ఆనంద విటమిన్‌!

విటమిన్‌ డి అనగానే ముందుగా ఎముకల ఆరోగ్యమే గుర్తుకొస్తుంది. ఇది ఆహారం ద్వారా లభించే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. ఇలా ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది.

Updated : 24 Mar 2022 12:18 IST

విటమిన్‌ డి అనగానే ముందుగా ఎముకల ఆరోగ్యమే గుర్తుకొస్తుంది. ఇది ఆహారం ద్వారా లభించే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. ఇలా ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. అయితే దీని ప్రయోజనాలు ఇంతటితోనే ఆగిపోవటం లేదు. రోగనిరోధకశక్తిని పెంపొందించి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికీ శరీరానికి సహకరిస్తుంది. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటినీ పోగొడుతుంది. అంతేనా? విటమిన్‌ డి కుంగుబాటునూ నివారిస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్నీ కలిగిస్తుంది. మన మెదడు సక్రమంగా పనిచేయటానికి వివిధ న్యూరోస్టిరాయిడ్లను వాడుకుంటుంది. వీటిల్లో విటమిన్‌ డి ఒకటి. వెన్నుద్రవంలో, మెదడు అంతటా ఇది ఉంటున్నట్టు ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. డోపమైన్‌ ఉత్పత్తయ్యే సబ్‌స్టాన్షియా నైగ్రాతో పాటు మెదడులోని కీలక భాగాల్లోనూ విటమిన్‌ డి గ్రాహకాలు ఉంటున్నట్టు బయటపడింది. మానసిక సమస్యలకూ విటమిన్‌ డికీ ప్రత్యక్ష సంబంధం ఉంటోందనటానికిదే నిదర్శనం. మనం విటమిన్‌ డి అని ఒకే పేరుతో పిలుచుకుంటాం గానీ ఇందులో చాలారకాలు ఉన్నాయి. చర్మానికి ఎండ తగిలినప్పుడు 7-డీహైడ్రోకొలెస్ట్రాల్‌ పుట్టుకొచ్చి, విటమిన్‌ డి3గా మారుతుంది. ఇది కాలేయానికి చేరుకున్నాక 25 హైడ్రాక్సీవిటమిన్‌ డిగా మారుతుంది. అక్కడ్నుంచి కిడ్నీలకు చేరుకొని, చురుకైన 1.25 డైహైడ్రాక్సీ విటమిన్‌ డిగా రూపాంతరం చెందుతుంది. శరీరం వాడుకునేది దీన్నే. రోజూ కాసేపు చర్మానికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్‌ డి లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.

ఎండ తగిలితే సెరటోనిన్‌ అనే హార్మోన్‌ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం విటమిన్‌ డి కలిపిన పాల వంటివీ దొరుకుతున్నాయి. పాలలో ట్రిప్టోఫాన్‌ అనే ప్రొటీన్‌ కూడా ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గటానికి కంటి నిండా నిద్రపోవటం కీలకమన్న విషయం తెలిసిందే. అంటే విటమిన్‌ డి ఒక్కటే కాదు.. దీన్ని అందించేవీ ఆనందానికి బాటలు పరచేవే అన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు