పిత్తాశయ రాళ్లు ఏర్పడకుండా..

ఇటీవలి కాలంలో పిత్తాశయంలో రాళ్ల సమస్య పెరుగుతోంది. ఇవి కడుపు కుడి పైభాగాన హఠాత్తుగా, తీవ్రమైన నొప్పిని తెచ్చిపెడతాయి. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది కూడా. పైత్యరసంలో కొలెస్ట్రాల్‌, బిలిరుబిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం..

Updated : 25 Jan 2022 05:26 IST

ఇటీవలి కాలంలో పిత్తాశయంలో రాళ్ల సమస్య పెరుగుతోంది. ఇవి కడుపు కుడి పైభాగాన హఠాత్తుగా, తీవ్రమైన నొప్పిని తెచ్చిపెడతాయి. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది కూడా. పైత్యరసంలో కొలెస్ట్రాల్‌, బిలిరుబిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం.. పిత్తాశయం పూర్తిగా ఖాళీ కాకపోవటం వంటివి రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలతో వీటిని నివారించుకోవచ్చు.

బరువు అదుపు: పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఊబకాయం ఒకటి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగని వేగంగా బరువు తగ్గించే ఆహార అలవాట్లతోనూ (క్రాష్‌ డైట్స్‌) ప్రమాదమే. ఇవీ పిత్తాశయ రాళ్లకు దారితీయొచ్చు. క్రమంగా, నిర్ణీత పద్ధతిలో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

కొవ్వు మితంగా: కొవ్వు పదార్థాలు మితంగా తినేలా చూసుకోవాలి. వీటిని ఎక్కువగా తినే అలవాటు గలవారు హఠాత్తుగా తగ్గించటమూ సరికాదు. మొత్తానికే మానేయటమూ తగదు. ఎందుకంటే కొవ్వు చాలా తగ్గినా పిత్తాశయ రాళ్లు ఏర్పడే అవకాశముంది.

ఎక్కువ పీచు: పండ్లు, కూరగాయలు, తవుడుతో కూడిన ధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి. వీటిల్లోని పీచు పైత్యరసంలో కొలెస్ట్రాల్‌ ద్రవ రూపంలో ఉండేలా చేస్తుంది. ఫలితంగా రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది.

వ్యాయామం: శారీరక శ్రమ లేని జీవనశైలితో జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో పిత్తాశయం నుంచి పైత్యరసం అంతగా బయటకు రాదు. ఇది పిత్తాశయ రాళ్ల ముప్పు పెరిగేలా చేస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి.

లెసితిన్‌ మేలు: లెసితిన్‌ అనే సహజ పదార్థం పిత్తాశయంలో కొలెస్ట్రాల్‌ గట్టిపడకుండా చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సోయాబీన్స్‌, ఓట్స్‌, గుడ్లు, పాలు, వేరుశనగలు, క్యాబేజీ వంటి వాటితో లెసితిన్‌ లభిస్తుంది.

ఆలివ్‌ నూనె రక్షణ: రోజూ కొద్దిగా.. సుమారు రెండు చెంచాల ఆలివ్‌ నూనె తీసుకునేవారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ముప్పు తక్కువని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్‌నూనెలోని ఒక పదార్థం రక్తంలో, పిత్తాశయంలో కొలెస్ట్రాల్‌ మోతాదు తగ్గటానికి తోడ్పడుతుంది. ఆలివ్‌ నూనెను ఎక్కువగా వాడే ప్రాంతాల్లో నివసించేవారిలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం తక్కువని పరిశోధకులు గుర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని