Updated : 15 Feb 2022 11:57 IST

Heart: గుండె కోసమైనా తినండి

పని చేసినంతవరకూ గుండె గురించి పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా మొరాయిస్తే ‘ముందే జాగ్రత్త పడితే బాగుండేది కదా’ అని చింతిస్తాం. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందే మేల్కొంటే? ఈ విషయంలో మంచి ఆహారం జీవితాంతం తోడుంటుంది. గుండెకు మేలు చేసే పదార్థాల గురించి తెలుసుకొని, ఆహారంలో చేర్చుకుంటే ఏంతో మేలు చేస్తాయి.


పెరుగు అండ: పెరుగు.. ముఖ్యంగా వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు అండగా నిలుస్తుంది. ఇందులో గుండెపోటును అదుపులో ఉంచే పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఖనిజ లవణాలెన్నో ఉంటాయి. అధిక రక్తపోటు మూలంగా రక్తనాళాల మార్గం సంకోచించి గుండె మీద ఒత్తిడి పెరుగుతుందన్నది తెలిసిందే. కాబట్టి భోజనంలో పెరుగు, మజ్జిగను చేర్చుకోవటం మంచిది.


అక్రోట్ల మేలు: గింజపప్పుల్లో (నట్స్‌) వృక్ష రసాయనాలు, గుండెకు మేలు చేసే కొవ్వు, పీచు దండిగా ఉంటాయి. సోడియం తక్కువగానూ ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడేవే. రోజుకు అరకప్పు అక్రోట్లు తినేవారి రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు చాలా తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పూ తగ్గుముఖం పడుతుంది.


చిక్కుళ్ల తోడు: చిక్కుడు జాతి కూరగాయల్లో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు రెండు రకాల పీచూ ఉంటాయి. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూస్తుంది. నీటిలో కరగని పీచు కడుపు నిండిన భావన కలిగిస్తూ బరువు అధికంగా పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్‌, అధిక బరువు రెండూ గుండె జబ్బు ముప్పు కారకాలే మరి.


చేపల సాయం: సముద్ర చేపల్లో హాని కలిగించే సంతృప్త కొవ్వు తక్కువ. గుండె స్థిరంగా కొట్టుకోవటానికి, రక్తపోటు తగ్గటానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికి, రక్తనాళాలు మెరుగ్గా పనిచేయటానికి తోడ్పడే ఒమేగా3 కొవ్వుల పాళ్లు ఎక్కువ. గుండెకు మేలు చేసే మెగ్నీషియం, పొటాషియమూ ఎక్కువగానే ఉంటాయి.


పాలకూర రక్ష: పాలకూర వంటి ఆకుకూరలతో నైట్రేట్లు లభిస్తాయి. వీటిని మన శరీరం నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణ సజావుగా సాగటానికి, రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరలో వృక్ష రసాయనాలు, పీచు, రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే ఫోలేట్‌ అనే బి విటమిన్‌ కూడా ఉంటాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని