బరువుకు నిద్ర కళ్లెం

బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రిపూట ఒక గంటసేపు ఎక్కువ నిద్రపోండి! ఆశ్చర్యంగా అనిపించినా బరువు తగ్గించుకునే మార్గం పడకగదిలోనూ ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌-మాడిసన్‌ అధ్యయనం సూచిస్తోంది.

Updated : 15 Feb 2022 01:26 IST

రువు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రిపూట ఒక గంటసేపు ఎక్కువ నిద్రపోండి! ఆశ్చర్యంగా అనిపించినా బరువు తగ్గించుకునే మార్గం పడకగదిలోనూ ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌-మాడిసన్‌ అధ్యయనం సూచిస్తోంది. అధికబరువు గలవారు రాత్రిపూట మరో గంటసేపు అదనంగా నిద్రిస్తే తక్కువగా తినటమే దీనికి కారణం. వీరిలో కొందరు రోజుకు 270 కేలరీల ఆహారం తగ్గిస్తే, మరికొందరు ఏకంగా 500 కేలరీల ఆహారం తక్కువగా తినటం గమనార్హం. రోజుకు 270 కేలరీలు తగ్గటం వల్ల ఒనగూరే దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మూడేళ్లలో సుమారు 13 కిలోల బరువు తగ్గే అవకాశముంది. చాలావరకు అధ్యయనాలు నిద్ర తగ్గితే ఎక్కువగా తినటం మీద దృష్టి సారిస్తుంటాయి. దీనికి భిన్నంగా తాజా అధ్యయనంలో నిద్రను పెంచుకుంటే ఏమవుతుందనే దాన్ని పరిశోధకులు పరిశీలించారు. ఇందులో సానుకూల ఫలితం వెల్లడి కావటం ముదావహం. కంటి నిండా నిద్ర పోవటం వల్ల ఆకలిని అణచే ఘ్రెలిన్‌ హార్మోన్‌ తగ్గటం, మెదడులో ఆకలిని నియంత్రించే భాగంలో మార్పులు తలెత్తటం వంటివి తక్కువగా తినటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఊబకాయ సమస్యను ఎదుర్కోవటంలో తగినంత నిద్ర పోవటమనేది గొప్ప మలుపు కాగలదని ఆశిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు సరైన నిద్ర అలవాట్లను పాటించటం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని