ఎండలో చల్లగా..

ఆయుర్వేదం ఎండకాలాన్ని గ్రీష్మ రుతువుగా పేర్కొంటుంది. ఇది ఆదాన కాలంలో వస్తుంది. ఈ కాలంలో సూర్యుడు తన తాపంతో మన నుంచి బలాన్ని గ్రహిస్తుంటాడు. ఎండకాలంలో బలాన్ని కలిగించే కఫ దోషం వికృతమవుతూ వస్తుంది. వేడి మూలంగా ఒంట్లో కఫం కరిగిపోయి ద్రవంగా మారుతుంది.

Updated : 16 Apr 2023 17:46 IST

ఆయుర్వేదం ఎండకాలాన్ని గ్రీష్మ రుతువుగా పేర్కొంటుంది. ఇది ఆదాన కాలంలో వస్తుంది. ఈ కాలంలో సూర్యుడు తన తాపంతో మన నుంచి బలాన్ని గ్రహిస్తుంటాడు. ఎండకాలంలో బలాన్ని కలిగించే కఫ దోషం వికృతమవుతూ వస్తుంది. వేడి మూలంగా ఒంట్లో కఫం కరిగిపోయి ద్రవంగా మారుతుంది. ఇది జఠరాగ్నిని చల్లార్చి, అగ్నిమాంద్యానికి దారితీస్తుంది. దీంతో ఆకలి తగ్గుతుంది. తిన్నది సరిగా జీర్ణం కాదు. ఒంట్లో తలెత్తే వ్యాధులన్నింటికీ అగ్నిమాంద్యమే మూలమని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. శరీర పోషణకు ఆహారమే కీలకం. ఇది శుచిగా, రుచిగా ఉంటే ధాతువులు వృద్ధి చేసి, బలాన్ని కలిగిస్తుంది. అలాగే విహార పరంగానూ జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే ఔషధాలనూ సేవించటం తప్పనిసరి.

  • లఘువుగా.. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
  • ఆహారం స్నిగ్ధంగానూ (కాస్త జిడ్డుగా) ఉండాలి. శరీరంలో స్నిగ్ధత్వం లేకపోతే రూక్షత్వం (పొడిబారటం) వస్తుంది. కాబట్టి కాస్త జిడ్డుగా ఉండే నెయ్యి, నూనె వంటి పదార్థాలు మితంగా తీసుకోవాలి. ఇవి జఠరాగ్నిని పెంపొందించి, ఆహారం జీర్ణమయ్యేలా చేస్తాయి.
  • ఎండకాలంలో బచ్చలికూర, కలంబి (క్యాబేజీ), కరివేపాకు, పొట్లకాయ, బీరకాయ, పొన్నగంటి కూర, అరటి పూవు, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ వంటి కూరలు తినటం మంచిది.
  • మధుర (తీయని) రసం బలాన్ని కలగజేస్తుంది. ఇది వాతాన్ని తగ్గించి కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందువల్ల వేసవిలో మరింత బాగా మేలు చేస్తుంది. కాబట్టి మధురంగా ఉండే పండ్లు, పండ్ల రసాల వంటివి తీసుకోవాలి. పనస, మేడి (అంజీరా), ద్రాక్ష, ఖర్జూరం, దానిమ్మ, బత్తాయి, బాగా పండిన అరటి పండ్లు మంచివి.
  • పేలాల పిండిలో పంచదార కలుపుకొని తింటే ఒంటికి చలువ చేస్తుంది.
  • ఎండకాలంలో గోధుమల ఆహారం ప్రశస్తం. అయితే పూరీల వంటివి కాకుండా గోధుమలు, గోధుమ రవ్వతో అన్నం, ఉప్మా వంటివి చేసుకోవటం మంచిది.
  • ఎండకాలంలో పుల్లటి పెరుగు మంచిది కాదు. తీయటి పెరుగే తినాలి. అవసరమైతే పెరుగులో పంచదార కలుపుకోవచ్చు.
  • వీలుంటే పాలతో చేసిన పాయసాలు తీసుకోవచ్చు. గోరువెచ్చటి పాలలో అటుకులు వేసి, కాసేపయ్యాక తినటమూ మేలు చేస్తుంది.
  • నీటిలో నెయ్యి, పిప్పలి, పచ్చ కర్పూరం, తేనె, పంచదార కలిపి చేసే పంచసార పానకం ఎండకాలంలో మేలు చేస్తుంది. ఇది దాహాన్ని, నీరసాన్ని, మంటను తగ్గిస్తుంది.
  • రాత్రిపూట గ్లాసు నీటిలో రెండు చెంచాల ధనియాలు వేసి నానబెట్టాలి. మర్నాడు పొద్దున ఆ నీటిని తాగాలి. దీంతో ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది.
  • చెరుకు రసం తాగటం కన్నా చెరుకు ముక్కలు నమలటం ఇంకా మంచిది. నమిలే సమయంలో లాలాజలంతో కలిసిపోయే రసం దాహాన్ని బాగా తగ్గిస్తుంది. చలువ చేస్తుంది.
  • గ్లాసులో పావు వంతు నిమ్మరసం, మూడొంతుల నీరు కలిపి తాగినా మంచిదే. ఇందులో కాస్త జిలకర పొడి కూడా కలుపుకొంటే మరింత మేలు.
  • మూడు పాళ్లు పెరుగు, ఒక వంతు నీరు కలిపి చిలక్కొట్టి చేసిన మజ్జిగ (తక్రం) తేలికగా జీర్ణమవుతుంది. ఆకలిని పెంచుతుంది. అయితే దీన్ని మితంగానే తీసుకోవాలి.
  • ఉదయం పూట స్నానం చేయటానికి ముందు ఒంటికి కొబ్బరి నూనె రాసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ప్రశాంతత చేకూరుతుంది.
  • రాత్రి పడుకునే ముందు మాడు మీద, పాదాలకు కొబ్బరినూనె రాసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
  • ఎరుపు, నారింజ, ముదురు పసుపు, నలుపు రంగు దుస్తులు వేడిని పట్టి ఉంచి పిత్తదోషం పెరిగేలా చేస్తాయి. కాబట్టి ఎండకాలంలో తెలుపు, నీలం, ఊదా, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం మంచిది.
  • వడదెబ్బ నివారణకు మంచి గంధం బాగా ఉపయోగపడుతుంది. ముందు గంధం చెక్కను సాన మీద అరగదీయాలి. ఒక చెంచా గంధం ముద్దను గ్లాసు నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. మంచి గంధాన్ని కొబ్బరి నూనెలో కలిపి చర్మానికి రాసుకుంటే ఎండ తాపం తట్టుకోవటానికి తోడ్పడుతుంది. దీంతో చెమట వాసన కూడా తగ్గుతుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని