Diabetes: మధుమేహానికి మంచి మందేది?

మధుమేహం చికిత్స అనగానే డాక్టర్లు ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు మెట్‌ఫార్మిన్‌ మందు సూచిస్తారు.

Published : 13 Dec 2022 08:49 IST

ధుమేహం చికిత్స అనగానే డాక్టర్లు ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు మెట్‌ఫార్మిన్‌ మందు సూచిస్తారు. అప్పటికీ గ్లూకోజు మోతాదులు తగ్గకపోతే రెండో మందును జోడిస్తారు. అయితే ఈ అదనపు మందుల్లో ఏది మంచిది? ఏది బాగా పనిచేస్తుంది? అనే దానిపై శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. మెట్‌ఫార్మిన్‌తో పాటు సిటాగ్లుటైడ్‌, లిరాగ్లుటైడ్‌, గ్లిమిపిరైడ్‌, ఇన్సులిన్‌ గ్లార్గైన్‌ యూ-100 మందులో ఏదో ఒకదాన్ని ఇచ్చి ఐదేళ్ల పాటు పరిశీలించారు. ఇవన్నీ గ్లూకోజు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తేల్చారు. మిగతావాటితో పోలిస్తే లిరాగ్లుటైడ్‌, ఇన్సులిన్‌ గ్లార్గైన్‌ ఒకింత ఎక్కవ ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. అయితే అధ్యయనం ముగిసేసరికి నాలుగింట మూడొంతుల మందిలో ఇంకా గ్లూకోజు నిర్ణీత మోతాదుల స్థాయికి చేరకపోవటం గమనార్హం. రక్తంలో గ్లూకోజు, గుండెజబ్బు, ఇతర సమస్యల విషయంలోనూ మందుల ప్రభావాల్లో తేడాలు కనిపించాయి. ఉదాహరణకు- లిరాగ్లుటైడ్‌ లేదా ఇన్సులిన్‌ గ్లార్గైన్‌ వాడినవారిలో గ్లూకోజు మోతాదులు ఎక్కువ కాలం నిర్ణీత లక్ష్యాలకు చేరుకున్నాయి. కానీ లిరాగ్లుటైడ్‌ వాడినవారికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం పెరిగింది. మధుమేహ నియంత్రణలో ఆయా వ్యక్తులకు అనుగుణంగా మందుల ఎంపికపై నిర్ణయం తీసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు