కమ్మటి నిద్ర శిశువులకు వరం

రాత్రిపూట కమ్మటి నిద్ర ఏ వయసులోనైనా అవసరమే. శిశువులకైతే మరీనూ. రాత్రిపూట తరచూ మేల్కొనకుండా, ఎక్కువసేపు గాఢ నిద్రపోయే శిశువులకు తొలి ఆర్నెల్లలో అధిక బరువు ముప్పు తక్కువని తాజా అధ్యయనం పేర్కొంటోంది మరి. ఇందులో భాగంగా 298 మంది శిశువులను ఎంచుకొని, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నిద్ర తీరుతెన్నులను పరిశీలించారు.

Published : 26 Oct 2021 00:20 IST

రాత్రిపూట కమ్మటి నిద్ర ఏ వయసులోనైనా అవసరమే. శిశువులకైతే మరీనూ. రాత్రిపూట తరచూ మేల్కొనకుండా, ఎక్కువసేపు గాఢ నిద్రపోయే శిశువులకు తొలి ఆర్నెల్లలో అధిక బరువు ముప్పు తక్కువని తాజా అధ్యయనం పేర్కొంటోంది మరి. ఇందులో భాగంగా 298 మంది శిశువులను ఎంచుకొని, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నిద్ర తీరుతెన్నులను పరిశీలించారు. ఒక గంట సేపు ఎక్కువ నిద్రపోయినా ఊబకాయం ముప్పు 26% తగ్గుతుండటం గమనార్హం. అలాగే నిద్రలోంచి మేల్కోవటం తగ్గినకొద్దీ అధిక బరువు ముప్పు 16% వరకు తగ్గుముఖం పడుతోంది. రాత్రిపూట సరిగా నిద్రపోని శిశువులకు తల్లిదండ్రులు పాలు పట్టటం, ఘనాహారం ఆరంభించటం వంటి వాటితో సముదాయిస్తుండొచ్చు. కంటి నిండా నిద్రపోని పిల్లలకు మర్నాడు ఆకలి వేస్తున్నట్టు అనిపించొచ్చు. అలసటకూ గురికావొచ్చు. దీంతో మరింత ఎక్కువగానూ తినొచ్చు, తక్కువగా కదలొచ్చు. ఇవన్నీ బరువు పెరగటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల తొలిదశలో ఊబకాయాన్ని తగ్గించటానికి శిశువులకు కమ్మటి నిద్ర ఎంతైనా అవసరమని సూచిస్తున్నారు. అన్ని వయసుల్లో మాదిరిగానే నిద్ర, ఊబకాయం మధ్య సంబంధం శైశవంలోనూ కనిపిస్తోందని, ఇది మున్ముందు ఆరోగ్యం తీరుతెన్నులను అంచనా వేయటానికి ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రకూ ఆరోగ్యానికీ అవినాభావ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పిల్లల విషయంలోనైతే ఊబకాయం, మధుమేహం ముప్పు తగ్గుతుంది. ఎదుగుదల సక్రమంగా సాగుతుంది. నేర్చుకోవటం, ప్రవర్తన మెరుగవుతాయి. కాబట్టి శిశువుల నిద్రపై ఓ కన్నేసి ఉంచటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని