Updated : 15 Dec 2022 18:19 IST

తిండి + బద్ధకం =బరువు

బరువు(weight) తగ్గటమనేది అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు. దీనికి సమయం పడుతుంది. ఓపికతో ఆహార, వ్యాయామ నియమాలను పాటించటం అత్యవసరం.

అధిక బరువు(over weight)తో మధుమేహం(Diabatic), అధిక రక్తపోటు(Blood preasure) వంటి దీర్ఘకాల సమస్యల ముప్పు పెరుగుతుంది. కొన్నిరకాల క్యాన్సర్లూ తలెత్తొచ్చు. వయసు మీద పడుతున్నప్పుడు చురుకుదనమూ తగ్గుతుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అలాగని మరీ త్వరగా బరువు తగ్గటమూ మంచిది కాదు. దీనికీ ఒక పద్ధతి ఉంది.

రువు పెరగటానికి ప్రధాన కారణం- శరీరానికి అవసరమైన వాటి కన్నా ఎక్కువ కేలరీలను తీసుకోవటం. ఖర్చు కాకుండా మిగిలిపోయిన కేలరీలు కొవ్వు(cholesterol)గా మారిపోయి, స్థిరపడే ప్రమాదముంది. సమతులాహారం తినకపోవటం, నిద్రలేమి, తగినంత శ్రమ చేయకపోవటం వంటి రకరకాల అంశాలు దీనికి కారణమవుతుంటాయి. బరువు పెరగటంలో జన్యువులు కూడా పాలు పంచుకుంటాయి. కొన్నిరకాల మందులూ దీనికి దోహదం చేయొచ్చు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువును అదుపులో పెట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. చిన్న చిన్న మార్పులైనా పెద్ద ప్రభావమే చూపుతాయి.

లెక్క ప్రకారం..

శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (BMI) ఆధారంగా బరువును లెక్కిస్తారు. ఇది 25లోపు ఉండటం మంచిది. 25 నుంచి 29.6 మధ్యలో ఉంటే అధిక బరువుగా.. 30, అంతకన్నా ఎక్కువుంటే ఊబకాయంగా పరిగణిస్తారు. బరువును లెక్కించటానికి బీఎంఐ తేలికైన, సత్వర మార్గమే అయినప్పటికీ.. ఇందులో కొవ్వు మోతాదు కచ్చితంగా తెలియదు. ఒంట్లో నీరు, కండరాలు, ఎముకల బరువులన్నీ బీఎంఐలో కలిసే ఉంటాయి. నిజానికి ఎక్కువ ప్రమాదం అధిక కొవ్వుతోనే! దీని మూలంగా బీఎంఐ పెరిగినట్టయితే నెమ్మదిగా.. వారానికి 450 నుంచి 900 గ్రాముల వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొందరు త్వరగా బరువు తగ్గటం మంచిదని భావిస్తుంటారు. కానీ ఎంత త్వరగా తగ్గితే అంతే వేగంగా పెరిగే ప్రమాదముంటుంది. నెమ్మదిగా, క్రమంగా తగ్గే బరువు స్థిరంగా కొనసాగుతూ వస్తుందని తెలుసుకోవాలి.

తిండి మీద ధ్యాస

బరువు తగ్గటానికి(Weight loss)  ఆహారం ద్వారా లభించే కేలరీలను తగ్గించుకోవటంతో పాటు కేలరీలు ఎక్కువ ఖర్చయ్యేలా శారీరక శ్రమ(Physical work) చేయటం తప్పనిసరి. రోజులో శరీరం ఖర్చు చేసే కేలరీల కన్నా సుమారు 500 తక్కువ కేలరీలు తీసుకుంటే బరువు తగ్గుతుందన్నది నిపుణుల సూచన. దీంతో వారానికి సుమారు 900 గ్రాముల బరువు తగ్గే అవకాశముంది. కాబట్టి కేలరీలు ఎక్కువగా ఉండే పదార్థాలు, సంతృప్త కొవ్వు పదార్థాలు, వనస్పతి వంటి ట్రాన్స్‌ఫ్యాట్స్‌ తగ్గించుకోవాలి. అయితే అందరికీ ఒకే రకమైన ఆహార పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పలేం. క్రమం తప్పకుండా కొనసాగించగలిగే ఆహార పద్ధతే అన్నింటికన్నా మంచిది. రకరకాల కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, వెన్న తీసిన పాలు, పాల పదార్థాలు.. మాంసాహారులైతే చికెన్‌, చేపల వంటివన్నీ సమపాళ్లలో తీసుకోవటం ముఖ్యం. మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆయా పదార్థాలను ఎంచుకుంటే మధ్యలో కట్టు తప్పకుండా చూసుకోవచ్చు. కేలరీలను లెక్కించుకొని తినటం ఎలా సాధ్యమని చాలామంది ప్రశ్నిస్తుంటారు. మితంగా తినేలా చూసుకుంటే చాలావరకు కేలరీలను తగ్గించుకోవచ్చు. చిన్న పళ్లాన్ని ఎంచుకుంటే వడ్డించుకునే పదార్థాల పరిమాణమూ తగ్గుతుంది. అలాగే ఆహారాన్ని పూర్తిగా నములుతూ, ఆస్వాదిస్తూ తినటం మంచిది. గబగబా మింగేస్తే కడుపు నిండిన విషయం మెదడుకు తెలియదు. దీంతో మరింత ఎక్కువ తినే ప్రమాదముంది.

శ్రమ సాయం

ఆహారంతో లభించిన కేలరీలు ఖర్చు కావటానికి శారీరక శ్రమ తోడ్పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామం(exercise) చేయాలనేది నిపుణుల సూచన. గుండె, శ్వాస వేగాలను పెంచే వ్యాయామాలైతే మరీ మంచివి. వేగంగా నడవటం, ఈత కొట్టటం, డ్యాన్స్‌ చేయటం వంటివన్నీ ఇలాంటివే. ఎంత మంచివైనా వ్యాయామాలను ఒకేసారి వేగంగా చేయకూడదు. క్రమంగా వేగం పెంచుకుంటూ రావాలి. దీంతో గాయాల పాలవ్వకుండా చూసుకోవచ్చు. బద్ధకంగా కూర్చోవటానికి బదులు తేలికైన వ్యాయామాలైనా చేయాలి. వీటితోనూ కేలరీలు ఖర్చవుతాయి. లిఫ్టుకు బదులు మెట్లు ఎక్కటం, అప్పుడప్పుడూ లేచి కాసేపు నడవటం వంటి చిన్న మార్పులైనా మంచి ఫలితం చూపిస్తాయి. బరువులు ఎత్తటం వంటి కండరాలను దృఢం చేసే వ్యాయామాలనూ మరవరాదు. పెద్దవాళ్లు వారానికి కనీసం రెండు రోజులైనా ఇలాంటివి సాధన చెయ్యాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని