పిల్లలకు వింత హెపటైటిస్‌!

ఇటీవల కొన్నిదేశాల్లో పిల్లల్లో ఉన్నట్టుండి కాలేయవాపు (హెపటైటిస్‌) ఉద్ధృతం కావటం కలవరం కలిగిస్తోంది. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియకపోవటం విచిత్రం. చాలామందిలో దానంతటదే తగ్గుతున్నప్పటికీ కొందరికి తీవ్రంగా పరిణమిస్తోంది. కాలేయ మార్పిడి కూడా అవసరమవుతోంది. కొందరు పిల్లలు మరణిస్తున్నారు కూడా. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా, యూరప్‌లో.. ముఖ్యంగా బ్రిటన్‌లో ఈ కొత్తరకం కాలేయవాపు కేసులు ఎక్కువగా...

Updated : 24 May 2022 07:49 IST

ఇటీవల కొన్నిదేశాల్లో పిల్లల్లో ఉన్నట్టుండి కాలేయవాపు (హెపటైటిస్‌) ఉద్ధృతం కావటం కలవరం కలిగిస్తోంది. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియకపోవటం విచిత్రం. చాలామందిలో దానంతటదే తగ్గుతున్నప్పటికీ కొందరికి తీవ్రంగా పరిణమిస్తోంది. కాలేయ మార్పిడి కూడా అవసరమవుతోంది. కొందరు పిల్లలు మరణిస్తున్నారు కూడా. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా, యూరప్‌లో.. ముఖ్యంగా బ్రిటన్‌లో ఈ కొత్తరకం కాలేయవాపు కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఐర్లాండ్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీ, కెనడా వంటి దేశాల్లోనూ కనిపిస్తోంది. ఏడాది నుంచి 17 ఏళ్ల మధ్య వయసువారు దీనికి గురవుతున్నారు. ప్రస్తుతానికిది మనదేశంలో వచ్చినట్టు దాఖలాలు లేవు గానీ అసలే రాలేదనుకోవటానికి లేదు. కొద్దోగొప్పో వచ్చినా గుర్తించలేకపోయి ఉండొచ్చు. అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటున్న తరుణంలో మున్ముందు దీని ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డితో సుఖీభవ ముచ్చటించింది. పిల్లల్లో చిత్రమైన కాలేయవాపు తీరుతెన్నులు, వ్యాప్తి, ప్రమాద తీవ్రత, నివారణ చర్యల గురించి ఆయన చెబుతున్న వివరాలు ఇవీ..


కాలేయం కీలకం

కాలేయం చాలా కీలకమైన అవయవం. కడుపులో కుడివైపున పైన ఉండే ఇది 500కు పైగా పనులు చేస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదుల నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. వీటి పనితీరును నియంత్రిస్తుంది. రక్తంలోంచి మందులను ఇతరత్రా విషతుల్యాలను బయటకు వెళ్లగొడుతుంది. రక్తంలో ఐరన్‌ మోతాదులను నియంత్రిస్తుంది. రక్తంలోంచి బ్యాక్టీరియాను నిర్మూలించటం ద్వారా ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూస్తుంది. ఇంత కీలకమైంది కాబట్టే కాలేయం ఏమాత్రం దెబ్బతిన్నా మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. మంచి విషయం ఏంటంటే- కాలేయం మహా గట్టిది. ఎక్కడైనా దెబ్బతిన్నా తిరిగి కోలుకుంటుంది.


మామూలు హెపటైటిస్‌కు ప్రస్తుతం విజృంభిస్తున్న జబ్బుకు తేడా ఏంటి?

ఉన్నట్టుండి తలెత్తే కాలేయవాపును అక్యూట్‌ హెపటైటిస్‌ అంటాం. ఇది సాధారణంగా హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ ఇన్‌ఫెక్షన్లతో వస్తుంటుంది. మనదేశం పిల్లల్లో ప్రధానంగా హెపటైటిస్‌ ఎ మూలంగా కాలేయవాపు చూస్తుంటాం. ఇది ప్రధానంగా కలుషిత నీరు, ఆహారం ద్వారా సంక్రమిస్తుంది. పాశ్చాత్యదేశాల్లో పరిశుభ్రమైన నీరు, ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా హెపటైటిస్‌ ఎ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించగలిగారు. ఈ వైరస్‌కు టీకా కూడా అందుబాటులో ఉంది. మనదేశంలోనూ హెపటైటిస్‌ ఎ టీకా పిల్లలందరికీ ఇస్తున్నారు. దీని మూలంగా చాలావరకు పిల్లల్లో కాలేయవాపును తగ్గించగలిగాం. కానీ ప్రస్తుతం కొన్నిదేశాల్లో విజృంభిస్తున్న కాలేయవాపు బారినపడ్డవారిలో హెపటైటిస్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ లేకపోవటం గమనార్హం. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 దీనికి కారణమవుతుండొచ్చని అనుమానిస్తున్నారు. కొవిడ్‌-19 రోగనిరోధక వ్యవస్థ పనితీరును మార్చేస్తోంది. కొవిడ్‌ బారినపడ్డవారిలో మధుమేహం, థైరాయిడ్‌ వాపు వంటి స్వీయరోగనిరోధక (ఆటోఇమ్యూన్‌) జబ్బులు తలెత్తుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇదే హెపటైటిస్‌కూ దారితీస్తుండొచ్చని అనుకుంటున్నారు. కానీ కాలేయవాపు తలెత్తిన పిల్లల్లో 60% మందిలో కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 కనిపించలేదు. కొవిడ్‌ టీకాతో వచ్చి ఉండొచ్చనేది మరొక అనుమానం. కానీ చిన్న పిల్లలెవరికీ కొవిడ్‌ టీకా ఇవ్వలేదు. అందువల్ల టీకా కారణం కాదనేది స్పష్టమైనట్టు అయ్యింది. దీన్ని లోతుగా పరిశీలిస్తున్న క్రమంలో చిత్రంగా ఎడినోవైరస్‌ బయటపడింది. కొత్తరకం కాలేయవాపు బారినపడ్డ కొందరు పిల్లల నుంచి తీసిన నమూనాల్లో ఈ వైరస్‌ ఉంటున్నట్టు తేలింది.

ఎడినోవైరసే కచ్చితంగా కారణమవుతోందా?

ఇదొక అనుమానం మాత్రమే. ఎడినో వైరస్‌లో చాలా రకాలున్నాయి. పిల్లల్లో అడినోవైరస్‌ 41 ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ప్రధానంగా ఆహారం, నీరు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీంతో కాలేయవాపు వస్తున్నట్టు ఇప్పటికైతే కచ్చితంగా తేలలేదు. దీనిపై బ్రిటన్‌లో పరిశోధనలు చేస్తున్నారు. ఎడినోవైరస్‌ను చింపాజీలు, కోతుల్లో ప్రవేశపెట్టి పరీక్షిస్తున్నారు. త్వరలో ఫలితాలు వెలువడొచ్చు. అప్పుడు సమస్య గురించి పూర్తిగా తెలిసే అవకాశముంది.


మనదేశానికి ముప్పు అసలే లేదనుకోవచ్చా?

మనదేశంలో ఇప్పటివరకు పిల్లల ఆసుపత్రులు గానీ పిల్లల వైద్యులు గానీ ఇలాంటి సమస్యను గుర్తించిన దాఖాలాలు లేవు. ఒకవేళ కొద్దోగొప్పో ఉన్నా మనదగ్గర పట్టుకోవటం కష్టమే. ఎందుకంటే మనదేశంలో ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు చాలా ఉన్నాయి. అందువల్ల కొత్త హెపటైటిస్‌ వచ్చినా గుర్తుపట్టలేక పోయి ఉండొచ్చు. అలాగని ముప్పు అసలే లేదని కాదు. కానీ అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి యథాస్థితికి వస్తున్న నేపథ్యంలో మనదేశంలోకి రాకూడదనేమీ లేదు. మొదట్లోనూ కొవిడ్‌-19 మనదగ్గర లేదని, రాదనే అనుకున్నాం. కానీ అనతికాలంలోనే దేశం మొత్తం వ్యాపించిన విషయం తెలిసిందే. అదృష్టమేంటంటే- ఇది హెపటైటిస్‌ ఎ మాదిరిగా అంత వేగంగా వ్యాపించటం లేదు. అక్కడక్కడా కొన్ని చోట్లనే కనిపిస్తోంది. మొదట్లో ఊహించినంత ప్రమాదకరం కావటం లేదు.


ఎడినోవైరస్‌లు చాలాకాలంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు మారింది?

నిజమే. ఎడినోవైరస్‌లు కొత్తేమీ కాదు. వీటితో జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి మామూలు లక్షణాలే కనిపిస్తాయి. ఇవి హెపటైటిస్‌కు దారితీయటమనేది అరుదు. అయితే హఠాత్తుగా ఎడినోవైరస్‌ 41 ఎందుకిలా విజృంభిస్తోందనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కొవిడ్‌-19 మూలంగా రోగనిరోధక వ్యవస్థ విపరీతంగా స్పందించే స్వభావం వల్ల ఎడినోవైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా పరిణమిస్తుండొచ్చనేది ఒక భావన. ఒకవైపు రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం, మరోవైపు ప్రమాదకరంగా మారిన ఎడినోవైరస్‌ కలగలసి హెపటైటిస్‌కు దారితీస్తుండొచ్చనే అనుమానం బలపడుతోంది. వైరస్‌ను ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థ అనవసరంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుండొచ్చని, వీటి దాడితో కాలేయమూ దెబ్బతింటుండొచ్చని అనుకుంటున్నారు.

కొత్త కాలేయవాపు లక్షణాల్లో తేడాలేమైనా ఉంటున్నాయా?

వైరస్‌ పరంగానే కాదు, లక్షణాల విషయంలోనూ కొద్దిగా తేడా కనిపిస్తోంది. మామూలుగా హెపటైటిస్‌లో విరేచనాలు, వాంతులు ఉండవు. కానీ కొత్త కాలేయవాపు బారినపడుతున్న పిల్లల్లో వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తున్నాయి. హెపటైటిస్‌ బి, సి వైరస్‌లతో వచ్చే హెపటైటిస్‌లో కాలేయం తాళ్ల మాదిరిగా గట్టిపడటానికి (సిరోసిస్‌) దారితీస్తుంది. అదృష్టవశాత్తు కొత్త జబ్బులో ఇలాంటి దీర్ఘకాల సమస్య ఏదీ కనిపించటం లేదు.  

ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు తలెత్తుతాయి?

కొత్త హెపటైటిస్‌లో తొలిరోజు జ్వరం వస్తుంది. మర్నాటి నుంచి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి మొదలవుతాయి. ఇవి రెండు, మూడు రోజుల వరకు ఉంటాయి. నాలుగో రోజు నుంచి కళ్లు కొంచెం పసుపు రంగులోకి మారటం ఆరంభిస్తాయి. ఈ సమయంలో రక్తంలో బిలిరుబిన్‌ మోతాదులు 5 మి.గ్రా. కన్నా మించి పోవచ్చు. ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ అనే కాలేయ ఎంజైమ్‌ల మోతాదులూ పెరుగుతాయి. కొందరు పిల్లల్లో ఇవి 2,000 కూడా దాటుతున్నాయి. తర్వాతి వారంలో కామెర్లు చాలా ఎక్కువవుతాయి. ఈ సమయంలో ఆకలి బాగా తగ్గిపోతుంది. కొందరు పిల్లల్లో విరేచనాలు, వాంతులు అలాగే కొనసాగుతూ రావొచ్చు. రెండో వారం నుంచి లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తాయి.


తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ప్రమాదకరంగా పరిగణించాలి?

పిల్లల్లో జ్వరం, వాంతులు, విరేచనాలు తరచూ చూసేవే. వీటికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ రెండు, మూడు రోజుల తర్వాత మూత్రం, కళ్లు పసుపు రంగులోకి మారుతున్నట్టు అనిపిస్తే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒకట్రెండు వారాలైనా తగ్గకపోతే నిర్లక్ష్యం పనికిరాదు. మూడో వారం నుంచి తగ్గకపోతే సమస్య తీవ్రమైందని తెలుసుకోవాలి.


ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?

కొత్త హెపటైటిస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశముంది. ఇన్‌ఫెక్షన్‌ సోకినవారి మలంతో కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వస్తుండొచ్చని అనుకుంటున్నారు. వాంతులతోనూ వ్యాపించొచ్చు. చిన్న ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఇన్‌ఫెక్షన్‌ సోకినవారు వాంతి చేసుకున్నా ఇతరులకు అంటుకోవచ్చు. కాబట్టి వైరస్‌ సోకకుండా పిల్లలకు తగు జాగ్రత్తలు నేర్పించాలి. తరచూ చేతులు కడుక్కోవటం అలవాటు చేయాలి. ముఖ్యంగా భోజనం చేయటానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పకుండా చేతులు కడుక్కునేలా చూడాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కుకు, నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవటం నేర్పించాలి. ఇంట్లో వండిన, వేడిగా ఉన్న ఆహారమే తినిపించాలి. విరేచనాలు, వాంతులు  పట్టుకున్నట్టయితే బయటకు వెళ్లకుండా చూడాలి. లక్షణాలు ఆగిపోయిన 48 గంటల తర్వాతే బడికి పంపించాలి.  

ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?

కొత్త హెపటైటిస్‌ చాలావరకు దానంతటదే కుదురుకుంటుంది. ఎడినోవైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టే చికిత్స చేయాల్సి ఉంటుంది. మామూలు చికిత్సతోనే 90% మంది పిల్లలు కుదురుకుంటారు. మిగతా 10% మందికి సమస్య తీవ్రమయ్యే అవకాశముంది. వీరిలో కొందరికి కాలేయ మార్పిడి అవసరమవుతోంది. కాబట్టి నిర్లక్ష్యం పనికిరాదు. పిల్లల్లో ఇదమిత్థ కారణమేదీ లేకుండా జ్వరం, వాంతులు, విరేచనాలతో పాటు కామెర్లు వచ్చినప్పుడు రెండు వారాలైనా తగ్గకపోతే కొత్త హెపటైటిస్‌ను అనుమానించాలి. కాలేయ ఎంజైమ్‌ల మోతాదులు పరీక్షించి నిర్ధరిస్తారు. ఎడినోవైరస్‌ 41 పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. ఇది తేలికైన పరీక్షే గానీ పరిశోధన కేంద్రాల్లోనే అందుబాటులో ఉంది. సమస్య తీవ్రతను బట్టి ప్రొథాంబిన్‌ టైమ్‌ను పరీక్షిస్తారు. ఇది ఎక్కువవుతుంటే సమస్య తీవ్రమవుతోందనే అర్థం. వీరిని అత్యవసర చికిత్స విభాగంలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్లాస్మా థెరపీ వంటివి ఉపయోగపడతాయి. అయితే చాలావరకు కాలేయ మార్పిడినే ఉత్తమ చికిత్సగా పరిణిస్తున్నారు. తల్లి లేదా తండ్రి నుంచి కాలేయంలో కొంత ముక్కను తీసుకొని పిల్లలకు అమరుస్తారు. దీన్నుంచి పిల్లలు త్వరగానే కోలుకుంటారు. కాలేయం తిరిగి పూర్తిగా బాగవుతుంది. కాలేయ మార్పిడి చేసిన తర్వాత జబ్బు తిరిగి వస్తున్న దాఖలాలేవీ లేవు. పూర్తిగా నయమవుతుంది. పెద్దయ్యాక పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని