బరువు తగ్గటానికే కాదు..

బరువు తగ్గాలంటే ఏం చేయాలి? తక్కువ తినాలి. ఎక్కువ వ్యాయామం చేయాలి. ఈ మాటలు చాలామంది వినే ఉంటారు.

Updated : 08 Dec 2022 19:57 IST

రువు తగ్గాలంటే ఏం చేయాలి? తక్కువ తినాలి. ఎక్కువ వ్యాయామం చేయాలి. ఈ మాటలు చాలామంది వినే ఉంటారు. వ్యాయామం మూలంగా కేలరీలు ఖర్చు అవుతాయి కాబట్టి బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. అయితే కొందరు మరింత ఎక్కువగా, తీవ్రంగా వ్యాయామం చేస్తూ త్వరగా బరువు తగ్గాలని భావిస్తుంటారు. ఇందులో అంత నిజం లేదని తాజా అధ్యయనం పేర్కొంటోంది. తక్కువ, మధ్యస్థాయి శారీరకశ్రమతో కేలరీలు ఖర్చు కావటం పెరుగుతోంది గానీ.. తీవ్రమైన వ్యాయామంతో ఆశించిన స్థాయిలో మరీ ఎక్కువగా కేలరీలు ఖర్చు కావటం లేదు. అంటే వ్యాయామంతో కేలరీలు ఖర్చవ్వటమనేది ఒక స్థాయి మేరకే పరిమితం అవుతోందన్నమాట. అంతమాత్రాన నిరాశ పడాల్సిన పనిలేదు. వ్యాయామంతో కేలరీలు ఖర్చు కావటం ఒక్కటే కాదు.. ఇతరత్రా బోలెడు ప్రయోజనాలున్నాయి. వారానికి 150 నిమిషాల పాటు ఒక మాదిరి నుంచి తీవ్రస్థాయి వరకు వ్యాయామం చేస్తే రక్తపోటు తగ్గటంతో పాటు విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె వేగమూ తగ్గుతుంది. రక్తనాళాలు విప్పారేలా చేసే నైట్రిక్‌ ఆక్సైడ్‌ స్థాయులు పెరుగుతాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. కణాలు ఇన్సులిన్‌ను గ్రహించే ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. పైగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల మెదడు ఆరోగ్యమూ పుంజుకుంటుంది. కాబట్టి వ్యాయామాన్ని కేవలం బరువు తగ్గే దృష్టితోనే చూడటం తగదని, ఇది రకరకాల జబ్బుల బారినపడకుండా కాపాడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. జబ్బులు వచ్చాక బాధపడే కన్నా ఇలా వ్యాయామంతో ముందుగానే నివారించుకోవటం మేలు కదా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని