మధుమేహులకు కొవిడ్‌ ఎందుకు తీవ్రమవుతుంది?

కొవిడ్‌-19 మధుమేహులకు తీవ్రంగా మారటం, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఎక్కువవుతుండటం మొదట్నుంచీ చూస్తున్నదే. మధుమేహుల్లో 1,5-యాన్‌హైడ్రో-డి-గ్లుసిటాల్‌ (1,5-ఏజీ) అనే మోనోసాక్రైడ్‌ మోతాదులు తక్కువగా ఉండటమే దీనికి కారణమని...

Updated : 31 May 2022 07:15 IST

కొవిడ్‌-19 మధుమేహులకు తీవ్రంగా మారటం, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఎక్కువవుతుండటం మొదట్నుంచీ చూస్తున్నదే. మధుమేహుల్లో 1,5-యాన్‌హైడ్రో-డి-గ్లుసిటాల్‌ (1,5-ఏజీ) అనే మోనోసాక్రైడ్‌ మోతాదులు తక్కువగా ఉండటమే దీనికి కారణమని చైనా అధ్యయనంలో బయట పడింది. ఈ రకం చక్కెర కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 ముల్లు ప్రొటీన్‌కు అంటుకొని, మన కణాలతో కలిసిపోకుండా అడ్డుకుంటున్నట్టు బీజింగులోని సింగువా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు. అంటే 1,5-ఏజీ తొలిదశలోనే వైరస్‌ కణాల్లోకి ప్రవేశించకుండా నిలువరిస్తుందన్నమాట. అంతేకాదు, మధుమేహం గల ఎలుకలకు 1,5-ఏజీని మందు రూపంలో ఇవ్వగా కొవిడ్‌ తీవ్రత తగ్గటం విశేషం. ఇలా ఇది కొవిడ్‌-19కు చికిత్సగానూ ఉపయోగపడగలదని తేల్చారు. ముఖ్యంగా మధుమేహులకు మరింత బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. కొవిడ్‌ తీవ్రత వైవిధ్యం మీద చాలా పరిశోధనలే జరిగాయి. ఇవన్నీ చాలావరకు జన్యు స్వభావం లేదా రోగనిరోధక వ్యవస్థ మీదే దృష్టి సారించాయి. తొలిసారిగా జీవక్రియలతో ముడిపడిన పదార్థాల ప్రభావాలపై పరిశోధకులు అధ్యయనం చేసి తాజా విషయాన్ని గుర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని