చెడ్డీలోనే దొడ్డికి.. ఎందుకిలా?

సమస్య: మా మనవరాలి వయసు 5 ఏళ్లు. దొడ్డికి వస్తే చెప్పదు. చెడ్డీలోనే పోతుంది. మూత్రం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అర్ధరాత్రి అయినా తనే లేచి వెళ్తుంది...

Updated : 12 Oct 2018 22:40 IST

చెడ్డీలోనే దొడ్డికి.. ఎందుకిలా?సమస్య: మా మనవరాలి వయసు 5 ఏళ్లు. దొడ్డికి వస్తే చెప్పదు. చెడ్డీలోనే పోతుంది. మూత్రం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అర్ధరాత్రి అయినా తనే లేచి వెళ్తుంది. పిల్లల డాక్టర్‌కు చూపిస్తే వయసు పెరిగేకొద్దీ  తగ్గి పోతుందని, ఒకసారి పీడియాట్రిక్‌ సర్జన్‌కు చూపించాలని చెప్పారు. అసలీ సమస్య ఎందుకొస్తుంది? దీనికి పరిష్కారమేంటి?

- సయ్యద్‌ కరీముల్లా, రేణిగుంట, చిత్తూరు

సలహా: మామూలుగా వయసు పెరుగుతున్నకొద్దీ పిల్లలకు మల విసర్జన మీద పట్టు అబ్బుతుంది. కానీ కొందరు పిల్లలు మీ మనవరాలి మాదిరిగా టాయ్‌లెట్‌కు వెళ్లకుండా దుస్తుల్లోనే కానిచ్చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం. మల విసర్జన పద్ధతులు అలవడకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల ఇది తలెత్తుతుంది. దీన్నే ‘ఎంకో ప్రెసిస్‌’ అంటారు. ఇది సాధారణంగా 4 ఏళ్లు పైబడినవారిలో కనబడుతుంది. ఇలాంటి పిల్లల్లో పెద్దపేగు చివరి భాగంలో మలం నిలిచి పోతుంటుంది. ఎక్కువసేపు అలాగే ఉండిపోతుంటే మలంలోని నీటిని పెద్దపేగు పీల్చేసుకుంటుంది, మలం బాగా గట్టిపడిపోతుంది. క్రమంగా పెద్దపేగుకు మలాన్ని పట్టి ఉంచే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. మల ద్వారాన్ని బిగుతుగా పట్టి ఉంచే కండర వలయం (స్ఫింక్టర్‌) కూడా దెబ్బతింటుంది. దీంతో పైనుంచి వచ్చే కిందికి తోసుకొచ్చే పలుచటి మలం.. ఈ గట్టిపడిన మలం పక్కల నుంచి బయటకు రావటానికి ప్రయత్నిస్తుంటుంది. కొద్దికొద్దిగా బయటకు చిమ్ముకొస్తుంటుంది. ఇదే మనకు మల విసర్జనలాగా కనబడుతుంది. దీనికి ప్రధాన చికిత్స గడ్డకట్టి నిలిచిపోయిన మలాన్ని పూర్తిగా బయటకు తీయటం. మలద్వారం నుంచి చిన్న కడ్డీల్లాంటివి పంపించటం, విరేచనం వచ్చేలా చేసే మందులు ఇవ్వటం ఇందుకు బాగా ఉపయోగపడతాయి. వీటితో ఫలితం కనబడకపోతే ఎనీమా చేస్తారు. అవసరమైతే మలద్వారం దగ్గర మత్తుమందు ఇచ్చి వేలు ద్వారా మలాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది కూడా. ఒకసారి గట్టిపడిన మలాన్ని బయటకు తీసేశాక రోజూ సమయానికి మలవిసర్జన అయ్యేలా చూడాలి. ఇలాంటి పిల్లలు దొడ్డికి పోవాలంటేనే భయపడుతుంటారు. ఎంత ముక్కినా మలం రాదు, నొప్పి వస్తుంటుంది. ఇది భయానికి దారితీస్తుంది. దీన్ని పోగొట్టాలి. దొడ్డికి వచ్చినా రాకపోయినా రోజూ ఒకే సమయానికి టాయ్‌లెట్‌లో కూచోబెట్టాలి. దీంతో రోజూ అదే సమయానికి పేగు కదలటం, విసర్జన కావటం అలవడుతుంది. అలాగే ఆహారంలో పీచు, నీరు, పండ్లు ఎక్కువగా తినిపించాలి. మనం తీసుకునే ఆహారంలో ఆకు కూరల ద్వారానే పీచు ఎక్కువగా లభిస్తుంది. ఇలాంటి పిల్లలకు కప్పు అన్నం పెడితే రెండు కప్పుల ఆకుకూర విధిగా పెట్టాలి. బెండకాయ, చిక్కుళ్లు, క్యాబేజీ, గోబీపువ్వు, మునక్కాడలతో పీచు దండిగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి కూరగాయలను కూడా ఇవ్వాలి. మీ మనవరాలికి ఐదేళ్లు అంటున్నారు కాబట్టి రోజుకు ఒక లీటరు వరకు ద్రవాలు (నీరు, కొబ్బరి నీరు, పండ్లరసాలు, మజ్జిగ వంటివి) తీసుకునేలా చూడాలి. ఇక పండ్ల విషయానికి వస్తే ఒకపూట ఆయా కాలాల్లో దొరికే పండు, ఒకపూట బాగా మగ్గిన అరటిపండు ఇవ్వాలి. నెమ్మదిగా విరేచనం వచ్చేలా చేసే మందులు ఆపేయ్యాలి. నూటికి 90 శాతం మంది పిల్లలకు మలబద్ధకం మూలంగానే ఈ సమస్య ఎదురవుతుంది. ఓ 10 శాతం మందిలో వెన్నులోపాల మూలంగా నాడులు దెబ్బతినటం.. మలద్వారం జననాంగం మధ్యలో ఏదైనా దెబ్బతగలటం లేదా సర్జరీల మూలంగా కండర వలయం దెబ్బతినటం.. బుద్ధిమాంద్యం వంటి మానసిక సమస్యలు ఈ సమస్యకు దారితీయొచ్చు. ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయని అనుమానిస్తే ఎక్స్‌రే, బేరియం స్టడీ, మానోమెట్రీ వంటి పరీక్షలు చేస్తారు. వీటితో వెన్నెముక, మలం గట్టిపడిన తీరుతెన్నులతో పాటు పేగుల్లో వాపు, కదలికలన్నీ బయటపడతాయి. అవసరమైతే పెద్దపేగు చివరి భాగం నుంచి చిన్నముక్కను తీసి పరీక్షించాల్సి ఉంటుంది. దీంతో సమస్య తీవ్రత బయటపడుతుంది. వీరికి ఆయా సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. మీ మనవరాలికి ఇతరత్రా సమస్యలేవీ లేవని అంటున్నారు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే తేలికగానే తగ్గిపోతుంది. ఏదేమైనా ఒకసారి పీడియాట్రిక్‌ సర్జన్‌ను సంప్రతించటం మంచిది.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా 
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, 
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email:  sukhi@eenadu.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని