గుండెకు ‘బీట్‌’!

పోషకాలతో నిండిన బీట్‌ రూట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో నైట్రేట్లు దండిగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు గలవారికి మరింత బాగా ఉపయోగపడగలవని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. మాంచెస్టర్‌లో నిర్వహించిన

Updated : 14 Jun 2022 05:32 IST

పోషకాలతో నిండిన బీట్‌ రూట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో నైట్రేట్లు దండిగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు గలవారికి మరింత బాగా ఉపయోగపడగలవని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. మాంచెస్టర్‌లో నిర్వహించిన బ్రిటిష్‌ కార్డియోవాస్క్యులర్‌ సొసైటీ సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రం ఈ విషయాన్ని వెల్లడించింది. అధ్యయనంలో భాగంగా రక్తనాళాల్లో తాత్కాలికంగా వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) పెరిగేందుకు కొందరికి టైఫాయిడ్‌ టీకా ఇచ్చారు. మరి కొందరికి చర్మం మీద క్రీముతో చిన్న బొబ్బలు ఏర్పడేలా చేసి, అక్కడ వాపు ప్రక్రియ తలెత్తేలా చేశారు. అందరికీ వారం పాటు రోజూ గ్లాసు బీట్‌ రూట్‌ రసం తాగమని చెప్పారు. అయితే సగం మందికి నైట్రేట్‌తో కూడిన, మరో సగం మందికి నైట్రేట్‌ తొలగించిన రసం ఇచ్చి పరిశీలించారు. నైట్రేట్‌తో కూడిన రసం తాగినవారిలో రక్తం, మూత్రం, లాలాజలంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ స్థాయులు ఎక్కువ కావటం గమనార్హం. చర్మం మీద బొబ్బలు త్వరగా నయమయ్యాయి కూడా. బొబ్బల నుంచి తీసిన ద్రవంలో వాపు ప్రక్రియను ప్రేరేపించే తెల్ల రక్తకణాల సంఖ్య సైతం మూడు రోజుల్లో తగ్గిపోయింది. దీనికి కారణం నైట్రిక్‌ ఆక్సైడ్‌ మోతాదులు పెరగటమేనని పరిశోధకులు భావిస్తున్నారు. మన శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ సహజంగానే తయారవుతుంది. ఇది రక్తపోటు అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. వాపు ప్రక్రియ ప్రభావాలనూ తగ్గిస్తుంది. అయితే గుండెజబ్బులతో బాధపడేవారిలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ తక్కువగా ఉంటుంది. మరో వైపు వీరి రక్తనాళాల్లో వాపు ప్రక్రియ ఎక్కువగా కొనసాగుతూ వస్తుంటుంది. బీట్‌ రూట్‌లోని నైట్రేట్లు ఒంట్లోకి చేరుకున్నాక నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మారతాయి. అందువల్ల ఇది గుండెజబ్బులు గలవారికి మేలు చేయగలదని అనుకుంటున్నారు. గుండెజబ్బులతో బాధపడేవారిలోనూ బీట్‌ రూట్‌ ఇలాంటి ప్రభావాలనే చూపిస్తుందా? గుండెపోటు ముప్పును తగ్గిస్తుందా? అనేవి తెలుసుకోవటానికి ఇప్పుడు పరిశోధకులు ప్రయోగ పరీక్షల మీద దృష్టి సారించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని