అశ్వగంధతో రేడియేషన్‌ తగ్గుతుందా?

నా వయసు 51 ఏళ్లు. నెల క్రితం కొవిడ్‌ వచ్చి, తగ్గింది. గత సంవత్సరం కూడా లక్షణాలు కనిపిస్తే కొవిడ్‌ ఉందో, లేదో తెలుసుకోవటానికి డాక్టర్లు స్కానింగ్‌ చేశారు. అప్పుడు కొవిడ్‌ లేదని తేలింది. స్కానింగుతో రేడియేషన్‌ ప్రమాదముందని, ఎక్కువగా తీయించుకుంటే క్యాన్సర్‌ వస్తుందని అంటున్నారు.

Updated : 30 Aug 2022 12:08 IST

సమస్య సలహా

సమస్య: నా వయసు 51 ఏళ్లు. నెల క్రితం కొవిడ్‌ వచ్చి, తగ్గింది. గత సంవత్సరం కూడా లక్షణాలు కనిపిస్తే కొవిడ్‌ ఉందో, లేదో తెలుసుకోవటానికి డాక్టర్లు స్కానింగ్‌ చేశారు. అప్పుడు కొవిడ్‌ లేదని తేలింది. స్కానింగుతో రేడియేషన్‌ ప్రమాదముందని, ఎక్కువగా తీయించుకుంటే క్యాన్సర్‌ వస్తుందని అంటున్నారు. రేడియేషన్‌ తగ్గటానికి రోజూ రెండు పూటలా అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగమని ఒక ఆయుర్వేద డాక్టర్‌ సూచించారు. ఇది నిజమేనా? దీంతో రేడియేషన్‌ తగ్గుతుందా? నేను తీసుకోవచ్చా? దీన్ని ఎలా వాడుకోవాలి?

- సుబ్బారావు, ఏలూరు

సలహా: వైద్య పరీక్షల నిమిత్తం ఒకట్రెండు సార్లు స్కానింగ్‌ తీయించుకుంటే ఇబ్బందేమీ ఉండదు. అతిగా తీయించుకుంటేనే రేడియేషన్‌ దుష్ప్రభావం పడుతుంది. మీరు ఒక్కసారే స్కానింగ్‌ తీయించుకున్నారు కాబట్టి భయపడాల్సిన పనేమీ లేదు. ఇక అశ్వగంధ విషయానికి వస్తే- ఇది రేడియేషన్‌ ప్రభావాన్ని తగ్గిస్తుందని కచ్చితంగా చెప్పలేం కానీ క్యాన్సర్‌కు దోహదం చేసే అంశాలను కట్టడి చేయగలదని చెప్పుకోవచ్చు. అశ్వగంధ ధాతువులను వృద్ధి చేస్తుంది. కండరాలు, కణాల మరమ్మతుకు తోడ్పడుతుంది. శరీరానికి సత్తువనిస్తుంది. ఇలా ఇది పరోక్షంగా రేడియేషన్‌ ప్రభావాన్ని తగ్గించటానికి ఉపయోగపడగలదు. ఇందుకోసం కాకపోయినా ఆరోగ్యంగా ఉండటానికి అశ్వగంధ బాగా తోడ్పడుతుంది. మీ వయసు 51 అంటన్నారు కాబట్టి మున్ముందు వయసుతో పాటు వచ్చే ఇబ్బందులు తగ్గటానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది. దీని చూర్ణాన్ని పాలతో మరిగించి తీసుకోవటం మంచిది. పాలు మరుగుతున్నప్పుడు అందులో అశ్వగంధ చూర్ణాన్ని వేసి, పొయ్యి కట్టేయాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత పాలను గ్లాసులో పోసుకొని తాగాలి. అశ్వగంధ కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి చక్కెర లేదా బెల్లం కలుపుకోవచ్చు. అశ్వగంధతో పాటు తిప్పతీగ చూర్ణాన్ని కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఇవి రెండూ రసాయనంగా పనిచేస్తూ రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి తోడ్పడతాయి. బలం క్షీణించకుండా కాపాడతాయి.

సమస్యలు పంపాల్సిన చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512  
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని