పీచుతో జ్ఞాపకశక్తి!

పీచు పదార్థంతో జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. మలబద్ధకం దరిజేరదు. కొలెస్ట్రాల్‌ మోతాదులూ తగ్గుతాయి. ఇది మతిమరుపు తలెత్తకుండానూ కాపాడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.

Published : 26 Jul 2022 01:04 IST

పీచు పదార్థంతో జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. మలబద్ధకం దరిజేరదు. కొలెస్ట్రాల్‌ మోతాదులూ తగ్గుతాయి. ఇది మతిమరుపు తలెత్తకుండానూ కాపాడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఇందులో భాగంగా 40-60 ఏళ్ల వయసువారి ఆహార అలవాట్లను పరిశీలించారు. మొత్తం 16 ఏళ్ల పాటు ఆహార సర్వేలో పాల్గొన్నవారిని దీనికి ఎంచుకున్నారు. వీరిలో ఎవరెవరు డిమెన్షియా బారినపడ్డారో గుర్తించారు. ఆహారంలో ఎక్కువ పీచు తీసుకున్నవారికి తక్కువ ముప్పు ఉంటున్నట్టు కనుగొన్నారు. రోజుకు సగటున 20 గ్రాముల పీచు తీసుకున్నవారికి డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంటుండగా.. కేవలం 8 గ్రాములే తీసుకున్నవారికి ముప్పు చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. పీచుతో మతిమరుపు తగ్గటానికి వివిధ కారణాలు ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఉదాహరణకు- పీచు ఎక్కువగా గల ఆహారంతో బరువు, రక్తపోటు అదుపులో ఉంటాయి. ఆలోచన శక్తిని సన్నగిల్లజేసే వ్యాస్కులర్‌ డిమెన్షియా బారినపడకుండా కాపాడుతుంది. పీచుతో పేగుల్లో మంచి బ్యాక్టీరియా సైతం వృద్ధి చెందుతుంది. ఇది మెదడు-పేగుల అనుసంధానం ద్వారా మెదడులో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గేలా చేస్తుంది. ఇవన్నీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచేవే. కాబట్టి ఆహారం విషయంలో పీచు మీదా దృష్టి పెట్టండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని