కొవ్వు సామర్థ్యమూ..

మంచి కొవ్వు (హెచ్‌డీఎల్‌) ఎంత ఎక్కువుంటే అంత మంచిది. ఇది రక్తనాళాల గోడల.....

Updated : 09 Dec 2022 13:39 IST

మంచి కొవ్వు (హెచ్‌డీఎల్‌) ఎంత ఎక్కువుంటే అంత మంచిది. ఇది రక్తనాళాల గోడల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తూ గుండెజబ్బులు దాడి చేయకుండా కాపాడుతుంటుంది. అయితే మంచి కొవ్వు స్థాయులు ఎక్కువున్నంత మాత్రాన సరిపోదు, అది ఎంత సమర్థంగా పనిచేస్తోందన్నదీ ముఖ్యమేనని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులపై వయసు, లింగభేదం, శరీర ఎత్తు బరువుల నిష్పత్తి ప్రభావం చూపటం నిజమే అయినప్పటికీ.. వీటికీ కొలెస్ట్రాల్‌ను తొలగించే సామర్థ్యానికీ పెద్దగా సంబంధం లేకపోవటం గమనార్హం. రక్తనాళాల గోడల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించే సామర్థ్యం అధికంగా గలవారిలో గుండెజబ్బు, గుండెపోటు, మరణం ముప్పులు 67% తక్కువగా ఉంటున్నట్టు తేలటం విశేషం. ఇది చాలా ఆసక్తికరమైన విషయమనీ పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే మంచి కొవ్వు పెరగటానికి తీసుకునే మందులతో పెద్దగా ఫలితం కనబడటం లేదని ప్రయోగ పరీక్షల్లో తేలింది. పైగా వీటితో కొందరిలో గుండెజబ్బు, మరణం ముప్పులు సైతం పెరుగుతున్నాయి. దీని వెనక గల కారణాలను విశ్లేషించటానికి తాజా అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని పరిశోధకులు ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని