ఆస్ప్రినే కాదు..

గుండెపోటు, పక్షవాతం ముప్పు అధికంగా గలవారికి డాక్టర్లు తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ మాత్రలను సూచిస్తుండటం తెలిసిందే. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తూ, రక్తం గడ్డలు ఏర్పడకుండా కాపాడతాయి. వీటిని వేసుకోవటంతో పాటు నైట్రిక్‌ ఆక్సైడ్‌ మీదా దృష్టి పెట్టటం మంచిది.

Published : 22 Dec 2020 00:48 IST

గుండెపోటు, పక్షవాతం ముప్పు అధికంగా గలవారికి డాక్టర్లు తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ మాత్రలను సూచిస్తుండటం తెలిసిందే. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తూ, రక్తం గడ్డలు ఏర్పడకుండా కాపాడతాయి. వీటిని వేసుకోవటంతో పాటు నైట్రిక్‌ ఆక్సైడ్‌ మీదా దృష్టి పెట్టటం మంచిది. ఇది రక్తనాళాల సంకోచ, వ్యాకోచ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది. కాబట్టి నైట్రేట్లతో కూడిన పదార్థాలను ఆహారంలో చేర్చుకోవటం మంచిది. నైట్రేట్లు శరీరంలోకి ప్రవేశించాక నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మారతాయి. మనం తరచూ తినే పాలకూరలో నైట్రేట్లు దండిగా ఉంటాయి. వంద గ్రాముల పాలకూరతో 24-387 మి.గ్రా. నైట్రేట్‌ ఉంటుంది. క్యారెట్లు కూడా తక్కువేమీ కాదు. వంద గ్రాములతోనే 92-195 మి.గ్రా. నైట్రేట్లు లభిస్తాయి. దొరికితే ఆవాల ఆకులూ తీసుకోవచ్చు. వంద గ్రాముల ఆకుల్లో 70-95 మి.గ్రా. నైట్రేట్లు ఉంటాయి. ఇక కూరగాయల్లో వంద గ్రాముల వంకాయలతో 25-42 మి.గ్రా. నైట్రేట్లు పొందొచ్చు. వెల్లుల్లి సంగతి సరేసరి. ఇది ఒంట్లో నైట్రిక్‌ ఆక్సైడ్‌ తయారీని ఉత్తేజితం చేస్తుంది. బత్తాయి, నారింజ వంటి పుల్లటి పండ్లూ మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్‌ సి మన శరీరం నైట్రిక్‌ ఆక్సైడ్‌ను గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో యాంటీ ఆక్సిడెంట్లూ లభిస్తాయి. ఇవి రక్తనాళాల లోపలి పైపొర ఆరోగ్యంగా పనిచేయటానికి దోహదం చేస్తాయి. ఇది మరో ప్రయోజనం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని