యోగా రక్ష

మన ఆరోగ్యంలో రోగనిరోధకశక్తి పాత్ర చాలా కీలకం. ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి వాటితో పోరాడుతూ జబ్బులు బారినపడకుండా కాపాడుతుంది. అందుకే రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకోవటం ఎంతైనా అవసరం. మంచి పోషకాహారం,

Updated : 26 Apr 2022 06:26 IST

మన ఆరోగ్యంలో రోగనిరోధకశక్తి పాత్ర చాలా కీలకం. ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి వాటితో పోరాడుతూ జబ్బులు బారినపడకుండా కాపాడుతుంది. అందుకే రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకోవటం ఎంతైనా అవసరం. మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామాల ద్వారా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. వ్యాయామాల దృష్టితో చూస్తే యోగాసనాలూ తక్కువేమీ కాదు. శరీర కదలికలు, శ్వాస తీరుతెన్నులతో ముడిపడిన యోగా శరీరాన్ని బలోపేతం చేయటంతో పాటు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తుంది. శరీరం, మనసు సమస్థితిలో ఉంటే రోగనిరోధకశక్తి సైతం పుంజుకుంటుంది. యోగా మూడు రకాలుగా రోగనిరోధకశక్తిని ఇనుమడింపజేస్తుంది.


మానసిక ఒత్తిడి తగ్గుముఖం

జబ్బులకు దారితీసే ప్రధాన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఎందుకంటే ఒత్తిడితో మన రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో హానికారక క్రిములతో పోరాడే శక్తి సన్నగిల్లుతుంది. ఫలితంగా జబ్బుల ముప్పూ ఎక్కువవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గటానికి శశకాసనం, శవాసనం బాగా ఉపయోగపడతాయి.

శశకాసనం: దీన్ని కుందేలు ఆసనమనీ అంటారు. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. మోకాళ్లను పక్కలకు జరపాలి. అరచేతులను మోకాళ్ల మధ్యలో నేల మీద ఆనించాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా అరచేతులను ముందుకు జరపాలి. ఛాతీ, చుబుకాన్ని నేలకు తాకించాలి. భుజాలు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. మామూలుగా శ్వాస తీసుకోవాలి. కాసేపు అలాగే ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులను వెనక్కి లాగుతూ పైకి లేవాలి. శ్వాస వదులుతూ తిరిగి యథాస్థితికి వచ్చి, వజ్రాసనంలో కూర్చోవాలి.

* దీంతో తలకు రక్తసరఫరా పెరుగుతుంది. ఇది ఒత్తిడి తగ్గటానికి దోహదం చేస్తుంది. వెన్నెముక బలోపేతం కావటానికీ.. వీపు, భుజాలు సాగటానికీ తోడ్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థను, గ్రంథుల వ్యవస్థనూ ఉత్తేజితం చేస్తుంది.

శవాసనం: కాళ్లు, చేతులు ఎడంగా పెట్టి వెల్లకిలా పడుకోవాలి. అరచేతులు పైకి చూసేలా ఉండాలి. కళ్లు మూసుకొని, శరీరం మొత్తాన్ని వదులుగా చేయాలి. మామూలుగా శ్వాస తీసుకోవాలి. దృష్టిని శ్వాస మీదే కేంద్రీకరించాలి. ప్రశాంతత కలిగేంతవరకు అలాగే ఉండాలి.

యోగా రక్ష  ఇది శరీరానికి, మనసుకు విశ్రాంతిని కలిగిస్తుంది. ఆందోళన, రక్తపోటు తగ్గిస్తుంది. నిద్రలేమినీ పోగొడుతుంది.


శ్వాసకోశ వ్యవస్థ బలోపేతం

ప్రాణాయామ పద్ధతులు శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ పుంజుకుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి కూడా ఇనుమడిస్తుంది. ప్రాణాయామంలో రకరకాల పద్ధతులున్నాయి. వీటిల్లో తేలికగా చేసుకోగలిగినవి ఎంచుకోవచ్చు.

అనులోమ విలోమ పద్ధతి: పద్మాసనంలో గానీ సుఖాసనంలో గానీ కూర్చోవాలి. కళ్లు మూసుకొని ముక్కు కుడి రంధ్రాన్ని కుడి బొటనవేలితో మూయాలి. ఎడమ రంధ్రంతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు మధ్యవేలితో ముక్కు ఎడమ రంధ్రాన్ని మూసి, కుడి రంధ్రంతో శ్వాస వదలాలి. అదే రంధ్రంతో శ్వాస తీసుకొని.. కుడి బొటన వేలితో కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంతో శ్వాస వదలాలి. తర్వాత దీన్ని తారుమారు చేయాలి. అంటే కుడి రంధ్రంతో శ్వాస తీసుకొని, ఎడమ రంధ్రంతో వదలాలి. అదే రంధ్రంతో శ్వాస తీసుకొని, కుడి రంధ్రంతో వదలాలి.

భ్రమరి: పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని అరచేతులను ముఖం మీద ఆనించాలి. చూపుడు వేళ్లతో కళ్ల మీద నెమ్మదిగా నొక్కాలి. మధ్య వేళ్లను ముక్కు పక్కన.. ఉంగరం వేళ్లను పెదాల మీద.. చిటికెన వేళ్లను నోటి మీద తాకించాలి. బొటన వేళ్లతో చెవులను నెమ్మదిగా మూయాలి. ఇప్పుడు ముక్కుతో గాఢంగా శ్వాస తీసుకొని మ్‌.. మ్‌.. అని చప్పుడు చేస్తూ గాలిని వదలాలి.

ఇవి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తూనే ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. ప్రాణశక్తిని శరీరంలోని అన్ని భాగాలకు మృదువుగా కదిలేలా చూస్తాయి. శక్తి మార్గాలనూ శుద్ధి చేస్తాయి.


పూర్తి స్థాయిలో అవయవాల పనులు

యోగాసనాలతో శరీరంలోని అన్ని భాగాలకూ రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో అవన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. త్రికోణాసనం, ఉష్ట్రాసనం ఇలాంటివే..

త్రికోణాసనం: ముందుగా పాదాలను వీలైనంత ఎడంగా పెట్టి, తిన్నగా నిల్చోవాలి. చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి. నడుమును పక్కకు వంచి.. ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. కుడి చేతిని పైకి తిన్నగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. తర్వాత నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. ఎడమ చేయిని పైకి తిన్నగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.

* ఇది పొట్టలోని అవయవాలను మర్దన చేస్తుంది. అన్ని భాగాలకూ రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

* పార్శ్వనొప్పి, విరేచనాలు, అధిక రక్తపోటు, మెడ, నడుం నొప్పులతో బాధపడేవారు దీన్ని వేయరాదు.

 

ఉష్ట్రాసనం: దీన్ని ఒంటె ఆసనమనీ అంటారు. వజ్రాసనంలో కూర్చోవాలి. మోకాళ్ల మీద లేవాలి. చేతులను పక్క తొడలకు తాకించి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వంగాలి. కుడి అరచేయిని కుడి పాదం మీద, ఎడమ అరచేతిని ఎడమ పాదం మీద ఆనించాలి. వెనక్కి వంగినప్పుడు మోకాళ్లు పైకి లేవకుండా చూసుకోవాలి. కాసేపు అలాగే ఉండి, శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. తిరిగి వజ్రాసనంలో కూర్చోవాలి.

* ఇది థైరాయిడ్‌ గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది. వెన్నెముకను దృఢంగా చేస్తుంది. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా పనిచేయటానికి తోడ్పడుతుంది.

* అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హెర్నియా గలవారు ఈ ఆసనాన్ని వేయరాదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని