Published : 19 Apr 2022 02:31 IST

వాపు ప్రక్రియ గాడి తప్పకుండా..

అది మన కంటికేమీ కనిపించదు. అసలది ఉన్నట్టయినా తెలియదు. కానీ లోలోపల్నుంచి శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తూనే ఉంటుంది. అదే వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌). మధుమేహం, గుండెజబ్బుల దగ్గర్నుంచి క్యాన్సర్ల వరకూ అన్నింటికీ ఇదే బీజం వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ దీని కథేంటి?

నిజానికి వాపు ప్రక్రియ మనకు మేలే చేస్తుంది. ఏదైనా దెబ్బతగిలినప్పుడో, ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడో మన రోగనిరోధక వ్యవస్థ వెంటనే స్పందిస్తుంది. వీటితో పోరాడే ప్రయత్నంలో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. జబ్బులు తగ్గగానే ఇదీ తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు దెబ్బలు, ఇన్‌ఫెక్షన్లు లేకపోయినా రోగనిరోధక వ్యవస్థ స్పందించి, వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంటుంది. ఇది దాడి చేయటానికి బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివేవీ ఉండకపోవటం వల్ల రక్తనాళాల గోడలు, అవయవాలు, కీళ్ల వంటి వాటిపై విరుచుకు పడుతుంది. అంటే శరీరాన్ని రక్షించాల్సిన ప్రక్రియే గాడి తప్పి దెబ్బతీయటం మొదలెడుతుందన్నమాట. ఇదిలాగే దీర్ఘకాలం కొనసాగుతూ వస్తే గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం, అల్జీమర్స్‌, క్యాన్సర్ల వంటివి తలెత్తుతాయి.


తగ్గించుకోవటమెలా?

అదృశ్యంగా దాడి చేసేదే అయినా వాపు ప్రక్రియను తగ్గించుకునే మార్గాలు లేకపోలేదు.

* కంటి నిండా నిద్ర: తగినంత నిద్ర పోకపోతే శరీరం వాపు ప్రక్రియను ప్రేరేపించే ప్రమాద ముంది. కాబట్టి రాత్రిపూట 7-9 గంటల సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఎంత సేపు నిద్రపోతున్నామన్నదే కాదు, ఎంత గాఢంగా నిద్రపోతున్నా మన్నదీ ముఖ్యమే. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి. పడుకోవటానికి చాలా ముందుగానే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల వంటివి కట్టేయాలి. పడకగది చల్లగా, ప్రశాంతంగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి.

* శారీరక శ్రమ: కనీసం 20 నిమిషాల సేపు వేగంగా నడవటం వంటి ఒక మాదిరి వ్యాయామంతోనూ శరీరంలో వాపు ప్రక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలన్నది సిఫారసు. ప్రస్తుతం ఎలాంటి వ్యాయామాలు చేయనివారు కనీసం 20 నిమిషాలు నడిచినా చాలు. కాబట్టి వీలున్నప్పడల్లా స్నేహితులతోనో, పెంపుడు కుక్కతోనో అలా బయటకు వెళ్లటం మంచిది.

* మసాలా దినుసులు: పసుపు, దాల్చినచెక్క, జీలకర్ర, అల్లం వంటివి వాపు ప్రక్రియ ప్రేరేపితం కాకుండా నిలువరిస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వంటకాల్లో వీటిని వాడుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమూ సొంతమవుతాయి.

* ఉపవాసం: రోజూ కొద్ది గంటల వ్యవధిలోనే తినటం వంటి ఉపవాస పద్ధతులు వాపు ప్రక్రియను అణచి పెట్టటానికి తోడ్పడుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి పద్ధతుల్లో చాలా రకాలే ఉన్నాయి. వీలును బట్టి వీటిని ఎంచుకోవచ్చు. చాలామంది అనుసరించే పద్ధతి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపే తినటం. మిగతా సమయంలో ఎలాంటి ఆహారమూ తీసుకోరు. కావాలంటే నీళ్ల వంటివి తాగొచ్చు.

* ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు: వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మనకు రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు అవసరం. వీటిల్లో 150 గ్రాముల పండ్లు, 250 గ్రాముల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పొట్టు లేని పిండి పదార్థాలు, మాంసం, వేపుళ్ల వంటివి ఒంట్లో వాపు ప్రక్రియ ఉద్ధృతమయ్యేలా చేస్తాయి. వీటికి బదులు పండ్లు, కూరగాయలు, గింజపప్పులు, చిక్కుళ్లు, చేపల వంటివి తీసుకోవాలి.

* యోగా: శ్వాస మీద ధ్యాస నిలిపే యోగాసనాలు, ప్రాణాయామం వంటి పద్ధతులు ఒత్తిడితో ముడిపడిన కార్టిజోల్‌ హార్మోన్‌ తగ్గటానికి తోడ్పడతాయి. వీటిని రోజూ క్రమం తప్పకుండా చేస్తే నిరాశ, నిస్పృహ, ఆందోళన సైతం తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడేవే. యోగాతో అధిక కొలెస్ట్రాల్‌, గ్లూకోజు మోతాదుల హెచ్చుతగ్గుల వంటి వాపు ప్రక్రియ లక్షణాలు కూడా తగ్గుతాయి.

* బరువు అదుపు: వాపు ప్రక్రియతో బరువు పెరగటమే కాదు.. అధిక బరువుతో వాపు ప్రక్రియ మరింత ఉద్ధృతమవుతుంది కూడా. రకరకాల జబ్బులకు అధిక బరువు, ఊబకాయం ముప్పు కారకాలుగా పరిణమిస్తుండటానికి ఇదీ ఒక కారణమే. కాబట్టి శరీర బరువు, ఎత్తుల నిష్పత్తి (బీఎంఐ) అదుపు తప్పకుండా చూసుకోవాలి.

* సిగరెట్లు వద్దు: పొగ తాగటం రకరకాల అనర్థాలకు దారితీస్తుంది. వీటిల్లో ఒకటి వాపు ప్రక్రియ పెరగటం. కాబట్టి సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటి వాటికి జోలికి వెళ్లొద్దు. ఒకవేళ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. మానలేకపోతుంటే డాక్టర్‌ సలహానైనా తీసుకోవాలి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts