దంతాలకులావు హాని

పళ్లు దృఢంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఊబకాయం బారినపడకుండా చూసుకోండి. ఈ రెండింటికీ బలమైన సంబంధమే ఉంటున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఊబకాయంతో మధుమేహం, గుండెజబ్బుల వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయన్నది తెలిసిందే.

Published : 14 Dec 2021 00:56 IST

పళ్లు దృఢంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఊబకాయం బారినపడకుండా చూసుకోండి. ఈ రెండింటికీ బలమైన సంబంధమే ఉంటున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఊబకాయంతో మధుమేహం, గుండెజబ్బుల వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయన్నది తెలిసిందే. ఇది దంతాలనూ వదిలి పెట్టటం లేదని యూనివర్సిటీ ఎట్‌ బఫెలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊబకాయంతో శరీరంలో కణస్థాయిలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగుతూ వస్తుంది కూడా. దీని మూలంగా పుట్టుకొచ్చే మైలాయిడ్‌ డిరైవ్‌డ్‌ సప్రెసర్‌ కణాలు (ఎండీఎస్‌సీ) ఎముక కణజాలాన్ని దెబ్బతీసేలా చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దంతాలకు చిగుళ్ల వ్యాధి పెద్ద శత్రువు. ఇది దంతాలకు దన్నుగా నిలిచే ఎముకను, కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఇలా దంతాలు ఊడిపోవటానికి చిగుళ్ల జబ్బు పెద్ద కారణంగా నిలుస్తోందన్నమాట. మైలాయిడ్‌ డిరైవ్‌డ్‌ సప్రెసర్‌ కణాలు ఎముక మజ్జ నుంచి పుట్టుకొస్తాయి. తర్వాత ఎముక ఏర్పడటాన్ని అడ్డుకునే కణాలుగా (ఆస్టియోక్లాస్ట్స్‌) మారతాయి. ఇవి ఎముక క్షీణించే ముప్పు పెరిగేలా చేస్తాయి. ఊబకాయుల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఊబకాయం మూలంగా ఎండీఎస్‌సీ మోతాదులు పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊబకాయుల్లో ఆస్టియోక్లాస్ట్స్‌తో ముడిపడిన 27 జన్యువులు సైతం ఎక్కువగా వ్యక్తీకరణ అవుతున్నట్టూ కనుగొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు