గుండె దగ్గు!

దుమ్ము ధూళి వంటివి ఊపిరితిత్తులను చికాకు పరుస్తున్నా.. శ్లేష్మంలో బ్యాక్టీరియా చిక్కుకున్నా దగ్గు రావటం సహజమే. ఇది శరీరం హాని కారకాలను బయటకు వెళ్లగొట్టేందుకు చేసే ప్రయత్నమే

Published : 17 May 2022 00:51 IST

దుమ్ము ధూళి వంటివి ఊపిరితిత్తులను చికాకు పరుస్తున్నా.. శ్లేష్మంలో బ్యాక్టీరియా చిక్కుకున్నా దగ్గు రావటం సహజమే. ఇది శరీరం హాని కారకాలను బయటకు వెళ్లగొట్టేందుకు చేసే ప్రయత్నమే. ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన తర్వాత, చికాకు పరచేవి బయటకు వెళ్లిపోయాక దగ్గూ తగ్గుతుంది. కానీ విడవకుండా దగ్గు వస్తుంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. దీనికి చాలావరకు ఆస్థమా, బ్రాంకైటిస్‌, సీవోపీడీ వంటి సమస్యలు కారణమవుతుంటాయి. వీటిల్లోనూ ఊపిరితిత్తుల్లో వాపు ప్రక్రియ అదుపులోకి వస్తే దగ్గు తగ్గుతుంది. మరి మందులు వాడుతున్నా ఫలితం కనిపించకపోతే? మరేదైనా సమస్య.. ముఖ్యంగా గుండె వైఫల్యం ఏమైనా కారణమవుతుందేమో చూడటం తప్పనిసరి.

గ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. అందుకే గుండె వైఫల్యానికీ దగ్గుకు సంబంధం ఉందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి కొందరిలో గుండెజబ్బు తొలిసారిగా శ్వాస సమస్య రూపంలోనే బయటపడుతుంటుంది. దగ్గు తగ్గటానికి రకరకాల చికిత్సలు తీసుకున్నా ఫలితం కనిపించనప్పుడు పరీక్ష చేస్తే చివరికి గుండె జబ్బు ఉన్నట్టు తేలుతుంటుంది. గుండె వైఫల్యంలో గుండె కండరం సరిగా పనిచేయదు. కండరం బలహీన పడటం వల్ల రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని గాలి గదుల్లో ద్రవం పోగుపడుతుంది (పల్మనరీ ఎడీమా). ఈ ద్రవాన్ని బయటకు నెట్టి వేసే క్రమంలో దగ్గు విడవకుండా వేధిస్తుంటుంది.

ఇతర లక్షణాలూ..

దగ్గుతో పాటు ఆయాసం రావటం, వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఆయాసం ఎక్కువ కావటం, గట్టిగా పిల్లికూతలు, ఛాతీలో బరువుగా అనిపించటం, పొడి దగ్గు, కొందరికి దగ్గుతో కళ్లె పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి యాంటీబయాటిక్‌ మందులు, స్టిరాయిడ్లు వాడినా దగ్గు తగ్గకపోతే గుండె వైఫల్యం ఉందేమోనని అనుమానించటం మంచిది. బరువు పెరగటం, కాళ్లలో వాపు, కడుపు ఉబ్బటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం వంటి ఇబ్బందులు ఉన్నట్టయితే తాత్సారం చేయరాదు. నిస్సత్తువ, వికారం, త్వరగా కడుపు నిండినట్టు అనిపించటం వంటి అస్పష్ట లక్షణాలూ గుండె వైఫల్యానికి సంకేతాలు కావొచ్చు.

నిర్ధరణ ఎలా?

గుండె వైఫల్యాన్ని అనుమానించినప్పుడు రక్త పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే, ఎకోకార్డియోగ్రామ్‌, ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు చేస్తారు. గుండె ఎంఆర్‌ఐ కూడా చేయొచ్చు. వీటితో గుండె వైఫల్యం ఉంటే నిర్ధరణ అవుతుంది. జబ్బు తీవ్రత కూడా బయటపడుతుంది.

చికిత్స ఏంటి?

అవసరాన్ని బట్టి ఏసీఈ ఇన్‌హిబిటార్‌, బీటా బ్లాకర్‌ రకం మందుల వంటివి సూచిస్తారు. కొందరికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులూ ఇవ్వచ్చు.

జీవనశైలి మార్చుకోవాలి

మందులు వాడుకోవటంతో పాటు జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

* గుండెకు మేలు చేసే ఆహారం.. అంటే కూరగాయలు, పండ్లు, బాదం వంటి గింజపప్పులు, పొట్టుతీయని ధాన్యాలు, చేపల వంటివి ఎక్కువగా తినాలి. కొవ్వు పదార్థాలు, మాంసం, బాగా పొట్టుతీసిన ధాన్యాలు, కూల్‌డ్రింకుల వంటివి మానెయ్యాలి.
* అధిక బరువుతో గుండె మీద ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి.
* డాక్టర్‌ సలహా మేరకు శరీర సామర్థ్యాన్ని బట్టి తగినంత వ్యాయామం చేయాలి.
* మద్యం జోలికి వెళ్లకూడదు. మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.
* పొగ తాగే అలవాటుంటే పూర్తిగా మానెయ్యాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని