మెగా.. మెగా.. ఒమెగా!

కొవ్వులన్నీ చెడ్డవి కావు. వాటిలో మేలు చేసేవీ లేకపోలేదు. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఒమెగా-3 కొవ్వు ఆమ్లాల గురించే. మన శరీరానికి అతి ముఖ్యమైన, అత్యవసరమైన...

Updated : 07 Apr 2021 12:02 IST

కొవ్వులన్నీ చెడ్డవి కావు. వాటిలో మేలు చేసేవీ లేకపోలేదు. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఒమెగా-3 కొవ్వు ఆమ్లాల గురించే. మన శరీరానికి అతి ముఖ్యమైన, అత్యవసరమైన కొవ్వులివి. ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు వీటికింత ప్రాధాన్యం? మన శరీరంలోని అన్ని కణాల పైపొరల్లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అంతర్భాగం. కణాల పొరల్లోని గ్రాహకాల పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. రక్తం గడ్డ కట్టే ప్రక్రియ.. రక్తనాళాల గోడల సంకోచ, వ్యాకోచాలు.. వాపు ప్రక్రియను నియంత్రించే హార్మోన్ల తయారీలోనూ తొలి వేదికగా ఉపయోగపడేవి ఇవే. కణాల్లో జన్యువుల పనితీరును నియంత్రించే గ్రాహకాలకూ అంటుకుపోతాయి. ఇలా ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు మనకు చేసే మేలు అన్నీ ఇన్నీ కావు. 


గుండెకు బలం

ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె స్థిరంగా కొట్టుకునేలా చేస్తూ లయ తప్పకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. పెద్ద మోతాదులో తీసుకుంటే మనకు హానిచేసే ట్రైగ్లిజరైడ్ల మోతాదులనూ తగ్గిస్తాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడేలా చేసి వాపు ప్రక్రియనూ (ఇన్‌ఫ్లమేషన్‌) అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ గుండెకు మేలు చేసేవే. అప్పటికే గుండెపోటు బయటపడ్డవారిలోనూ మరోసారి గుండెపోటు తలెత్తకుండా ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కాపాడుతున్నట్టు ఇటలీ అధ్యయనం ఒకటి పేర్కొంది. పక్షవాతం, హఠాన్మరణం నుంచీ ఇవి రక్షిస్తున్నట్టు తేలింది. వీటితో గుండెపోటుతో హఠాత్తుగా మరణించే ముప్పు సుమారు 50% వరకు తగ్గుతుండటం విశేషం. కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లతో పాటు ఈపీఏ రకం కొవ్వులను సైతం తీసుకున్నవారికి తీవ్ర గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం తగ్గుతున్నట్టు జపాన్‌ అధ్యయనం చెబుతోంది. 


కుంగుబాటు తగ్గుముఖం

ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాల పొరల నుంచి తేలికగా కదులుతాయి. మానసిక స్థితితో ముడిపడిన రసాయనాలతో ఇట్టే అనుసంధానం అవుతాయి. వీటికి వాపు ప్రక్రియనూ నివారించే గుణమూ ఉంది. ఇలా ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కుంగుబాటు తగ్గటానికీ తోడ్పడతాయి. మానసిక జబ్బులు తగ్గటానికి వేసుకునే మందులతో పాటు వీటిని కూడా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఆందోళన, కాన్పు అనంతరం తలెత్తే కుంగుబాటు, కొద్దిరోజుల పాటు హుషారు కొద్దిరోజుల పాటు నిరుత్సాహం ఆవరించే సమస్యలు తగ్గటానికీ ఇవి దోహదం చేస్తాయి. 


కంటిచూపు మెరుగు

వయసుతో పాటు కంటి చూపు తగ్గడాన్ని ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు నివారిస్తాయి. వయసు మీద పడుతున్నకొద్దీ రెటీనాలోని కణాల్లో ఏ2ఈ అనే విషతుల్య రసాయనం పోగుపడుతుంటుంది. ఇది చూపు తగ్గేలా చేస్తుంది. రెటీనా, మెదడులోనూ డీహెచ్‌ఏ రకం కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుంది. అందుకే దీన్ని ఆహారం లేదా మాత్రల ద్వారా లభించేలా చూసుకుంటే రెటీనా త్వరగా క్షీణించకుండా చూసుకోవచ్చు. 


జీవక్రియ రుగ్మత అదుపు

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య జీవక్రియ రుగ్మత (మెటబాలిక్‌ సిండ్రోమ్‌). బొజ్జ, అధిక రక్తపోటు, కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవటం, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గటం వంటివన్నీ దీనిలోని భాగాలే. జీవక్రియ రుగ్మతతో గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యల ముప్పూ పెరుగుతుంది. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఇన్సులిన్‌ నిరోధకత, వాపు ప్రక్రియ తగ్గేలా చేస్తాయి కాబట్టి జీవక్రియ రుగ్మత తగ్గుముఖం పట్టటానికీ తోడ్పడతాయి.


స్వీయ రోగనిరోధక సమస్యలకు కళ్లెం

కొందరిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున వారి శరీరం మీదే దాడి చేస్తుంది. ఇది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు- క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాల మీద రోగనిరోధక వ్యవస్థ దాడిచేస్తే టైప్‌-1 మధుమేహం తలెత్తుతుంది. ఇలాంటి స్వీయ రోగనిరోధక సమస్యలు తగ్గటానికి ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు తోడ్పడతాయి. పుట్టిన తొలి ఏడాదిలో పిల్లలకు తగినంతగా ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అందేలా చూస్తే మధుమేహం, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ లాంటి ఎన్నో జబ్బుల ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ల్యూపస్, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్, అల్సరేటివ్‌ కొలైటిస్, క్రాన్స్, సొరియాసిస్‌ లాంటి జబ్బులు అదుపులో ఉండటానికీ ఒమెగా-3 కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.


జ్ఞాపకశక్తి మెరుగు

వృద్ధాప్యంలో తలెత్తే మతిమరుపు తగ్గటానికి ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉపయోగపడతాయి. ఇవి వయసుతో పాటు మెదడు క్షీణించటాన్ని అడ్డుకోవటం ద్వారా అల్జీమర్స్‌ ముప్పు తగ్గేలా చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్జీమర్స్‌ బాధితుల్లో విషయగ్రహణ, జ్ఞాపకశక్తితో ముడిపడిన హిప్పోక్యాంపస్‌ లాంటి భాగాల్లో డీహెచ్‌ఏ రకం ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల చేపలు, చేపనూనె వంటివి ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి తిరిగి పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఆహారంతోనే లభిస్తాయి

నిజానికి మనకు అవసరమైన కొవ్వుల్లో చాలా వాటిని శరీరం ఇతరత్రా కొవ్వుల నుంచో ముడి పదార్థాల నుంచో తనకు తానే తయారుచేసుకోగలదు. కానీ ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను మాత్రం సృష్టించుకోలేదు. వీటిని మనం ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. చేపలు, వంట నూనెలు, గింజపప్పులు, అవిసె గింజలు, అవిసె గింజల నూనె, తాజా ఆకుకూరలలో ఇవి లభిస్తాయి. బహుళ అసంతృప్త కొవ్వుల తరగతికి చెందిన ఒమెగా-3 కొవ్వు ఆమ్లాల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. అవి.. ఈకోసాపెంటాఇనోయిక్‌ యాసిడ్‌ (ఈపీఏ), డోకోసాహెగ్జాయినోయిక్‌ యాసిడ్‌ (డీహెచ్‌ఏ), అల్ఫా-లినోలిక్‌ యాసిడ్‌ (ఏఎల్‌ఏ). ఈపీఏ, డీహెచ్‌ఏ  ఎక్కువగా చేపల నుంచి లభిస్తాయి. అందుకే చేపలను సముద్ర ఒమెగా-3 ఆహారం అనీ పిలుస్తుంటారు. ఇక ఏఎల్‌ఏ రకం కొవ్వులైతే వంట నూనెలు, అక్రోట్ల లాంటి గింజపప్పులు, అవిసె గింజలు, అవిసె నూనె, ఆకు కూరలు, కొన్నిరకాల జంతువుల కొవ్వుల్లో ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మన శరీరం ఏఎల్‌ఏను ఇంధనంగా వినియోగించుకుంటుంది. కొంతవరకు దీన్ని ఈపీఏ, డీహెచ్‌ఏలుగానూ మార్చుకుంటుంది.


నేడు ప్రపంచ ఆరోగ్యదినోత్సవం.. 

మరికాసేపట్లో మరో ఆసక్తికర కథనం.. వేచి చూడండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని