కంటికి ఒమేగా బలం!

కంటి ఆరోగ్యం అనగానే విటమిన్‌ ఎ ముందుగా గుర్తుకొసుంది. కానీ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలూ తక్కువేమీ కావు. ఇవి కళ్లు పొడిబారటాన్ని తగ్గిస్తూ చూపును కాపాడతాయి. సాధారణంగా వయసు మీద పడటం.. ఎక్కువసేపు కంప్యూటర్‌,

Updated : 03 May 2022 06:27 IST

కంటి ఆరోగ్యం అనగానే విటమిన్‌ ఎ ముందుగా గుర్తుకొసుంది. కానీ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలూ తక్కువేమీ కావు. ఇవి కళ్లు పొడిబారటాన్ని తగ్గిస్తూ చూపును కాపాడతాయి. సాధారణంగా వయసు మీద పడటం.. ఎక్కువసేపు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ వంటి పరికరాల తెరలను చూడటం మూలంగా కన్నీటి ఉత్పత్తి తగ్గి కళ్లు పొడిబారుతుంటాయి. దీంతో కళ్ల దురద, మంట వంటివి వేధిస్తాయి. సమస్యను నిర్లక్ష్యం చేస్తే చూపు సైతం దెబ్బతింటుంది. అందుకే కళ్లకు మేలు చేసే పోషకాలను తీసుకోవటం ఎంతైనా అవసరం. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వాపుప్రక్రియను తగ్గించటంతో పాటు కన్నీటిలో నూనె పొరనూ మెరుగు పరుస్తాయి. కళ్లు పొడిబారకుండా కాపాడతాయి. మాకెరెల్‌, సార్‌డైన్‌ వంటి కొవ్వుతో కూడిన చేపలు.. అవిసె గింజలు, అక్రోట్ల వంటి వాటిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. అవసరమైతే మాత్రల రూపంలోనూ తీసుకోవచ్చు.

* జియాగ్జాంతిన్‌, ల్యుటీన్‌ అనే కెరొటినాయిడ్లు సైతం కళ్లకు మేలు చేస్తాయి. ఇవి రెటీనాలోని మాక్యులా క్షీణత, శుక్లాల నివారణకు తోడ్పడతాయి. పాలకూర, బ్రకోలీ వంటి వాటితో జియాగ్జాంతిన్‌, ల్యుటీన్‌ లభిస్తుంది. విటమిన్‌ సి కూడా కంటి ఆరోగ్యానికి తోడ్పడేదే. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ విశృంఖల కణాలను అడ్డుకుంటుంది. రెటీనా దెబ్బతినకుండా కాపాడుతుంది. నిమ్మ, మిరపకాయలు, ఉసిరి, జామ, బత్తాయి, నారింజ వంటి వాటిల్లో విటమిన్‌ సి దండిగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు