రెటీనా పైనా కరోనా ప్రతాపం

కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 కంట్లోని రెటీనానూ వదిలిపెట్టటం లేదు. కొవిడ్‌ బారినపడి శ్వాస సరిగా తీసుకోలేక ఆసుపత్రిలో చేరినవారిలో నూటికి 11 మందిలో రెటీనా దెబ్బతిన్నట్టు జెనీవా యూనివర్సిటీ హాస్పిటల్‌,

Published : 17 May 2022 00:47 IST

కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 కంట్లోని రెటీనానూ వదిలిపెట్టటం లేదు. కొవిడ్‌ బారినపడి శ్వాస సరిగా తీసుకోలేక ఆసుపత్రిలో చేరినవారిలో నూటికి 11 మందిలో రెటీనా దెబ్బతిన్నట్టు జెనీవా యూనివర్సిటీ హాస్పిటల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవా అధ్యయనంలో బయటపడింది. కొవిడ్‌ బాధితుల్లో నాడీ సమస్యలు, రక్తనాళాల సమస్యలు తలెత్తుతున్నట్టు శాస్త్రవేత్తలు, వైద్యులు మొదట్లోనే గుర్తించారు. రెటీనా సైతం నాడీ వ్యవస్థలో భాగమే. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా దీని రక్తనాళాలను ఫండస్‌ పరీక్షతో చూడొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు రెటీనాను ఎంచుకున్నారు. కొవిడ్‌-19 మూలంగా న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరినవారిపై అధ్యయనం నిర్వహించారు. కంటిపాపను వెడల్పు చేయకుండానే కెమెరాతో రెటీనా ఫొటోలు తీసి పరిశీలించారు. వీరిలో 11% మందిలో రెటీనా మీద తెల్లటి మచ్చలు ఏర్పడినట్టు గుర్తించారు. వీటిని కాటన్‌ వూల్‌ మచ్చలనీ అంటారు. రెటీనా రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోవటం, లేదూ వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) వల్ల ఇవి ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. శ్వాస సరిగా తీసుకోలేకపోవటం వల్ల ఆక్సిజన్‌, పోషకాలు అందకపోవటమూ కారణం కావొచ్చని అనుకుంటున్నారు. సాధారణంగా మధుమేహం, అధిక రక్తపోటు గలవారిలో రెటీనా మీద ఇలాంటి తెల్ల మచ్చలు కనిపిస్తుంటాయి. కానీ వీరిలో 64% మందికి ఇంతకుముందు మధుమేహం లేనే లేదు. 90% మందికి అధిక రక్తపోటు కూడా లేదు. అందువల్ల ఈ తెల్లమచ్చలకు ప్రధాన కారణం సార్స్‌-కొవీ-2 దాడి చేయటమేనని పరిశోధకులు భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని