వాసన పోయింది?

సమస్య: నాకు 44 ఏళ్లు, మా అబ్బాయికి 13 ఏళ్లు. మా ఇద్దరికీ ఆరు నెలల నుంచి వాసన పోయింది. మంచి, చెడ్డ వాసనలేవీ తెలియటం లేదు. ఏదైనా తింటే రుచి తెలుస్తుంది గానీ వాసన తెలియటం లేదు. ఇద్దరమూ కొవిడ్‌ పరీక్ష

Published : 26 Apr 2022 01:12 IST

సమస్య: నాకు 44 ఏళ్లు, మా అబ్బాయికి 13 ఏళ్లు. మా ఇద్దరికీ ఆరు నెలల నుంచి వాసన పోయింది. మంచి, చెడ్డ వాసనలేవీ తెలియటం లేదు. ఏదైనా తింటే రుచి తెలుస్తుంది గానీ వాసన తెలియటం లేదు. ఇద్దరమూ కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాం. నెగెటివ్‌గా వచ్చింది. టీకా కూడా తీసుకున్నాం. ఇప్పుడేం చేయాలి?

- ఒక పాఠకుడు (ఈ-మెయిల్‌)

సలహా: వాసన తెలియకపోవటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. మీకు, మీ అబ్బాయికి ఇద్దరికీ ఒకేసారి వాసన పోయిందంటే కొవిడ్‌ ఇన్‌ఫెక్షనే కారణమై ఉండొచ్చని అనిపిస్తోంది. ఒకోసారి కొవిడ్‌ పరీక్ష ఫలితం నెగెటివ్‌గా రావొచ్చు. ముఖ్యంగా మరీ ముందుగా గానీ మరీ ఆలస్యంగా గానీ (లక్షణాలు ఉద్ధృతంగా లేనప్పుడు) పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చే అవకాశముంది. కాబట్టి కొవిడ్‌ రాలేదనుకోవటానికి లేదు. కొవిడ్‌ బాధితుల్లో కొందరిలో వాసన పోవటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివారిలో 90% మందిలో వారం, పది రోజుల్లో తిరిగి వాసన శక్తి కోలుకుంటుంది. కొందరికి మూడు నెలలు, ఆరు నెలల తర్వాత నెమ్మదిగా, పాక్షికంగా వాసన తిరిగి వచ్చినవారూ ఉన్నారు. దురదృష్టవశాత్తు కొందరికి పూర్తిగా వాసన పోతోంది. దీనికి కారణం ముక్కు పైభాగాన వాసనలను పసిగట్టటానికి తోడ్పడే (ఆల్‌ఫ్యాక్టరీ) నాడుల సముదాయాన్ని వైరస్‌ పూర్తిగా దెబ్బతీయటం. కొందరికి ఫ్లూ వైరస్‌తోనూ వాసన పోవచ్చు. ఇలాంటి శ్వాసకోశ వైరస్‌లతో పోయిన వాసన శక్తి మళ్లీ రాదు. ఏదేమైనా మీరు ఫ్లూటికజోన్‌ ప్యూరయేట్‌, మొమెటజోన్‌ అనే ముక్కు స్ప్రే మందుల్లో ఏదో ఒకటి వాడి చూడండి. ఒక ముక్కు రంధ్రంలో రెండు మోతాదుల చొప్పున రోజుకు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని నెల పాటు వాడినా ఫలితం లేకపోతే ఈఎన్‌టీ సర్జన్‌ను సంప్రదించండి. నేసల్‌ ఎండోస్కోపీ, అవసరమైతే ముక్కు చుట్టుపక్కలుండే గాలిగదుల సీటీ స్కాన్‌ చేసి ముక్కులోపల బుడిపెలు (పాలిప్స్‌) ఉన్నాయేమో చూస్తారు. తొక్క తీసిన తెల్ల ద్రాక్ష మాదిరిగా ఉండే ఇవి ముక్కులో వాసన పసిగట్టే నాడుల సముదాయ భాగాన్ని మూసేస్తుంటాయి. దీంతో వాసన తెలియటం తగ్గుతుంది. నిజానికి వాసన పోవటానికి ప్రధాన కారణం బుడిపెలే. అయితే ఇప్పుడు కొవిడ్‌ ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఒకవేళ మీకు ముక్కులో బుడిపెలు ఉన్నట్టయితే వాటిని తొలగిస్తే తిరిగి వాసన తెలిసే అవకాశముంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని