Published : 16 Feb 2021 00:44 IST

గౌటా? రుమటాయిడా?

సమస్య-సలహా

సమస్య: గౌట్‌ నొప్పితో బాధపడుతున్నాను. రుమటాయిడ్‌ మందులూ వాడుతున్నాను. మాంసాహారం మానేశాను. మద్యం అలవాటు లేదు. అయినా కాలి మడమ కీలు, బొటనవేలు దగ్గర నొప్పి వస్తోంది. విశ్రాంతి తీసుకుంటే రావటం లేదు. కాస్త దూరం నడిచినా నొప్పి మళ్లీ వస్తోంది. దీనికి పరిష్కారమేంటి?

-మహి టి. (ఈమెయిల్‌)

సలహా: మీరు గౌట్‌ ఉందని, రుమటాయిడ్‌ మందులు వాడుతున్నానని రాశారు. నిజానికివి రెండూ కలిసి ఉండటం చాలా చాలా అరుదు. అందువల్ల మీకున్న జబ్బును సరిగా నిర్ధారించలేదనే అనిపిస్తోంది. రుమటాయిడ్‌ కీళ్లవాతం, గౌట్‌ రెండింటిలోనూ కీళ్ల వాపు, నొప్పి ఉన్నప్పటికీ రెండూ వేర్వేరు సమస్యలు. గౌట్‌లో కీళ్ల వద్ద యూరిక్‌ ఆమ్లం స్ఫటికాలుగా ఏర్పడి నొప్పికి దారితీస్తుంది. ఇది సాధారణంగా కాలి బొటన వేలు కీలులో కనిపిస్తుంది. గౌట్‌ నొప్పి వచ్చిపోతూ ఉంటుంది. ఒకసారి మొదలైతే 4-7 రోజులకు తగ్గిపోతుంది. మళ్లీ మూడు నెలలకో, ఆరు నెలలకో రావొచ్చు. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తొలిదశలో చికిత్స తీసుకోకపోయినా దానంతటదే తగ్గిపోతుంది. అదే రుమటాయిడ్‌ కీళ్లవాతమైతే వస్తే పోదు. సరైన చికిత్స తీసుకోకపోతే వారాలు, నెలలు, ఏళ్ల తరబడి వేధిస్తుంది. దీనికి మూలం గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థ. ఇది పొరపాటున మన కీళ్ల మీదే దాడిచేసి వాటిని దెబ్బతీస్తుంది. రుమటాయిడ్‌ కీళ్లవాతం శరీరానికి రెండు పక్కల కీళ్లలోనూ.. అంటే ఎడమ మణికట్టు, కుడి మణికట్టు ఇలా.. ఒకే సమయంలో వస్తుంది. మీరు గౌట్‌ను ఎలా నిర్ధారణ చేశారన్నది తెలపలేదు. ఒకవేళ గౌట్‌ అయితే- జబ్బును నిర్ధారించినప్పుడు రక్తంలో యూరిక్‌ ఆమ్లం స్థాయులు ఎంత ఉన్నాయి? ఇప్పుడెంత ఉన్నాయి? అనేది చూడటం ముఖ్యం. మాంసాహారం మానేసి, మద్యం జోలికి వెళ్లకుండా క్రమం తప్పకుండా మందులు వేసుకుంటుంటే గౌట్‌ నొప్పి మళ్లీ మళ్లీ రావటం అరుదు. అందువల్ల మీకున్న సమస్య గౌట్‌ కాకపోవచ్చనే అనిపిస్తోంది. బహుశా మీరు రుమటాయిడ్‌ కీళ్లవాతంతో గానీ సోరియాసిస్‌తో ముడిపడిన కీళ్లవాతంతో గానీ బాధపడుతూ ఉండి ఉండొచ్చు. మందుల మోతాదు సరిపడక నొప్పి వస్తుండొచ్చు. సోరియాసిస్‌ కీళ్లవాతంలోనూ ఒకోసారి యూరిక్‌ ఆమ్లం మోతాదులు కాస్త ఎక్కువగా ఉంటాయి. దీన్ని గౌట్‌గానూ పొరపడుతుంటారు. మీరు దగ్గర్లోని రుమటాలజీ నిపుణులను సంప్రదించటం మంచిది. అవసరమైన పరీక్షలు చేసి గౌట్‌ ఉందా? రుమటాయిడ్‌ కీళ్లవాతం ఉందా? అనేది నిర్ధారిస్తారు. తగు మందులు సూచిస్తారు. ఇప్పుడు వాడుతున్న మందులు సరైనవే అయితే మందుల మోతాదు పెంచుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు