Coronaకు వ్యాయామ సవాల్‌!

వ్యాయామం మరింత ఎక్కువగా చేయటం ద్వారా తీవ్రమైన కొవిడ్‌ జబ్బు బారినపడకుండా కాపాడుకోవచ్చా? యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా తాజా అధ్యయనం ఇదే విషయాన్ని సూచిస్తోంది. కొవిడ్‌ మూలంగా ఆసుపత్రిలో

Updated : 04 May 2021 07:16 IST

వ్యాయామం మరింత ఎక్కువగా చేయటం ద్వారా తీవ్రమైన కొవిడ్‌ జబ్బు బారినపడకుండా కాపాడుకోవచ్చా? యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా తాజా అధ్యయనం ఇదే విషయాన్ని సూచిస్తోంది. కొవిడ్‌ మూలంగా ఆసుపత్రిలో చేరినవారిలో శారీరక వ్యాయామాల రక్షణ ప్రభావాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో 50వేల మంది కొవిడ్‌-19 బాధితులను పరిశీలించారు. జబ్బు బారినపడటానికి ముందు చురుకైన జీవనశైలిని పాటిస్తున్నవారు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరటం, ఒకవేళ చేరినా జబ్బుతో మరణించటం చాలా తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కొవిడ్‌-19 జబ్బు, శారీరక శ్రమ, ఫిట్‌నెస్‌ మధ్య సంబంధం గురించి పెద్దగా తెలియని స్థితిలో తాజా అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. నడక, పరుగు, ఈత, సైకిల్‌ తొక్కటం.. వ్యాయామం ఎలాంటిదైనా కొవిడ్‌ తీవ్రం కాకుండా కాపాడే అవకాశముందని ఫలితాలు పేర్కొంటుండటం విశేషం. అంతగా శరీర సామర్థ్యం లేనివారితో పోలిస్తే ఏరోబిక్‌ (కండరాల్లోకి మరింత ఆక్సిజన్‌ను చేరవేసే) వ్యాయామాలతో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నవారికి జలుబు, ఇతర వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు తక్కువని.. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారని శాస్త్రవేత్తలు చాలాకాలంగానే భావిస్తున్నారు. ఎందుకంటే వ్యాయామంతో రోగనిరోధక ప్రతిస్పందనలు మెరుగవుతాయి. శరీర సామర్థ్యం ఇనుమడిస్తుంది. ఫ్లూ, ఇతర జబ్బుల టీకాలకు యాంటీబాడీల ప్రతిస్పందనలూ ఎక్కువగా పుట్టుకొస్తాయి. కానీ కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కొత్తది కావటం.. వ్యాయామం, శారీరక సామర్థ్యం ఏమైనా ముప్పులు తెచ్చిపెడతాయా? కాపాడతాయా? అన్నది సందేహాస్పదంగా ఉండేది. వేగంగా నడవటం ఏరోబిక్‌ ఫిట్‌నెస్‌కు సూచికగా భావిస్తుంటారు. మెల్లగా నడిచేవారితో పోలిస్తే వేగంగా నడిచేవారికి తీవ్రమైన జబ్బు ముప్పు తక్కువగా ఉంటోందని గత ఫిబ్రవరిలో వెల్లడైన అధ్యయనం ఒకటి సూచిస్తోంది. ఊబకాయులైనా సరే. వేగంగా నడిచేవారిలో ఇలాంటి మంచి ఫలితమే కనిపిస్తుండటం గమనార్హం. కండరాల బలానికి సూచికైన పిడికిలి బిగింపు బాగా ఉన్నవారికీ కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తక్కువగా ఉంటున్నట్టు యూరప్‌లో నిర్వహించిన మరో అధ్యయనం పేర్కొంటోంది. కాకపోతే ఇవి పరోక్ష ప్రమాణాలతో ముడిపడినవి. నిజానికి రోజువారీ వ్యాయామ అలవాట్లు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది పెద్దగా తెలియదు. తాజా అధ్యయనం ఈ కొరతను తీర్చినట్టయ్యిందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి కదలకుండా కూర్చొనే జీవనశైలి ఎంతమాత్రం మంచిది కాదని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ రాబర్ట్‌ సలిస్‌ చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని