అమ్మా..తలనొప్పి!
హాయిగా గెంతులేసే పిల్లలు ‘అమ్మా’ అంటూ తల పట్టుకొని కూలబడితే? ఆటా పాటా మానేసి మంచం మీదికి ఎక్కితే? బడికి వెళ్లనని మారాం చేస్తూ ఇంట్లోనే ఉండిపోతే? ఎప్పుడో అప్పుడంటే ఏమో గానీ తరచూ ఇదే పరిస్థితి ఎదురైతే? తల్లిదండ్రుల మనసు తల్లడిల్లిపోతుంది. ఏమైందోనని కంగారు మొదలవుతుంది. చాలాసార్లు పిల్లల్లో తలనొప్పి మామూలుగా ఉండొచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలమూ వేధించొచ్చు. కొందరిలో హఠాత్తుగా ఉన్నట్టుండి మొదలవ్వచ్చు. ఇది తీవ్ర సమస్యలకూ సంకేతం కావొచ్చు. కాబట్టి నొప్పి ఎలాంటిదైనా కారణమేంటన్నది తెలుసుకోవటం ముఖ్యం.
తలనొప్పి అనగానే ఎంతసేపూ అదేదో పెద్దవాళ్ల సమస్యగానే చూస్తుంటాం. అలసిపోయినప్పుడో, ఆకలేసినప్పుడో.. ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడో, రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉన్నప్పుడో, జలుబు చేసినప్పుడో తలనొప్పి రావటం సహజమే. దీనికి పిల్లలు మినహాయింపేమీ కాదు. తలనొప్పి ఏ వయసువారికైనా రావొచ్చు. నాడీ సమస్యలతో ఆసుపత్రికి వచ్చే పిల్లల్లో 7-10 శాతం మంది తలనొప్పితో బాధపడేవారే. యుక్తవయసు ఆడపిల్లల్లో ఇది మరింత ఎక్కువగానూ కనిపిస్తుంటుంది. అయితే పిల్లలు దీని గురించి స్పష్టంగా చెప్పలేకపోవటం, వర్ణించలేకపోవటం వల్ల పెద్దవాళ్లు అంతగా పట్టించుకోరు. చాలాసార్లు తలనొప్పి దానంతటదే తగ్గుతుండటం వల్ల అదొక సమస్య కాదనే భావిస్తుంటారు. నిజమే. తలనొప్పి ప్రత్యేకించి జబ్బు కాకపోవచ్చు. కానీ ఏదో ఒక సమస్యకు సంకేతమనే విషయాన్ని మరవరాదు. మాటిమాటికి తలనొప్పి వేధిస్తుంటే తాత్సారం చేయరాదు. పిల్లల విషయంలో మరింత అప్రమత్తత అవసరం.
మూడు రకాలు
తలనొప్పిని మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. 1. హఠాత్ నొప్పి (అక్యూట్). అంత ఎక్కువగా కాకపోయినా కొందరు పిల్లల్లో ఉన్నట్టుండి, హఠాత్తుగా తలనొప్పి మొదలవుతుంటుంది. ఇది అత్యవసరమైన సమస్య. రక్తనాళాలు చిట్లి రక్తం స్రవించటం, మెదడు పొరల్లో ఇన్‌ఫెక్షన్ (మెనింజైటిస్), మెదడులో కణితి, అధిక రక్తపోటు వంటివి ఇలాంటి తలనొప్పిని తెచ్చిపెడతాయి. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఇతరత్రా లక్షణాలున్నా, లేకపోయినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 2. స్వల్పకాల నొప్పి (సబ్ అక్యూట్). ఒకట్రెండు వారాల నుంచి తలనొప్పి వేధిస్తుంటే సబ్ అక్యూట్‌గా పరిగణిస్తారు. ఇందులో నొప్పి అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ ఇబ్బంది పెడుతుంది. క్షయ కారక బ్యాక్టీరియా ఇతర భాగాల నుంచి మెదడుకు చేరుకొని పొరలు ఉబ్బటం (ట్యూబర్‌క్యులస్ మెనింజైటిస్), మెదడులో ద్రవం పోగుపడటం (హైడ్రోసెఫలస్), కణితులు (ట్యూమర్లు) వంటి సమస్యలు దీనికి కారణం కావొచ్చు. ఇదమిత్థమైన కారణమేదీ లేకుండా మెదడులో ఒత్తిడి పెరగటం (ఇడియోపథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్‌టెన్షన్) మూలంగానూ రావొచ్చు. ఊబకాయం గల పిల్లల్లోనూ ఇలాంటి రకం నొప్పి రావొచ్చు. 3. దీర్ఘకాల నొప్పి (క్రానిక్). కొన్నిసార్లు తలనొప్పి నెలల తరబడి వేధిస్తుండొచ్చు. కొందరికి రెండు, మూడేళ్లయినా తగ్గకపోవచ్చు. దీర్ఘకాల నొప్పిలో ప్రధానమైనవి పార్శ్వనొప్పి (చైల్డ్‌హుడ్ మైగ్రేన్), ఒత్తిడి, ఆందోళనతో ముడిపడిన (టెన్షన్) తలనొప్పి. పిల్లల్లో ఎక్కువగా కనిపించేవి ఇలాంటి నొప్పులే. (వీటి గురించి పక్కన సవివరంగా..)
ఎప్పుడు ప్రమాదకరం?
తలనొప్పితో పాటు నడవటానికి ఇబ్బంది పడటం, తూలిపోవటం, శరీరంలో ఒకవైపు భాగం బలహీనంగా అనిపించటం, తరచూ వాంతులు, ప్రవర్తన మారటం, ఒకటికి రెండు వస్తువులు కనిపించటం వంటివి ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. రెండు మూడు రోజుల్నుంచి తలనొప్పి ఉండి, దగ్గినప్పుడు గానీ మల విసర్జన సమయంలో చూపు మందగిస్తున్నా తీవ్రంగా పరిగణించాలి. ఇవి మెదడులో కణితులు, మెదడులో ద్రవం పోగుపడటం, రక్తనాళాల లోపాల వంటి తీవ్ర సమస్యలకు సంకేతాలు కావొచ్చు. మూడేళ్ల లోపు పిల్లలు తలనొప్పి గురించి చెప్పలేరు. అందువల్ల ఎక్కువగా చిరాకు పడుతున్నా, ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోయినా తీవ్రంగానే పరిగణించాలి.
తలకు దెబ్బ తగిలితే?
పిల్లలు తరచూ తలకు దెబ్బలు తగిలించుకుంటుంటారు. వీటి విషయంలో ఎంత బలంగా దెబ్బతగిలింది? ఎంత ఎత్తు నుంచి కింద పడ్డారు? అనేవి కీలకం. చిన్నపాటి దెబ్బలు తగిలి, వాంతుల వంటివేవీ లేకపోతే పెద్దగా ప్రమాదమేమీ కాదు. అదే గంటకు 30, 40 మైళ్ల వేగంతో ఢీకొట్టటం వల్ల దెబ్బ తగిలినా, చాలా ఎత్తుల నుంచి పడినా తీవ్రంగా పరిగణించాలి. తలనొప్పితో పాటు మూర్ఛ, తరచూ వాంతులు, ఒకవైపు బలహీనత, స్పృహ తప్పటం వంటి లక్షణాలుంటే మెదడు స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది.
నివారించుకోవచ్చా?
కొన్ని జీవనశైలి మార్పులతో తలనొప్పిని నివారించుకునే అవకాశం లేకపోలేదు.
* అధిక బరువు గలవారికి తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకునేలా చూడాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా తలనొప్పిని నివారించుకోవచ్చు. వారానికి కనీసం 30 నిమిషాలైనా ఇష్టమైన వ్యాయామాలు చేసేలా ప్రోత్సహించాలి. ఆటలతోనూ మంచి వ్యాయామం లభిస్తుంది. యోగాసనాలూ మేలు చేస్తాయి.
* ఉదయం, సాయంత్రం వేళలో కాసేపు ఒంటికి ఎండ తగిలేలా ఆరుబయటకు తీసుకెళ్లాలి.
* రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గినా తలనొప్పి రావొచ్చు. అందువల్ల పిల్లలు వేళకు భోజనం చేసేలా చూసుకోవాలి. ఏవైనా పదార్థాలు తిన్నప్పుడు తలనొప్పి వస్తున్నట్టు గమనిస్తే వాటికి దూరంగా ఉంచాలి.
* ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. ఇది తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగేలా చూడాలి.
* తరచూ కెఫీన్‌తో కూడిన చాక్లెట్లు, పానీయాలు తీసుకోవటమూ తలనొప్పికి దారితీయొచ్చు. కాబట్టి వీటికి దూరంగా ఉంచటం మంచిది.
పరీక్షలు అరుదుగానే
పిల్లల్లో తలనొప్పికి అరుదుగానే పరీక్షలు అవసరమవుతాయి. ముందుగా చూడాల్సింది రక్తపోటు, బరువు. ఎందుకంటే అధిక రక్తపోటు, ఊబకాయ పిల్లలకు తలనొప్పి ముప్పు ఎక్కువ. తలసైజునూ పరీక్షించాలి. నాడీ, చూపు సమస్యలేవైనా ఉన్నాయా అనేదీ చూడాల్సి ఉంటుంది. మెదడులో ఒత్తిడి పెరిగితే ఆరో కపాలనాడి పక్షవాతం రావొచ్చు. దీంతో కన్ను పక్క వైపులకు సరిగా కదలదు. ఫలితంగా చూపు కేంద్రీకృతం కాక ఒకటికి రెండు వస్తువులు కనిపిస్తుండొచ్చు. పీయూష గ్రంథి వద్ద కణితి ఏర్పడితే చూపు విస్తృతి తగ్గుతుంది. పక్క వైపుల దృశ్యాలు కనిపించవు. విజువల్ ఫీల్డ్ పరీక్ష చేస్తేనే ఇది తెలుస్తుంది. ఫండస్‌స్కోప్‌తో కంటిలోపల వెనకాల ఉండే డిస్క్ ఉబ్బిందేమో చూడటమూ ముఖ్యమే. జన్యుపరంగా వచ్చే న్యూరోకుటేనియస్ జబ్బు గలవారికి చర్మం మీద మచ్చలు ఏర్పడుతుంటాయి. వీరికి మెదడులో కణితులు ఏర్పడే అవకాశముది. ఇలాంటి మార్పులు, సమస్యలు ఉన్నట్టయితే మెదడు స్కాన్ అవసరం. హఠాత్తుగా, తీవ్రంగా నొప్పి వచ్చినప్పుడు, నొప్పితో పాటు వాంతి, నడకలో ఇబ్బంది, చూపు, ప్రవర్తన సమస్యలు ఉన్నప్పుడు మెదడు ఎంఆర్‌ఐ వీనోగ్రామ్ చేస్తారు. ఇందులో కణితులు, మెదడు చుట్టూ నీరు ఎక్కువగా ఉండటం, సిరలు ఎక్కడైనా పూడుకుపోయాయా? అనేవి తెలుస్తాయి.
పార్శ్వనొప్పి ప్రధానం
మెదడు, మెదడు వెలుపలి సమస్యలతో సంబంధం లేని (ప్రైమరీ) తలనొప్పిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పార్శ్వనొప్పి గురించే. సాధారణంగా ఇది సాయంత్రం వేళలో వస్తుంటుంది. ఎక్కువసేపు ఎండకు గురికావటం, సమయానికి తినకపోవటం, పడుకోకపోవటం, తగినంత నీరు తాగకపోవటం వంటివి దీన్ని ప్రేరేపిస్తుంటాయి. కొందరిలో చాక్లెట్లు ఎక్కువగా తినటంతోనూ మొదలవ్వచ్చు. అందుకే పార్శ్వనొప్పి రాబోతోందని కొందరు పిల్లలు గుర్తించగలరు కూడా. చాలావరకు తలకు ఒకవైపునే నొప్పి ఉంటుంది. సాధారణంగా కళ్ల మీద, కంటి వెనకాల నొప్పి వస్తుంటుంది. ఇది ఎక్కువసేపు ఉంటుంది. సుమారు 4 గంటల నుంచి 72 గంటల వరకు వేధించొచ్చు. తలలో ఏదో బాదుతున్నట్టు నొప్పి పుడుతుంది. కొందరికి కళ్లచుట్టూ మిరుమిట్లు గొలిపే కాంతులు కనిపించొచ్చు. ఒకవైపు చూపు మసకబారటం, వికారం వంటివీ ఉంటాయి. నొప్పి వచ్చినప్పుడు పిల్లలు పడుకోవాలని చూస్తుంటారు. ఏమాత్రం చప్పుడు, వెలుతురు భరించలేరు. పార్శ్వనొప్పి కొందరికి నెలకు ఒకసారి రావొచ్చు. కొందరికి రెండు, మూడు నెలలకు ఒకసారి రావొచ్చు. కొందరికి నెలలోనే చాలాసార్లు రావొచ్చు. తల్లిదండ్రులకు పార్శ్వనొప్పి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. దీంతో బాధపడే పిల్లల్లో 80% మంది ఇలాంటివారే.
లక్షణాలతోనే నిర్ధరణ: పార్శ్వనొప్పి నిర్ధరణకు ఎలాంటి పరీక్షలు లేవు. లక్షణాలే కీలకం. ముందుగా నాడీ సమస్యలు, అధిక రక్తపోటు, చూపు సమస్యలు, ముక్కుచుట్టూరా ఉండే గాలి గదుల్లో వాపు (సైనసైటిస్), పిప్పి పళ్ల వంటివేవైనా ఉన్నాయా? అనేవి చూడాల్సి ఉంటుంది. గాలి గదులకు, దంతాలకు సంబంధించిన నాడులు పుర్రెలోని కొంత భాగానికీ సమాచారాన్ని చేరవేస్తాయి. అందువల్ల వీటిల్లో తలెత్తే సమస్యలూ తలనొప్పికి దారితీయొచ్చు. దీన్ని పిల్లలు తలనొప్పి అనే అనుకుంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి ఇతర సమస్యలు బయటపడుతుంటాయి. ఇలాంటివేవీ లేకపోతే నొప్పి ఎప్పుడెప్పుడు వస్తోంది? ఎంతసేపు ఉంటోంది? వికారం వంటి ఇతరత్రా ఇబ్బందులేవైనా ఉన్నాయా? తల్లిదండ్రులకు పార్శ్వనొప్పి ఉందా? అనేవి పరిశీలిస్తారు. వీటి ఆధారంగా సమస్యను నిర్ధరిస్తారు.
చికిత్స తేలికే
పార్శ్వనొప్పికి చికిత్స తేలికే. నొప్పి తగ్గటానికి పారాసిటమాల్, ఐబూప్రొఫెన్.. వికారం తగ్గటానికి డోమ్‌పెరిడాన్ మందులు ఉపయోగపడతాయి. నొప్పి మొదలైనప్పుడు వీటిని వేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. చాలామందికి వీటితోనే తగ్గుతుంది. అయితే నెలలో నాలుగు కన్నా ఎక్కువ సార్లు పార్శ్వనొప్పి వస్తున్నా.. నొప్పి మూలంగా స్కూలుకు వెళ్లలేకపోతున్నా ఫ్లూనరజీన్ లేదా ప్రొప్రనలాల్ మందులను 3 నెలల వరకు వాడుకోవాల్సి ఉంటుంది. దీంతో చాలావరకు నయమవుతుంది. ఒకవేళ పార్శ్వనొప్పి తిరిగి వస్తే పరిశీలించి మందులు అవసరమా? కాదా? అన్నది నిర్ణయిస్తారు. మనదగ్గర చాలామంది తల్లిదండ్రులు తలనొప్పే కదాని సొంతంగా మందులు కొని, పిల్లలకు వేస్తుంటారు. ఇది తగదు. సొంతంగా ఇస్తే మందు మోతాదు ఎక్కువవ్వచ్చు. నిర్ధరణ విషయంలోనూ పొరపడే ప్రమాదముంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకే మందులు ఆరంభించాలని తెలుసుకోవాలి.
ఒత్తిడి నొప్పీ ఎక్కువే
పిల్లలకు ఒత్తిడి, ఆందోళన ఏంటి? చాలామంది ఇలాగే అనుకుంటుంటారు. నిజానికి పెద్దవాళ్లే కాదు, పిల్లలూ మానసిక ఒత్తిడికి లోనుకావొచ్చు. ఇది కొన్నిసార్లు తలనొప్పికీ దారితీయొచ్చు. ప్రస్తుతం ఇలాంటి రకం తలనొప్పి ఎక్కువగానే చూస్తున్నాం. కొవిడ్ విజృంభణ కారణంగా రెండున్నరేళ్ల తర్వాత పిల్లలు బడికి వెళ్తున్నారు. దీంతో ఎంతోమంది బడి అనగానే ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో తలనొప్పి ఉదయం పూటే ఉండటం, స్కూలుకు వెళ్లే సమయం దాటగానే తగ్గటం విచిత్రం. బడి ఒక్కటే కాదు.. ఇతరత్రా అంశాలూ పిల్లలను ఒత్తిడికి గురిచేయొచ్చు. ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడటం.. తోటి పిల్లల వేధింపులు.. గణితం, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో వెనకబడటం.. హాస్టల్‌కు వెళ్లటానికి ఇష్టం లేకపోవటం వంటివీ దీనికి దారితీయొచ్చు. దీని బారినపడ్డ పిల్లలు తలలో ఏదో నొక్కుతున్నట్టు, తల చుట్టూ ఏదో గట్టిగా కట్టినట్టు నొప్పి వస్తుందని చెబుతుంటారు.
నిర్ధరణ ఎలా?: ఒత్తిడితో తలెత్తే నొప్పి గలవారు తరచూ బడి మానేస్తుండటం గమనార్హం. తమ పిల్లలు నెల నుంచి సరిగా బడికి వెళ్లటం లేదని చాలామంది చెబుతుంటారు. కొందరికి తలనొప్పి మాత్రమే కాదు.. కడుపునొప్పి, ఒళ్లునొప్పుల వంటివీ ఉండొచ్చు. కాబట్టి ఏయే సమయాల్లో నొప్పి వస్తోంది? ఎప్పుడు తగ్గిపోతోంది? అనే దాన్ని బట్టి ఒత్తిడితో ముడిపడిన తలనొప్పిని నిర్ధరిస్తారు. అదే సమయంలో ఇతరత్రా సమస్యలేవీ లేవని రూఢీ చేసుకోవటమూ ముఖ్యమే.
చికిత్స- కౌన్సెలింగ్
ఒత్తిడి తలనొప్పికి మందులు పెద్దగా ఉపయోగపడవనే చెప్పుకోవాలి. ఇవి తాత్కాలికంగా ఉపశమనం కలిగించొచ్చు గానీ ఒత్తిడికి కారణమవుతున్న వాటిని గుర్తించి, పరిష్కరిస్తేనే తగ్గుతుంది. ఇందుకు మానసిక నిపుణుల కౌన్సెలింగ్ బాగా ఉపయోగపడుతుంది. హాస్టల్‌కు వెళ్లటం ఇష్టంలేనివారిని కొద్దిరోజుల పాటు ఇంట్లోనే ఉండేలా చూడొచ్చు. వేధింపులకు గురవుతుంటే తోటి పిల్లలతో మాట్లాడి సముదాయించొచ్చు. భయపడొద్దని ధైర్యాన్ని నూరిపోయచ్చు. సబ్జెక్టుల్లో వెనకబడినవారిని బాగా చదువుకునేలా ప్రోత్సహించటం, ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుంటే మానెయ్యటం వంటివి మేలు చేస్తాయి.
* పిల్లలు బడిలో ఎలా పడితే అలా కూర్చుంటారు. దీంతో తల, మెడ వెనక కండరాలు ఎక్కువసేపు సంకోచించటం మూలంగానూ ఒత్తిడి తలనొప్పి రావొచ్చు. విశ్రాంతి తీసుకుంటే ఇది తగ్గుతుంది. మెడ వెనక నెమ్మదిగా మర్దన చేయటంతోనూ ఉపశమనం లభిస్తుంది.
ఇవీ చదవండి
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Har Ghar Tiranga: ఇంటింటా హర్ ఘర్ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగురవేసిన అమిత్ షా
-
Movies News
Vikram: నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్
-
General News
Chandrababu: హర్ ఘర్ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు
-
Movies News
F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
-
World News
Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
-
Sports News
IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌పై రికీ పాంటింగ్ జోస్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!