మొలలకు సహజ చిట్కాలు

మలద్వారం వద్ద నొప్పి, దురద, మంట, రక్తం పడటం.. ఇలా చెప్పుకొంటూ పోతే మొలల బాధలు అన్నీ ఇన్నీ కావు. మనసును కుదురుగా ఉండనీయకుండా తీవ్రంగా వేధిస్తుంది. కొన్నిసార్లు మొలలు బయటకు పొడుచుకొని వస్తుంటాయి కూడా. దీర్ఘకాలంగా

Updated : 19 Jul 2022 09:07 IST

మలద్వారం వద్ద నొప్పి, దురద, మంట, రక్తం పడటం.. ఇలా చెప్పుకొంటూ పోతే మొలల బాధలు అన్నీ ఇన్నీ కావు. మనసును కుదురుగా ఉండనీయకుండా తీవ్రంగా వేధిస్తుంది. కొన్నిసార్లు మొలలు బయటకు పొడుచుకొని వస్తుంటాయి కూడా. దీర్ఘకాలంగా మలబద్ధకం లేదా విరేచనాలు, విసర్జన సమయంలో ముక్కటం, మల విసర్జనకు ఎక్కువసేపు కూర్చోవటం వంటివి మొలలకు దారితీస్తుంటాయి. కొందరికి ఎలాంటి కారణం లేకుండానూ రావొచ్చు. కొన్ని జాగ్రత్తలతో మొలలు బాధలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

* కూర్చోవటానికి వీలైన తొట్టిలో 3-4 అంగుళాల వరకు గోరు వెచ్చటి నీటిని పోయాలి. 10-15 నిమిషాల సేపు అందులో కూర్చోవాలి. తర్వాత లేచి, నెమ్మదిగా తువ్వాలుతో తడుతూ తుడుచుకోవాలి. రుద్దకూడదు. దీంతో దురద, చికాకు తగ్గుతాయి.
* మల విసర్జనను ఆపితే మలం వెనక్కి వెళ్లి పోతుంది. గట్టి పడుతుంది. దీంతో విసర్జన సమయంలో గట్టిగా ముక్కాల్సి వస్తుంది. ఇది మొలలను మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మల విసర్జనను ఆపుకోకూడదు.
* టాయ్‌లెట్‌ మీద ఎక్కువసేపు కూర్చోవటం తగదు. ఎక్కువసేపు కూర్చుంటే మొలలు కిందికి రావొచ్చు, ఉబ్బొచ్చు. వెస్టర్న్‌ కమోడ్‌ మీద కూర్చున్నప్పుడు పాదాల కింద కాస్త ఎత్తు పెట్టుకోవాలి. దీంతో మలాశయం స్థితి మారి, విసర్జన సాఫీగా అవుతుంది. కుర్చీలో గానీ గట్టి ఉపరితలం మీద గానీ కూర్చున్నప్పుడు పిరుదుల కింద మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఉబ్బు తగ్గటానికి తోడ్పడుతుంది.
* విసర్జన చేసిన తర్వాత ప్రతిసారీ నెమ్మదిగా, పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చటి నీటిలో నూలు వస్త్రాన్ని ముంచి, తుడుచుకున్నా మంచిదే. ఆ తర్వాత మంట పుడుతుంటే పెట్రోలియం జెల్లీ లేదా కలబంద జిగురు రాసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని