మధుమేహానికి కొత్త మందు!

పెద్దవారిలో వచ్చే టైప్‌2 మధుమేహానికి కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. దీని వాడకానికి అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవలే అనుతించింది. పేరు టిర్‌జెపటైడ్‌. ఇన్సులిన్‌ మాదిరిగానే దీన్ని కూడా ఇంజెక్షన్‌ ద్వారా చర్మం కింద తీసుకోవాల్సి ఉంటుంది.....

Updated : 24 May 2022 07:36 IST

పెద్దవారిలో వచ్చే టైప్‌2 మధుమేహానికి కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. దీని వాడకానికి అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవలే అనుతించింది. పేరు టిర్‌జెపటైడ్‌. ఇన్సులిన్‌ మాదిరిగానే దీన్ని కూడా ఇంజెక్షన్‌ ద్వారా చర్మం కింద తీసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇది గ్లుకగాన్‌-లైక్‌ పెప్టైడ్‌-1 (జీఎల్‌పీ-1), గ్లూకోజ్‌-డిపెండెంట్‌ ఇన్సులినోట్రోపిక్‌ పాలీపెప్టైడ్‌ (జీఐపీ) గ్రాహకాలు రెండింటినీ చురుకుగా పనిచేసేలా చేస్తుంది. అన్నవాహిక దగ్గర్నుంచే దీని పని మొదలవుతుంది. జీర్ణాశయంలో ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తుంది. దీంతో ఆకలి తగ్గుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇక పేగుల్లోకి మందు చేరుకోగానే ఇన్సులిన్‌ ఉత్పత్తి ప్రేరేపితమవుతుంది. చిన్న పేగుల కదలికలు నెమ్మదించటం వల్ల ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది. అందువల్ల గ్లూకోజు అంత ఎక్కువగా విడుదల కాదు. అదే సమయంలో ఇన్సులిన్‌ ఉత్పత్తీ పెరుగుతుంది. ఇలాంటి పనులు చేయటానికి ప్రస్తుతం మనకు 10 రకాల మాత్రలు, 7 రకాల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ జీఎల్‌పీ-1 మీద ప్రభావం చూపేవే. ఇప్పుడు తొలిసారిగా జీఐపీ మీదా ప్రభావం చూపే టిర్‌జెపటైడ్‌ వాడకానికి అనుమతి లభించటం విశేషం. ఇది మధుమేహాన్ని మరింత బాగా నియంత్రణలో ఉంచుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో తేలింది. సెమాగ్లుటైడ్‌, దీర్ఘకాలం పనిచేసే రెండు ఇన్సులిన్‌ అనలాగ్స్‌తో పోలిస్తే టిర్‌జెపటైడ్‌ మరింత సమర్థంగా గ్లూకోజు మోతాదులను తగ్గిస్తున్నట్టు బయటపడింది. ఇది అధిక గ్లూకోజును తగ్గిస్తూనే గ్లూకోజు మోతాదులు మరీ పడిపోకుండానూ (హైపోగ్లైసీమియా) చూస్తోంది. దీంతో మరో ప్రయోజనం బరువు కూడా బాగా అదుపులోకి వస్తుండటం. ఇన్సులిన్‌తో కలిపి దీన్ని తీసుకుంటే సగటున ఎక్కువ బరువు తగ్గుతున్నట్టు తేలింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని