Published : 12 Oct 2018 22:51 IST

కళ్లద్దాలు వద్దు.. పరిష్కారముందా?

సమస్య - సలహా 

కళ్లద్దాలు వద్దు.. పరిష్కారముందా?

 

సమస్య: నా వయసు 20 ఏళ్లు. హ్రస్వదృష్టి ఉంది. ప్రస్తుతం కళ్లద్దాలు వాడుతున్నాను. అద్దాల అవసరం లేకుండా హ్రస్వదృష్టికి శాశ్వత పరిష్కారమేమైనా ఉందా?

- శ్రీరామ్‌ జాహ్నవి (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: మీ వయసు 20 ఏళ్లు అంటున్నారు కాబట్టి లేసిక్‌ సర్జరీ ద్వారా శాశ్వత పరిష్కారం పొందొచ్చు. ఎందుకంటే దీన్ని 18 ఏళ్ల లోపువారికి చేయటం కుదరదు. దృష్టి దోషాల్లో హ్రస్వదృష్టి తరచుగా చూసేదే. వైద్యపరిభాషలో దీన్ని ‘మయోపియా’ అంటారు. దీనికి మూలం కన్ను ఎదుగుదల, శరీర ఎదుగుదల ఒకే విధంగా లేకపోవటం. సాధారణంగా కాంతి కిరణాలు నల్లగుడ్డు (కార్నియా), సహజ కటకం గుండా వచ్చి రెటీనా మీద పడతాయి. రెటీనా వాటిని విద్యుత్‌ ప్రచోదనాలుగా మార్చి మెదడుకు చేరవేస్తుంది. దీంతో ఆయా దృశ్యాలు మనకు కనబడతాయి. కానీ హ్రస్వదృష్టి గలవారిలో కనుగుడ్డు పెద్దగా ఉండటం వల్ల కాంతి కిరణాలు నేరుగా రెటీనా మీద కాకుండా దాని ముందు భాగాన పడతాయి. దీంతో దగ్గరివి బాగానే కనబడతాయి గానీ దూరంగా ఉన్నవి మసక మసకగా కనిపిస్తాయి. హ్రస్వదృష్టికి ప్రధాన కారణం తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువులు. కంటికి మరీ దగ్గరగా వస్తువులను పెట్టుకొని చూసినా ముప్పే. ముఖ్యంగా చిన్నవయసులో ఇలా చేస్తే కనుగుడ్డు పెద్దగా అయ్యి.. హ్రస్వదృష్టికి దారితీయొచ్చు. ఇలాంటివాళ్లు టీవీకి దగ్గరగా వెళ్లి కూచుంటుంటారు. తరగతిలో బోర్డు మీద అక్షరాలు కనబడక ఇబ్బందులు పడుతుంటారు. సమస్య తీవ్రతను బట్టి కళ్లద్దాలు ఇవ్వటం ద్వారా ఈ దోషాన్ని సరిచేయొచ్చు. యుక్తవయసు దాటిన పిల్లల్లో కొందరికి కళ్లద్దాలు వాడుకోవటం ఇష్టం ఉండదు. ఇలాంటివాళ్లు కాంటాక్ట్‌ లెన్సులు వాడుకోవచ్చు. కానీ వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎక్కువగంటలు ధరిస్తే ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు వచ్చే అవకాశముంటుంది. అదే 18 ఏళ్లు దాటితే లేజర్‌ సర్జరీ చేసి శాశ్వతంగా దృష్టి దోషాన్ని సరిదిద్దొచ్చు. హ్రస్వదృష్టి దోషం 11-15 ఏళ్ల మధ్యలో వేగంగా పెరుగుతూ వస్తుంది. 18-20 ఏళ్లు వచ్చేసరికి ఒకస్థాయిలో స్థిరపడుతుంది. అందువల్ల లేసిక్‌ సర్జరీని 18 ఏళ్ల లోపు చేయటం కుదరదు. అలాగే 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు దృష్టి దోషం స్థిరంగా ఉన్నప్పుడే దీన్ని చేయాలి. లేకపోతే దృష్టి దోషం మారిపోయి మళ్లీ అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు 20 ఏళ్లు వచ్చాయి కాబట్టి లేసిక్‌ సర్జరీతో మంచి ఫలితం కనబడుతుంది. ఈ చికిత్స చేయటానికి ముందు మీ కార్నియా మందం, వంపు ఎలా ఉన్నాయన్నది పరీక్షించాల్సి ఉంటుంది.

కళ్లద్దాలు వద్దు.. పరిష్కారముందా? కార్నియా మందం 500 కన్నా ఎక్కువ, కార్నియా వంపు 43-44 వరకు ఉంటే లేసిక్‌ చేయటానికి వీలవుతుంది. ఇందులో మైక్రోకెరటోమ్‌ పరికరంతో కార్నియా పైపొరను గుండ్రంగా కత్తిరించి.. కిందిభాగం వంపును లేజర్‌తో అవసరమైనమేరకు చదునుగా చేసి.. కత్తిరించిన పొరను తిరిగి యథాస్థానంలో అమరుస్తారు. అయితే కార్నియా వంపు మరీ ఎక్కువగా గానీ మరీ తక్కువగా గానీ ఉంటే బ్లేడు అవసరం లేని ఫెమటో సెకండ్‌ లేజర్‌ పద్ధతిలో చికిత్స చేయాల్సి వస్తుంది. దీంతో ఇతరత్రా దుష్ప్రభావాలు తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇక కార్నియా మందం 450-500 మధ్యలో.. అలాగే పవర్‌ -5 లోపు ఉంటే మాత్రం ఫొటో రిఫ్రాక్టివ్‌ కెరటెక్టమీ (పీఆర్‌కే) పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్మైల్‌ (స్మాల్‌ ఇన్‌సిషన్‌ లెంటికల్‌ ఎక్‌స్ట్రాక్షన్‌) అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో కార్నియా ముందు పొరను ముట్టుకోకుండానే.. లేజర్‌తో చిన్న రంధ్రం చేసి.. కార్నియా లోపల చిన్న పొరను అవసరమైన మేరకు కత్తిరించి.. ఆ ముక్కను బయటకు తీస్తారు. దీంతో కార్నియా మందం కుదురుకొని చూపు స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ కార్నియా మందం మరీ తక్కువుండి, పవర్‌ మరీ ఎక్కువగా -9, -10 ఉంటే మాత్రం కంట్లోనే అమర్చే కాంటాక్ట్‌ లెన్సు (ఐసీఎల్‌) వాడుకోవటం ఉత్తమం. దీన్ని చిన్న సర్జరీతో కంట్లోని సహజమైన కటకం ముందు ఉండేలా అమరుస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా 
సమస్య - సలహా సుఖీభవ 
ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు