యం గల డాక్టర్లనే సంప్రతించాలి. అన్ని సదుపాయాలు గల ఆసుపత్రుల్లోనే చేయించుకోవాలి. ఎందుకంటే గర్భసంచిని శుభ్రం చేసే సమయంలో అరుదుగా కొన్నిసార్లు లోపల రంధ్రం పడొచ్చు. అప్పుడు వెంటనే సర్జరీ చేసి రంధ్రాన్ని మూసేయాల్సి ఉంటుంది. అలాగే ఆసుపత్రికి అబార్షన్లు చేయటానికి అనుమతి ఉందో లేదో కూడా చూసుకోవాలి.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా  
సమస్య - సలహా సుఖీభవ  
ఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 
email:  sukhi@eenadu.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని