మూడంచెల వ్యాయామం

వ్యాయామం ఏదైతేనేం? అంతా ఒకటే కదా అని చాలామంది భావిస్తుంటారు. నిజానికి వ్యాయామాల్లోనూ రకాలుంటాయి. చేకూర్చే ప్రయోజనాలను బట్టి వీటిని ఎంచుకుంటుంటారు.

Published : 26 Jul 2022 01:04 IST

వ్యాయామం ఏదైతేనేం? అంతా ఒకటే కదా అని చాలామంది భావిస్తుంటారు. నిజానికి వ్యాయామాల్లోనూ రకాలుంటాయి. చేకూర్చే ప్రయోజనాలను బట్టి వీటిని ఎంచుకుంటుంటారు. అన్నింటికన్నా మంచి సమతులమైన వ్యాయామ ప్రణాళిక ఏంటంటే- నడక, బరువులెత్తటం, యోగా. ఇది మూడు రకాల వ్యాయామాలతో కూడిన పద్ధతి. ఏరోబిక్‌ లేదా కార్డియో (నడక), స్ట్రెంత్‌ లేదా రెసిస్టెన్స్‌ ట్రెయినింగ్‌ (బరువులు ఎత్తటం), ఫ్లెక్సిబిలిటీ ట్రెయినింగ్‌ (యోగా). మనకు ఈ మూడూ ముఖ్యమే. నడక, జాగింగ్‌, సైకిల్‌ తొక్కటం, ఈత, టెన్నిస్‌ ఆడటం వంటి కార్డియో వ్యాయామాలు గుండె, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. బరువులు ఎత్తటం వల్ల కండరాలు వృద్ధి చెందుతాయి, ఎముకలు బలంగా ఉంటాయి. ఇది శరీరం స్థిరంగా ఉండటానికి, అవయవాల సమన్వయానికీ తోడ్పడుతుంది. ఇక యోగాతో శరీర కదలికలు మెరుగవుతాయి. గాయాల పాలయ్యే ముప్పూ తగ్గుతుంది. ఒక మాదిరి తీవ్రతతో వ్యాయామం చేసినా (అంటే వ్యాయామం చేసేటప్పుడు పక్కవారితో మాట్లాడగలిగినా పాట పాడటానికి కష్టమయ్యే స్థితి) మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరం సహకరిస్తే ఇంకాస్త తీవ్రంగానూ (శ్వాస కష్టంగా, వేగంగా తీసుకోవటం.. ఒకట్రెండు పదాలకు మించి మాట్లాడలేని స్థితి) చేయొచ్చు. రోజుకు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలన్నది నిపుణుల సూచన. ఒకవేళ అంత సమయం లేకపోతే పదేసి నిమిషాల చొప్పున రోజులో మూడు సార్లు చేసినా మంచిదే. గరిష్ఠ గుండె వేగంలో 50% నుంచి 80% వరకు గుండె కొట్టుకునేంత తీవ్రతతో వ్యాయామాలు చేయొచ్చు. వయసును 220 నుంచి తీసేసి గరిష్ఠ గుండె వేగాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు- 50 ఏళ్లు ఉన్నాయనుకోండి. 220 నుంచి 50 తీసేస్తే 170 వస్తుంది కదా. ఇది గరిష్ఠ గుండె వేగం అన్నమాట. ఇందులో 50 శాతం.. అంటే నిమిషానికి 85 సార్లు గుండె కొట్టుకునేంత తీవ్రంగా వ్యాయామం చేయొచ్చు. శరీర సామర్థ్యాన్ని బట్టి క్రమంగా పెంచుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని