Published : 20 Apr 2021 01:31 IST

జ్ఞాపకమూ నిలుస్తోందా?

నెలసరి నిలిచిపోవటానికి (మెనోపాజ్‌) చాలాకాలం ముందు నుంచే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ వస్తుంటాయి. దీన్నే పెరిమెనోపాజ్‌ దశ అంటారు. నెలసరి సరిగా కాకపోవటం, ఒళ్లంతా వేడిగా ఉన్నట్టు అనిపించటం వంటి లక్షణాలు మొదలవుతుంటాయి. కొందరు మహిళల్లో మెదడు చురుకుదనమూ తగ్గుతుంటుంది, ఆలోచనలు మందగిస్తుంటాయి (బ్రెయిన్‌ ఫాగ్‌). ఏదో చదువుతుంటారు గానీ మధ్యలో ఏవేవో ఆలోచనలు మనసును దారి మళ్లించొచ్చు. దీంతో మళ్లీ మొదటి నుంచి చదవాల్సి రావొచ్చు. తెలిసినవారే అయినా కొన్నిసార్లు పేర్లు ఎంతకీ గుర్తుకురాకపోవచ్చు. ఇంట్లో ఏదో గదిలోకి వెళ్లొచ్చు. ఎందుకొచ్చామో మరచిపోవచ్చు. ఆలోచించినా తట్టకపోవచ్చు. మంచి విషయం ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. మున్ముందు విడవకుండా వేధిస్తాయనే బాధ అవసరం లేదు. అప్పుడప్పుడు మరచిపోవటానికి కేవలం హార్మోన్ల మార్పులే కారణం కాకపోవచ్చు. నిద్ర సరిగా పట్టకపోవటమూ దోహదం చేయొచ్చు. రాత్రిపూట వేడి ఆవిర్లతో చెమటలు పోయటం నిద్రను బాగానే దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు మలివయసు జీవితం గుర్తుకొచ్చి మానసిక ఒత్తిడీ తలెత్తొచ్చు. ఇవీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీసేవే. కొన్ని జాగ్రత్తలతో ఇలాంటి స్థితి నుంచి బయటపడే మార్గం లేకపోలేదు.
కాస్త నెమ్మది: మనసు పక్కదారి పడుతున్నప్పుడు ఒకసారి గాఢంగా శ్వాస తీసుకొని, చేస్తున్న పని మీద మరోసారి దృష్టి సారించాలి. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు దాన్ని విడమరచుకోవటానికి మెదడుకు కాస్త సమయం ఇవ్వటం మంచిది.
ఒత్తిడి నియంత్రణ: ధ్యానం, ప్రాణాయామం వంటివి ఒత్తిడి తగ్గటానికి తోడ్పడతాయి. తక్షణ పరిస్థితికి అనుగుణంగా అప్రమత్తంగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా కొత్త సమాచారం మనసులో బాగా నాటుకుంటుంది. అవసరమైనప్పుడు వెంటనే గుర్తుకొస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం: వ్యాయామం మెదడునూ బలోపేతం చేస్తుంది. వారానికి మూడు రోజులు ఒక మాదిరి వ్యాయామం చేసినా మెదడులో హిప్పోక్యాంపస్‌ పరిమాణం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జ్ఞాపకశక్తి, విషయగ్రహణ సామర్థ్యంలో హిప్పోక్యాంపస్‌ కీలక పాత్ర పోషిస్తుంది.
కంటి నిండా నిద్ర: నిద్ర సరిగా పట్టకపోతే మెదడు చురుకుదనమూ తగ్గుతుంది. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం.. పడుకోవటానికి 2 గంటల ముందే టీవీలు, కంప్యూటర్లు కట్టేయటం వంటి జాగ్రత్తలతో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.
జ్ఞాపకశక్తి ఉపాయాలు: చిన్నప్పుడు పాఠాలు, జవాబులు గుర్తుండటానికి ఎలాంటి చిట్కాలు పాటించేవారో ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి. అలాంటివి ఇప్పుడూ ఉపయోగపడతాయి. ఉదాహరణకు- ఆయా విషయాలను ఏదో ఒక వస్తువుతోనో, దృశ్యంతోనో ముడిపెట్టి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. పదే పదే మననం చేసుకోవచ్చు. ఇలాంటి పద్ధతులతో అవి మెదడులో మరింత గాఢంగా స్థిరపడతాయి. బాగా గుర్తుండిపోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు