Concentration - Food Habbits: పని మీద ఏకాగ్రత కుదరటం లేదా? అయితే ఇలా చేయండి!

Brain Function - Concentration Increase | చేసే పని మీద అస్సలు ఏకాగ్రత కుదరడం లేదు.. ఏ పని మొదలుపెట్టినా ఆసక్తి లేకుండా పోతుంది. ఇలాంటి ఇబ్బందులు దరిచేరకుండా ఉండాలంటే ఆహారం మీద దృష్టి పెడితే చాలు అంటున్నారు వైద్య నిపుణులు.

Updated : 07 May 2023 22:19 IST

పని మీద ఏకాగ్రత కుదరటం లేదా? అయితే ఆహారం మీద ఓసారి దృష్టి సారించండి. కొన్నిపదార్థాలు, పానీయాలు మెదడు పనితీరును మెరుగుపరచి, ఏకాగ్రత పెరగటానికి తోడ్పడతాయి.

ఆహారం అనగానే ఎంతసేపూ బరువు తగ్గటం, శరీర సామర్థ్యం, గుండె ఆరోగ్యం, ఆయుష్షు వంటివే గుర్తుకొస్తాయి. కానీ మనం తీసుకునే ఆహారం ఒక్క శరీరం మీదే కాదు.. మెదడు, మనసు మీదా ప్రభావం చూపుతాయి. వయసు మీద పడుతున్నకొద్దీ శరీరంతో పాటు మెదడుకూ వృద్ధాప్యం వస్తుందన్నది కాదనలేని సత్యం. కానీ సరైన ఆహార పదార్థాలు తినటం ద్వారా అలసట, నిస్సత్తువ తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. ఇవన్నీ పరోక్షంగా మెదడుకు చురుదనం పెంచుతాయి. ఏకాగ్రత తగ్గకుండా చూస్తాయి.

కెఫీన్‌ అప్రమత్తం

తక్కువ సేపే ప్రభావం చూపినా కెఫీన్‌ ఎకాగ్రత పెరగటానికి బాగానే తోడ్పడుతుంది. అందుకేనేమో ఉదయం పూట కప్పు కాఫీ తాగితే ప్రాణం లేచి వస్తుంది. మగత, నిస్సత్తువ పారిపోతాయి. మనసు కుదురుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఒక్క కాఫీలోనే కాదు, చాక్లెట్లు, శక్తినిచ్చే పానీయాల్లోనూ కెఫీన్‌ ఉంటుంది. అయితే దీని విషయంలో మితం పాటించటం మంచిది. మితిమీరితే లాభం కన్నా నష్టమే ఎక్కువ.

చక్కెర చురుకు

మెదడుకు శక్తినిచ్చేది చక్కెరే. ఇది టీ, కాఫీల్లో వాడుకునే మామూలు పంచదార కాదు. మనం తినే పిండి పదార్థాలు, చక్కెరల నుంచి పుట్టుకొచ్చే గ్లూకోజు. కాబట్టి ఏకాగ్రత కుదరనప్పుడు ఓ గ్లాసు పండ్ల రసం తాగి చూడండి. దీనిలోని సహజ చక్కెర మెదడుకు చురుదనం కలిగిస్తుంది. జ్ఞాపకశక్తి, ఆలోచనలు, మానసిక సామర్థ్యం ఇనుమడిస్తాయి. తీపి మరీ ఎక్కువైనా ప్రమాదమే. ముఖ్యంగా కేలరీలు తప్ప పోషకాలు లేని తీపి పానీయాలు మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. చక్కెర కలిపి చేసే పానీయాల కన్నా పండ్లు తినటం, పండ్ల రసాలు తాగటం మేలు.

అనల్ప బలం

ఉదయం పూట తినే అల్పాహారం రోజంతా సాగే జీవక్రియలకు బీజం వేస్తుంది. ఇది శరీరానికి బలాన్ని చేకూర్చటమే కాకుండా స్వల్పకాల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగటానికి తోడ్పడుతున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. అల్పాహారం తిన్నవారు చదువుల్లో బాగా రాణిస్తున్నట్టు విద్యార్థులపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అలాగని సుష్టుగా లాగిస్తే నిద్రమత్తుతో ఏకాగ్రత కొరవడే ప్రమాదముందనీ గుర్తించాలి.

చేపల చేవ

కొవ్వుతో కూడిన చేపలు ఏకాగ్రత పెరగటానికి ఎంతగానో తోడ్పడతాయి. వీటిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా కీలకం. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారికి డిమెన్షియా, పక్షవాతం, మేధోశక్తి క్షీణత తలెత్తే అవకాశం తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి కొవ్వులు జ్ఞాపకశక్తిని పెంచటంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. అందుకే చురుకైన మెదడు కోసం వారానికి రెండు సార్లు చేపలు తినాలన్నది నిపుణుల సూచన.

గింజపప్పుల తోడు

విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంచే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లోనూ దండిగా ఉంటాయి. వీటితో రాగి, మాంగనీసు, సెలీనియం వంటి పోషకాలూ అదనంగా లభిస్తాయి. నాడులు సజావుగా పనిచేయటానికివి అత్యవసరం. గింజపప్పులతో మానసిక స్థితి మెరుగవుతున్నట్టూ కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇది ఏకాగ్రత ఇనుమడించటానికీ దోహదం చేస్తుంది. ఎప్పుడైనా అస్థిమితంగా అనిపిస్తే కాస్త బాదం పలుకులో, జీడిపప్పులో నోట్లో వేసుకొని చూడండి.

ముడిధాన్యం మురిపెం

ఒంట్లో ఏ అవయవమైనా.. ముఖ్యంగా గుండె, మెదడు పనితీరు రక్త ప్రసరణ మీదే ఆధారపడి ఉంటుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగితే మెదడు చురుకుదనమూ పెరుగుతుంది. ఇందుకు పొట్టుతీయని ముడిధాన్యాలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిల్లోని పీచు రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడతాయి. ముడిధాన్యాల్లో పీచుతో పాటు విటమిన్‌ ఇ కూడా ఉంటుంది. ఇది మరో ప్రయోజనం.

గుడ్డు వెరీ గుడ్డు

గుడ్లలో కొలీన్‌ అనే పోషకం ఉంటుంది. ఇది కణస్థాయిలో తలెత్తే వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. విషయ గ్రహణ సామర్థ్యం తగ్గకుండానూ కాపాడుతుంది. గుడ్లు రక్తంలో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం మోతాదులనూ పెంచుతాయి. ఇది మెదడులో సెరటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ మూలంగా మానసిక స్థితి మెరుగువుతుంది. దీంతో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

ఇతర జాగ్రత్తలూ..

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగటానికి ఆహారంతో పాటు ఇతరత్రా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవటం తప్పనిసరి.

  • కంటి నిండా నిద్రపోవాలి.
  • ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • ధ్యానం, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని