గుండెకు నిద్ర అండ!

గుండె, మెదడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి? తెలుసుకోవటమెలా అంటారా? ఇందుకు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ రూపొందించిన స్కోరింగ్‌ పద్ధతి ఉందిగా. ‘లైఫ్స్‌ సింపుల్‌ 7’గా పిలుచుకునే దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తుంటారు. ఇప్పటివరకు

Published : 12 Jul 2022 01:04 IST

గుండె, మెదడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి? తెలుసుకోవటమెలా అంటారా? ఇందుకు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ రూపొందించిన స్కోరింగ్‌ పద్ధతి ఉందిగా. ‘లైఫ్స్‌ సింపుల్‌ 7’గా పిలుచుకునే దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తుంటారు. ఇప్పటివరకు ఇందులో ఆహారం, శారీరక శ్రమ, పొగ తాగటం, బరువు, కొలెస్ట్రాల్‌, రక్తంలో గ్లూకోజు, రక్తపోటును పరిశీలిస్తుండగా.. ఇప్పుడు రాత్రిపూట నిద్రనూ జతచేశారు. దీంతో ఇది ‘లైఫ్స్‌ ఎసెన్షియల్‌ 8’గా మారిపోయింది. గుండెజబ్బు, పక్షవాతంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 లక్షల మంది మరణిస్తున్నారు. నిజానికి వీటిల్లో చాలా మరణాలు నివారించుకోదగినవే. ఇందుకు నిద్ర కూడా కీలకమే. సాధారణంగా రాత్రిపూట రక్తపోటు తగ్గుతుంది. కానీ తగినంత సేపు నిద్రపోకపోతే పెరుగుతుంది. అందువల్ల రాత్రిపూట తగినంత నిద్ర అత్యంత అవసరమని తాజా సవరణ సూచిస్తోంది. తగినంత అంటే 7-8 గంటల సేపు నిద్ర పోవటం. అంతకన్నా తక్కువైనా, ఎక్కువైనా నష్టమే. వారాంతాల్లో, పగటిపూట కునుకు తీయటం దీనిలోకి రాదు. ఈ ‘లైఫ్స్‌ ఎసెన్షియల్‌ 8’ అంశాలను మై లైఫ్‌ చెక్‌ టూల్‌తో లెక్కించి 0-100 వరకు స్కోరు ఇస్తారు. ఈ స్కోరు 50 కన్నా తక్కువుంటే గుండె ఆరోగ్యం ‘బాగాలేదు’ అనే. అదే 50-79 మధ్యలో ఉంటే ‘మధ్యస్థంగా’.. 80, అంతకన్నా ఎక్కువుంటే ‘చాలా బాగుంది’ అన్నట్టు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని