గర్భిణి మధుమేహం, హైబీపీతో గుండెజబ్బుల ముప్పు

గర్భం ధరించినట్టు తెలియగానే స్త్రీ గుండె ఆనందంతో ఎంత ఉప్పొంగుతుందో! కానీ గర్భధారణ కొందరిలో గుండె మీద విపరీత ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలోనే మొదలయ్యే అధిక రక్తపోటు (జెస్టేషనల్‌ హైపర్‌టెన్షన్‌), మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటిస్‌) గలవారికి

Published : 01 Jun 2021 00:46 IST

గర్భం ధరించినట్టు తెలియగానే స్త్రీ గుండె ఆనందంతో ఎంత ఉప్పొంగుతుందో! కానీ గర్భధారణ కొందరిలో గుండె మీద విపరీత ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలోనే మొదలయ్యే అధిక రక్తపోటు (జెస్టేషనల్‌ హైపర్‌టెన్షన్‌), మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటిస్‌) గలవారికి మున్ముందు గుండె రక్తనాళాల జబ్బుల (సీవీడీ) ముప్పు పెరుగుతున్నట్టు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనం పేర్కొంటోంది. గుండె పోటు, పక్షవాతం, కాళ్లలో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటం, గుండె వైఫల్యం వంటివన్నీ సీవీడీకి సంబంధించినవే. ఇంతకు ముందెన్నడూ అధిక రక్తపోటు లేకుండా గర్భం ధరించిన 20 వారాల తర్వాత రక్తపోటు 140/90, అంతకన్నా ఎక్కువ ఉండటాన్ని గర్భిణి రక్తపోటు (జెస్టేషనల్‌ హైపర్‌టెన్షన్‌) అంటారు. దీంతో తర్వాతి కాలంలో గుండెజబ్బులు వచ్చే అవకాశం 67% ఎక్కువవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదే రక్తపోటు మరింత ఎక్కువై గర్భవాతానికి దారితీస్తే (ప్రిఎక్లాంప్సియా) గుండెజబ్బుల ముప్పు 2.7 రెట్లు ఎక్కువవుతుండటం గమనార్హం. ఇక గర్భిణి మధుమేహులకైతే మున్ముందు గుండెజబ్బుల ముప్పు 68% ఎక్కువవుతుండగా.. మధుమేహం తలెత్తే అవకాశం 10 రెట్లు పెరుగుతోంది. గర్భిణి అధిక రక్తపోటు, మధుమేహం మాత్రమే కాదు. నెలలు నిండక ముందే (37వ వారం లోపే) కాన్పు కావటం, 2.6 కిలోల కన్నా తక్కువ బరువుతో శిశువు పుట్టటం, కాన్పుకు ముందే గర్భసంచి నుంచి మాయ విడిపోవటం, శిశువు మరణించి పుట్టటం వంటివీ గుండెజబ్బుల ముప్పు పెరిగేలా చేయొచ్చు. అందువల్ల ఇలాంటి వాటిలో ఏదో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్న గర్భిణులు మున్ముందు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించినా వీటి గురించి    చెప్పటం మంచిదని వివరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, బరువు అదుపులో ఉంచుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని