Childhood Cancer: బాల క్యాన్సర్‌ భయమేల?

పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్‌ వస్తే? ప్రాణమే పోయినంత పనవుతుంది. తగ్గుతుందో లేదో, మున్ముందు ఎలా ఉంటుందో అనే ఆలోచనలతో మనసు అల్లాడిపోతుంది. అయితే అంత అధైర్య పడాల్సిన పనిలేదు. పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయమయ్యేవే. కావాల్సిందల్లా సత్వరం స్పందించటం.  భయపడకుండా ఉండటం. మనం ధైర్యంగా ఉంటూ పిల్లల్లో ధైర్యం నింపటం. అందుకే అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్‌ దినం కూడా ‘మీ చేతులతో మెరుగైన మనుగడ సాధ్యమే’ అని నినదిస్తోంది.

Updated : 15 Feb 2022 09:30 IST


నేడు ఇంటర్నేషనల్‌ చైల్డ్‌హుడ్‌ క్యాన్సర్‌ డే

పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్‌ వస్తే? ప్రాణమే పోయినంత పనవుతుంది. తగ్గుతుందో లేదో, మున్ముందు ఎలా ఉంటుందో అనే ఆలోచనలతో మనసు అల్లాడిపోతుంది. అయితే అంత అధైర్య పడాల్సిన పనిలేదు. పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయమయ్యేవే. కావాల్సిందల్లా సత్వరం స్పందించటం.  భయపడకుండా ఉండటం. మనం ధైర్యంగా ఉంటూ పిల్లల్లో ధైర్యం నింపటం. అందుకే అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్‌ దినం కూడా ‘మీ చేతులతో మెరుగైన మనుగడ సాధ్యమే’ అని నినదిస్తోంది.

క్యాన్సర్‌ అనగానే ముందుగా పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే. పెద్ద వయసులో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువే. అలాగని పిల్లలకు రాకూడదనేమీ లేదు. క్యాన్సర్‌ బాధితుల్లో 5% మంది పిల్లలే. పద్నాలుగేళ్ల లోపువారిలో వచ్చే వాటిని చైల్డ్‌హుడ్‌ క్యాన్సర్లు అంటారు. వీరిలో కారణాలేవీ లేకుండా తలెత్తే క్యాన్సర్లే ఎక్కువ. చెడు అలవాట్ల వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా పిల్లలు క్యాన్సర్‌ బారినపడటం ఒకరకంగా దురదృష్టకరమనే అనుకోవచ్చు. ఇందులో చిన్నారుల తప్పేమీ లేదు. పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. వంశ పారంపర్యంగా.. అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్‌ బారినపడి ఉండటం వల్ల రావచ్చు. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా రావచ్చు. మంచి విషయం ఏంటంటే- పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయం చేయదగినవే! పెద్దవారిలో 60-65% మందిలో క్యాన్సర్‌ తగ్గితే.. పిల్లల్లో 85-90% మందిలో పూర్తిగా నయమవుతుంది. పిల్లల్లో క్యాన్సర్‌ నయమయ్యే స్వభావం ఎక్కువ. పెద్దవాళ్లకు కీమోథెరపీ నుంచి కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పిల్లలకు కీమోథెరపీ మాత్రమే కాదు.. ఎముకమజ్జ మార్పిడి వంటి పెద్ద చికిత్సలు చేసినా వేగంగా కోలుకుంటారు. సర్జరీ నుంచీ తేలికగా, త్వరగా బయటపడతారు. కోత త్వరగా మానుతుంది. పైగా పిల్లలకు చికిత్స చేయటమూ సులభమే. కాస్త చనువు పెరిగితే డాక్టర్లతో సన్నిహితంగా మెలుగుతారు. మాటల మధ్యలోనే చికిత్స చేయటం వీలవుతుంది. కాబట్టి ‘అయ్యో.. పిల్లలకు ఇదేం కర్మ’ అని అనుకోవద్దు. ధైర్యంగా ఉండాలి. పిల్లల్లో ధైర్యాన్ని నింపాలి. 3-4 నెలలు చికిత్స చేస్తే తిరిగి మామూలుగా అవుతారని తెలుసుకోవాలి.

క్యాన్సర్లు- రకరకాలు

బాల్య క్యాన్సర్లు పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్ల వంటివి కావు. కాలుష్యం, తినే పదార్థాలు, రసాయనాల వంటి పరిసరాల ప్రభావంతో (ఎక్సోజీనస్‌) తలెత్తే ఊపిరితిత్తులు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ల వంటివి పిల్లలకు రావు. వీరిలో రక్తక్యాన్సర్‌ (ల్యుకీమియా), లింఫ్‌ వ్యవస్థ క్యాన్సర్‌ (లింఫోమా), మెదడు క్యాన్సర్‌, ఎముక క్యాన్సర్‌ (బోన్‌ సార్కోమా), కంటి క్యాన్సర్‌ (రెటీనోబ్లాస్టోమా), నాడీ కణాల క్యాన్సర్‌ (న్యూరోబ్లాస్టోమా), కిడ్నీ క్యాన్సర్‌ (విల్మ్స్‌ ట్యూమర్‌), కండర క్యాన్సర్‌ (రాబ్డోమయోసార్కోమా) ఎక్కువగా కనిపిస్తుంటాయి.


గుర్తించాలి- సత్వరం

పిల్లల్లో క్యాన్సర్లను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించటం సాధ్యమవుతుంది. ఆయా లక్షణాల ద్వారా వీటిని గుర్తించొచ్చు. క్యాన్సర్ల రకాలను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి.

* రక్తక్యాన్సర్‌లో- చర్మం, కళ్లు పాలిపోవటం ప్రధాన లక్షణం. బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గటమూ ఉంటాయి. పిల్లలు నడుస్తుంటే ఆయాస పడొచ్చు. ఆటల్లో త్వరగా అలసిపోయి, ఇంటికి వచ్చి పడుకోవచ్చు. గాయాలైనప్పుడు రక్తస్రావం ఆగదు. చర్మం కమిలిపోవచ్చు.

* మెదడు క్యాన్సర్‌లో- తలనొప్పి, చూపు మసకబారటం, అకారణంగా రోజూ వాంతి కావటం, నడుస్తుంటే తడబడటం, మూర్ఛ వంటివి కనిపిస్తాయి.

* నాడీకణాల క్యాన్సర్‌లో- కణితి పెద్దగా అయ్యేంతవరకు లక్షణాలేవీ ఉండవు. పెద్దగా అవుతున్న కొద్దీ కడుపులో నొప్పి వస్తుంది. స్నానం చేయిస్తున్నప్పుడు చేతికి కణితి తగులుతుంటుంది.

* కిడ్నీ క్యాన్సర్‌లో- స్నానం చేయిస్తున్నప్పుడో, ఒళ్లు నిమురుతున్నప్పుడో కడుపు మీద కణితిలాంటిది చేతికి తగులుతుంది. ఇందులో జ్వరం, నొప్పి, వాంతి, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు ఉండొచ్చు.

* లింఫ్‌ క్యాన్సర్‌లో- కణితి తలెత్తిన చోటును బట్టి లక్షణాలు కనిపిస్తాయి. బరువు తగ్గటం, జ్వరం, నిస్సత్తువ.. చంక, మెడ, గజ్జల్లో లింఫ్‌ గ్రంథుల వాపు వంటివి ఉంటాయి.

* కంటి క్యాన్సర్‌లో- ఫొటోలతో దీన్ని తేలికగా కనుక్కోవచ్చు. ఫొటో తీసినప్పుడు కంట్లో తెల్లగా ఫ్లాష్‌లాగా మెరిసినట్టు కనిపిస్తుంది.

* ఎముక క్యాన్సర్‌లో- కాళ్ల మీద గానీ చేతుల మీద ఉబ్బు కనిపిస్తుంది. ముఖ్యంగా దెబ్బలేవీ తగలకుండా అకారణంగా ఉబ్బితే నిర్లక్ష్యం చేయొద్దు.

* కండర క్యాన్సర్‌లో- ఇది తల, మెడ, గజ్జలు, కడుపు, కటి భాగం, చేతులు, కాళ్లు.. ఇలా ఒంట్లో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఇందులో ఆయా భాగాల్లో వాపు, లింఫ్‌ గ్రంథులు ఉబ్బటం ప్రధానంగా కనిపిస్తాయి.


చికిత్స- కీమోథెరపీ ముఖ్యం

పిల్లల క్యాన్సర్లలో కీమోథెరపీ చాలా ముఖ్యం. కొన్నిసార్లు సర్జరీ చేయాల్సి రావొచ్చు.

* రక్తక్యాన్సర్‌లో ప్రధానమైనవి అక్యూట్‌ లింఫోసైటిక్‌ ల్యుకీమియా, అక్యూట్‌ మైలాయిడ్‌ ల్యుకీమియా. ఇలాంటివి త్వరగా ముదురుతాయి. కాబట్టి సత్వరం చికిత్స అవసరం. ఒకో రకానికి ఒకో రకమైన చికిత్స చేయాల్సి ఉంటుంది. ల్యుకీమియా, లింఫోమాల్లో 90% మంది పిల్లలకు కీమోనే సరిపోతుంది. కొందరికి ఎముక మజ్జ మార్పిడీ అవసరమవుతుంది.

* రెటీనా బ్లాస్టోమా 99% శాతం మందికి నయమవుతుంది. దాదాపు 65% మందికి కన్ను తొలగించాల్సిన అవసరమేమీ ఉండదు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 దశలో లేజర్‌ ద్వారా క్యాన్సర్‌ తలెత్తిన భాగాన్ని నేరుగా కాల్చేయొచ్చు. గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 దశల్లో కీమోథెరపీ ఉపయోగపడుతుంది. దీంతోనే చాలావరకు నయమవుతుంది. ఒకవేళ పూర్తిగా నయం కాకపోయినా జబ్బు తీవ్రత తగ్గుతుంది. అప్పుడు లేజర్‌తో చికిత్స చేస్తే కుదురుకుంటారు. గ్రూప్‌ 5 దశలో ఉంటే కన్ను తొలగించి, తర్వాత క్యాన్సర్‌ తిరగబెట్టకుండా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది.

* పిల్లల్లో మాత్రమే వచ్చే విల్మ్స్‌ ట్యూమర్‌ను తేలికగా నయం చేయొచ్చు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 దశలో తదనంతర చికిత్స కూడా అవసరం లేదు. గ్రూప్‌ 3 దశలో ఉంటే కీమోథెరపీ అవసరమవుతుంది. రేడియేషన్‌ కూడా అవసరమవ్వచ్చు.

* నాడీ కణాల క్యాన్సర్‌లో సర్జరీ ద్వారా కణితిని తొలగించి, తర్వాత కీమో ఇస్తారు. రేడియేషన్‌ అవసరం లేదు.

* ఎముక క్యాన్సర్‌లో దెబ్బతిన్న ఎముకను కత్తిరించి, తొలగిస్తారు. ఆ భాగంలో కృత్రిమ పరికరాన్ని అమరుస్తారు.

* కండరాల కణితులనూ సర్జరీతో తొలగించాల్సి ఉంటుంది.

* మెదడు కణితులను సర్జరీ చేసి తొలగిస్తారు.


రేడియేషన్‌ జాగ్రత్తగానే..

రేడియేషన్‌ దుష్ప్రభావాలు 10, 20 సంవత్సరాల తర్వాత కూడా బయటపడే అవకాశముంది. అందుకే వీలైనంతవరకు రేడియేషన్‌ లేకుండానే చికిత్స చేయటానికే ప్రయత్నిస్తారు. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో రేడియేషన్‌ అవసరమవ్వచ్చు. 

* తీవ్ర కంటి క్యాన్సర్‌లో కన్ను తొలగించినా జబ్బు తిరగబెట్టే అవకాశముంటుంది. కాబట్టి రేడియేషన్‌ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే రేడియేషన్‌ ఇచ్చినచోట ఎముక పెరగదు. దీంతో ఆ భాగం చిన్నగా కనిపిస్తుంది. అంతేకాదు రేడియేషన్‌తో 20, 30 ఏళ్ల తర్వాత మళ్లీ క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. అందుకే వీలైనంతవరకు రేడియేషన్‌ ఇవ్వకుండా చికిత్స చేయటానికే ప్రయత్నిస్తారు.

* రక్తక్యాన్సర్‌లో కీమోథెరపీ మందులు మెదడు వరకు వెళ్లవు. క్యాన్సర్‌ కణాలు అప్పటికే మెదడుకు చేరుకొని ఉంటే ప్రమాదకరంగా పరిణమించే అవకాశముంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మెదడుకు రేడియేషన్‌ ఇవ్వాల్సి వస్తుంది. రేడియేషన్‌ ప్రభావంతో మెదడు ఎదుగుదల కుంటుపడే ప్రమాదముంది. దీన్ని తగ్గించటానికి రేడియేషన్‌ మోతాదును చాలా స్వల్పంగానే ఇస్తారు. ప్రస్తుతం రేడియేషన్‌ అవసరం లేని కీమోథెరపీ పద్ధతులూ అందుబాటులోకి వచ్చాయి.

* మెదడు మధ్యలో లేదా మస్తిష్క మూలంలో కణితులుంటే సర్జరీకి వీలుగా కాదు. వీరికి నేరుగా రేడియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధునాతన పద్ధతుల సాయంతో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా రేడియేషన్‌ ఇవ్వటానికి సాధ్యమవుతోంది.

ప్రత్యేక జాగ్రత్తలేవీ అవసరం లేదు

ఒకసారి క్యాన్సర్‌ నయమయ్యాక ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. మామూలుగా అందరిలాగే హాయిగా జీవిస్తారు. కీమోథెరపీ దుష్ప్రభావాలు ఒకట్రెండు నెలల వరకే ఉంటాయి. తర్వాత ఇబ్బందులేవీ ఉండవు. పెద్దవారిలో క్యాన్సర్‌ చికిత్స పూర్తయ్యాక ఐదేళ్లు దాటితే గానీ నయమైందని చెప్పలేం. అదే పిల్లల్లో రెండేళ్లు దాటినా జబ్బు తిరగబెట్టకపోతే పూర్తిగా నయమైనట్టుగానే భావించొచ్చు.


నిర్ధరణ- ఒకోటి ఒకోలా

కణితిని నొక్కి పరిశీలించటం, లక్షణాల ద్వారా క్యాన్సర్‌ను అనుమానిస్తారు. రక్త పరీక్షలు, స్కానింగ్‌, ఆయా భాగాల నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం (బయాప్సీ) ద్వారా క్యాన్సర్‌ను నిర్ధరిస్తారు. అయితే ఆయా క్యాన్సర్లను బట్టి నిర్ధరణ పద్ధతులు ఆధారపడి ఉంటాయి.

* క్యాన్సర్లలో రక్త, లింఫ్‌ క్యాన్సర్లు భిన్నమైనవి. ఇందులో కణితుల వంటివేవీ ఏర్పడవు. రక్తంలో తెల్ల రక్తకణాలు, లింఫోసైట్‌ అనే తెల్ల రక్తకణాలు విపరీతంగా పెరిగిపోవటమే వీటికి మూలం. కొన్నిసార్లు అసాధారణ లింఫోసైట్‌ కణాలు లింఫ్‌ గ్రంథుల వద్ద పేరుకుపోయి గడ్డల వంటివి ఏర్పడొచ్చు. సాధారణంగా ఎముకమజ్జలో తయారయ్యే రక్తకణాలు పరిపక్వమైన తర్వాతే రక్తంలో కలుస్తాయి. కానీ రక్త, లింఫ్‌ క్యాన్సర్లలో ఇవి పరిపక్వం కాకముందే రక్తంలోకి వస్తాయి. మామూలుగా తెల్ల రక్తకణాలు 3-4 వేల మధ్యలో ఉంటాయి. రక్తక్యాన్సర్‌లో ఇవి 50 వేలు, లక్షకు మించిపోతాయి. వీటిని మామూలు రక్తపరీక్షతోనే గుర్తించొచ్చు. తర్వాత అవసరమైన పరీక్షలు చేసి రక్తక్యాన్సర్‌ ఏ రకానికి చెందినద్నది నిర్ధరిస్తారు.

* మెదడు క్యాన్సర్‌ నిర్ధరణకు సీటీ స్కాన్‌ కన్నా ఎంఆర్‌ఐ ఉత్తమం. ఇందులో రేడియేషన్‌ దుష్ప్రభావాలు ఉండవు. చిన్న చిన్న కణితులూ బయటపడతాయి. సీటీస్కాన్‌లో కన్నా ఎంఆర్‌ఐలో కణితులు స్పష్టంగా కనిపిస్తాయి.

* రెటీనా బ్లాస్టోమాను ఆప్థల్మాస్కోపీతోనే నిర్ధరించొచ్చు. సాధారణంగా కంటి లోపల విట్రస్‌ ద్రవం నల్లగా ఉంటుంది. కంటి క్యాన్సర్‌లో ఈ ద్రవంలో తెల్లటి పూతలాంటి మచ్చలు కనిపిస్తాయి.


కణాల పనితీరు అస్తవ్యస్తమై..

మన శరీరం అవసరమైనప్పుడే కణాలను సృష్టించుకుంటుంది.  మామూలు కణాలు ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ, విభజన చెందుతుంటాయి. కాలం తీరాక లేదా దెబ్బతిన్నప్పుడు వాటంతటవే చనిపోతాయి. వీటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. కానీ క్యాన్సర్‌ కణాలు అలాకాదు. నియంత్రణ అనేదే లేకుండా విభజన చెందుతూనే ఉంటాయి. వృద్ధి చెందుతూనే వస్తాయి. చివరికి కణితిలా ఏర్పడతాయి. క్యాన్సర్‌ కణాలు అక్కడికే పరిమితం కావు. చుట్టుపక్కల కణజాలాల్లోకీ చొచ్చుకెళ్తాయి. వాటిని కూడా దెబ్బతీస్తాయి. ఇతర శరీర భాగాలకూ విస్తరిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని