Milk - Weight Loss: పాలు తాగితే బరువు అదుపు.. ఎలా అంటే?

బరువు తగ్గాలని భావించేవారికి ఆహారం విషయంలో చాలా సందేహాలు వస్తుంటాయి. ఏం తినాలి? ఏం తినకూడదు? ఏవి  తాగాలి? ఏవి తాగకూడదు? అనే వాటి గురించి ఆలోచిస్తుంటారు. వీటిల్లో ప్రధానమైంది పాలు. ఇవి ఆరోగ్యకరమైనవే అయినా కొవ్వు ఉండటం వల్ల చాలామంది తటపటాయిస్తుంటారు. నిజానికి బరువు తగ్గటంలో పాలు ఎంతో మేలు చేస్తాయి.

Updated : 02 Apr 2023 16:18 IST

బరువు తగ్గాలని భావించేవారికి ఆహారం విషయంలో చాలా సందేహాలు వస్తుంటాయి. ఏం తినాలి? ఏం తినకూడదు? ఏవి  తాగాలి? ఏవి తాగకూడదు? అనే వాటి గురించి ఆలోచిస్తుంటారు. వీటిల్లో ప్రధానమైంది పాలు (Milk). ఇవి ఆరోగ్యకరమైనవే అయినా కొవ్వు ఉండటం వల్ల చాలామంది తటపటాయిస్తుంటారు. నిజానికి బరువు తగ్గటంలో పాలు ఎంతో మేలు చేస్తాయి. (Weight Loss Tips)

  • కండరాలు తగ్గకుండా బరువు తగ్గాలంటే ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో పాలు మేలు చేస్తాయి. వీటిల్లో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి సమయంలో కేలరీలు ఎక్కువగా ఖర్చు కావటానికీ ప్రొటీన్‌ తోడ్పడుతుంది. ఆహార నియమాలు పాటించే సమయంలో రోజువారీ అవసరమైన పోషకాలు తగ్గకుండా చూసుకోవటమూ ముఖ్యమే. ఇందుకు పాలలోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక గ్లాసు ఆవు పాలతో 122 కేలరీల శక్తి లభిస్తుంది.
  • ప్రొటీన్‌ 8.23 గ్రా., పిండి పదార్థాలు 12 గ్రా., కొవ్వు 4.66 గ్రా., క్యాల్షియం 309 మి.గ్రా., మెగ్నీషియం 29.4 మి.గ్రా., పొటాషియం 390 మి.గ్రా., జింక్‌ 1.05 మి.గ్రా., ఫోలేట్‌ 4.9 మైక్రో గ్రా., కొలీన్‌ 44.6 మి.గ్రా., విటమిన్‌ బి12 1.35 మైక్రో గ్రా., విటమిన్‌ ఏ 203 మైక్రో గ్రా., విటమిన్‌ డి 111 ఐయూ లభిస్తాయి. ఎముకలు బలోపేతం కావటానికి, రోగనిరోధకశక్తి, జీవక్రియల వేగం పెరగటానికి ఇవి తోడ్పడతాయి. కారణమేంటన్నది స్పష్టంగా తెలియదు గానీ విటమిన్‌ డి లోపానికీ ఊబకాయానికీ సంబంధం ఉంటున్నట్టూ కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
  • తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారిలో రోజుకు మూడుసార్లు పాల పదార్థాలను తిన్నవారు మరింత బరువు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. బరువు తగ్గిన తర్వాత ఆహారంలో పాల పదార్థాలు ఎక్కువగా తిన్నవారిలో బరువు సమర్థంగా అదుపులో ఉంటున్నట్టూ తేలింది. వీరిలో నడుం చుట్టుకొలత తగ్గటమూ గమనార్హం. పైగా పాలలోని క్యాల్షియంతో ఊబకాయం, జీవక్రియల రుగ్మత, మధుమేహం వంటి వాటి ముప్పులూ తగ్గే అవకాశముంది.
  • పాలలోని కొవ్వు ప్రభావం మీద చాలాకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. కొందరు మంచిదని, కొందరు చెడ్డదని చెబుతూ వస్తున్నారు. ఆవు, బర్రె పాలలోనే కాదు.. కొబ్బరి పాల వంటి శాక సంబంధ పాలలోనూ సంతృప్త కొవ్వు ఉంటుంది. అందుకే వెన్న తీసిన పాలు తాగటం మంచిదని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రోత్సహిస్తోంది. ప్రొటీన్‌తో పాటు పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. లాక్టోజ్‌ పడనివారు దీన్ని తీసేసిన పాలను ఎంచుకోవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని