చర్మం కాలిందా?

వంటింట్లో అప్రమత్తంగా లేనప్పుడో, పొరపాటున వేడి వస్తువులను ముట్టుకున్నప్పుడో చర్మం కాలిపోతుంటుంది.

Published : 25 Apr 2023 00:23 IST

వంటింట్లో అప్రమత్తంగా లేనప్పుడో, పొరపాటున వేడి వస్తువులను ముట్టుకున్నప్పుడో చర్మం కాలిపోతుంటుంది. ఇలాంటి గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇవి చర్మాన్ని లేదా కణజాలాన్ని దెబ్బతీస్తాయి. మామూలుగా కాలితే (ఫస్ట్‌ డిగ్రీ) అంత ప్రమాదమేమీ కాదు. చర్మం ఇది పైపొరకే పరిమితమవుతుంది. సాధారణంగా వారంలోపే నయమవుతుంది. ఒక మాదిరిగా కాలితే (సెకండ్‌ డిగ్రీ) చర్మం పైపొరతో పాటు కింది పొర కూడా దెబ్బతింటుంది. మచ్చ పడుతుంది. ఇంకాస్త తీవ్రంగా కాలితే (థర్డ్‌ డిగ్రీ) చర్మం మందం మొత్తం దెబ్బతింటుంది. వీటిని సహజ లేదా కృత్రిమ స్కిన్‌ గ్రాఫ్ట్‌లతో కప్పి ఉంచాల్సి ఉంటుంది. మామూలు గాయాలు చాలావరకు ఇంటి చికిత్సతోనే నయమవుతాయి. ముందు కాలిన భాగాన్ని చల్లటి నీటితో కడిగి, పొడిగా తుడవాలి. శుభ్రమైన బ్యాండేజీ గుడ్డను గానీ చర్మానికి అంటుకోని బ్యాండేజీని చుట్టాలి. పొక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ చిదమొద్దు. వీటిని చిదిమితే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. రెండు, మూడు వారాలైనా తగ్గకపోతే.. నొప్పి, వాపు, ఎరుపు వంటి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయకుండా డాక్టర్‌కు చూపించుకోవాలి. లోతుగా, పెద్దగా కాలినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి, చికిత్స చేయించుకోవాలి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని