మతిమరుపుతో ‘డీ’

విటమిన్‌ డి మెదడుకు మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే. ఇది డిమెన్షియా ముప్పు తగ్గటంలోనూ పాలు పంచుకుంటుంది. అయితే పరిశోధనల్లో దీని ప్రభావం మీద విరుద్ధ ఫలితాలు వెలువడుతున్నాయి

Published : 07 Mar 2023 00:24 IST

విటమిన్‌ డి మెదడుకు మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే. ఇది డిమెన్షియా ముప్పు తగ్గటంలోనూ పాలు పంచుకుంటుంది. అయితే పరిశోధనల్లో దీని ప్రభావం మీద విరుద్ధ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఒకటి కొత్త విషయాన్ని బయటపెట్టింది. విషయగ్రహణ క్షీణించిన తర్వాత కన్నా ముందు నుంచే విటమిన్‌ డి మాత్రలు వేసుకోవటం ఆరంభించినవారికి మంచి ఫలితం కనిపిస్తున్నట్టు.. డిమెన్షియా ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు వెల్లడైంది. విటమిన్‌ డి అసలే తీసుకోనివారితో పోలిస్తే దీన్ని తీసుకున్నవారికి లింగ భేదం లేకుండా మంచి రక్షణ లభిస్తోంది. అయితే మగవారి కన్నా ఆడవారికి మరింత ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుండటం విశేషం. అల్జీమర్స్‌ జబ్బుతో ముడిపడిన అపోఈ4 జన్యువు గలవారికి మాత్రం విటమిన్‌ డి అంత ఎక్కువగా ఏమీ ఉపయోగపడటం లేదు. శరీరం విటమిన్‌ డి సంగ్రహించుకునే తీరును ఈ జన్యువు దెబ్బతీస్తుండటమే కారణం కావొచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారని అంచనా. వీరి సంఖ్య 2050 కల్లా మూడు రెట్లు పెరగొచ్చని అనుకుంటున్నారు. ఈ సమస్య వృద్ధుల్లో ఎక్కువగా కనిపించినప్పటికీ దీన్ని వయసుతో పాటు మామూలుగా వచ్చే మార్పని అనుకోవటానికి లేదు. డిమెన్షియాలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచన, నిర్ణయ సామర్థ్యం కొరవడుతుంది. ఇవి రోజువారీ పనుల్లోనూ ఇబ్బంది కలగజేస్తాయి. ముందు నుంచే విటమిన్‌ డి తీసుకోవటం ఆరంభిస్తే మతిమరుపు బారినపడకుండా కాపాడుకోవచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే వీటిని ఆరంభించే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవటం తప్పనిసరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని