రొమ్ములకు పెరుగు రక్ష!

మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలు చేసే మేలు అంతా ఇంతా కాదు....

Published : 11 Feb 2020 00:13 IST

మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటి గురించి మరో కొత్త సంగతి బయటపడింది. ఇవి వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపించే బ్యాక్టీరియా స్థానంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తున్నాయని.. ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రొమ్ముల్లోని క్షీర నాళాల్లో అపరిపక్వ కణాలను (ప్రత్యేక నైపుణ్య కణాలుగా మారటానికి సిద్ధంగా ఉన్న మూలకణాలను) బ్యాక్టీరియా ప్రేరిత వాపు ప్రక్రియ అస్తవ్యస్తం చేస్తోందని, ఇది క్యాన్సర్‌కు దారితీస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల రోజూ పెరుగు, చిక్కటి మజ్జిగ వంటివి తీసుకోవటం మేలని సూచిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ నివారణకు ఇది తేలికైన, చవకైన మార్గం కాగలదని ఆశిస్తున్నారు. పాలలో ల్యాక్టోజ్‌ అనే చక్కెర ఉంటుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా దీన్ని పులిసేలా చేస్తుంది. బిడ్డకు పాలు పట్టే తల్లుల రొమ్ముల క్షీరనాళాల్లోనూ ఇలాంటి బ్యాక్టీరియానే ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. పాలివ్వటం మానేసిన తర్వాత అది కొంతకాలం అక్కడే ఉంటుండటం గమనార్హం. బిడ్డకు పాలు పట్టే ప్రతి ఏడాది కాలానికి రొమ్ము క్యాన్సర్‌ ముప్పు సుమారు 5% వరకు తగ్గుముఖం పడుతున్నట్టు గత అధ్యయనాలూ చెబుతున్నాయి. ఇందుకు మంచి బ్యాక్టీరియానే మూలమన్నది పరిశోధకుల భావన. పెరుగుతోనూ ఇలాంటి ప్రయోజనమే కనిపిస్తోందని, చెడు బ్యాక్టీరియా స్థానంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చూడటమే దీనికి కారణం కావొచ్చని వివరిస్తున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని