Pulses Benefits: పప్పుల బలం గురించి తెలుసా?

కందులు, పెసర్లు, శనగలు, బఠానీలు.. ఈ పప్పుల (Pulses) గురించి, ఇవి శరీరానికి అందించే బలం (Pulses Benefits) గురించి మీకు తెలుసా? ఇవిగో వివరాలు... 

Updated : 11 Jun 2023 21:13 IST

కందులు, పెసర్లు, శనగలు, బఠానీలు.. పప్పులు ఏవైతేనేం? అన్నీ రుచిగానే ఉంటాయి. ఒక్క రుచిలోనే కాదు, పోషకాల పరంగానూ గొప్పవే. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చూస్తాయి. ఇలా గ్లూకోజును అదుపులో ఉంచుతాయి. పప్పుల్లో కొవ్వు తక్కువ. ఆ మాటకొస్తే కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. అందువల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరోవైపు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఎముకలకూ పుష్టినిస్తాయి. పెద్దపేగు, ప్రొస్టేట్‌, జీర్ణాశయ, పాంక్రియాస్‌ క్యాన్సర్ల వంటి రకరకాల క్యాన్సర్ల నివారణకూ పప్పులు తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

అధిక రక్తపోటు నివారణకు తోడ్పడే డ్యాష్‌ ఆహార పద్ధతిలో పప్పులు కూడా భాగమేనని అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. పప్పులు జీర్ణకోశానికీ మిత్రులే. ఇవి పేగుల కదలికలను మెరుగు పరుస్తాయి. పేగుల్లో బ్యాక్టీరియా పెరగటానికీ తోడ్పడతాయి. పప్పుల్లో పిండి పదార్థాల మోతాదులు దండిగా ఉంటాయని కొందరు భయపడుతుంటారు. కానీ ఇవి పీచుతో కూడుకొని ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అత్యవసరం. మరో మంచి విషయం- ఫోలేట్‌, ఐరన్‌, జింక్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందించటం. ఆరోగ్య సంరక్షణలో ఇవన్నీ పాలు పంచుకుంటాయి.

ప్రొటీన్‌ శక్తి

వేడి వేడి అన్నంలో ముద్ద పప్పు కలిపి తింటుంటే ఆ రుచే వేరు. చాలామంది ఇలాగే అన్నంతో పాటే పప్పులను తింటుంటారు. ఒక కప్పు ఉడికించిన పప్పుల్లో సుమారు 230 కేలరీలు, 17.9 గ్రాముల ప్రొటీన్‌, 15.6 గ్రాముల పీచు, 0.8 గ్రాముల కొవ్వు ఉంటాయి. అదే ఒక కప్పు అన్నంతో 4.5 గ్రాముల ప్రొటీన్‌, 45.8 గ్రాముల పిండి పదార్థాలు, 3.5 గ్రాముల పీచు లభిస్తాయి. కాబట్టి అన్నం పరిమాణాన్ని కాస్త తగ్గించి పప్పుల మోతాదు పెంచుకుంటే ఇంకా మంచిది. వీటితో అమైనో ఆమ్లాలు.. ముఖ్యంగా లైసిన్‌ సైతం అందుతుంది. అన్నం వంటి ధాన్యాల్లో అమైనో ఆమ్లాలు తక్కువ. కాబట్టి రోజుకు కనీసం ఒక కప్పు ఉడికించిన పప్పులు తినటం మంచిది. శాకాహారులకు ఇది మరింత ముఖ్యం. వీటిల్లోని ప్రొటీన్‌, అమైనో ఆమ్లాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి.

గ్యాస్‌ ఇబ్బంది

ఎంత మంచివైనా పప్పులతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. చాలామంది ఎదుర్కొనేది కడుపుబ్బరం. నిజమే. పప్పులు సహజంగానే పేగుల్లో గ్యాస్‌ ఉత్పత్తయ్యేలా చేస్తాయి మరి. చాలామందికి ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ కొందరికి కింది నుంచి గ్యాస్‌ ఎక్కువగా రావటం ఇబ్బంది కలిగిస్తుంది. కొందరికి పప్పుల్లోని లెక్టిన్‌ పడకపోవచ్చు. దీంతో కడుపునొప్పి, వికారం వంటివి తలెత్తొచ్చు. అయితే పప్పులను నానబెట్టటం, ఉడికించటం, మొలకెత్తించటం వంటి పద్ధతులతో లెక్టిన్ల మోతాదులను తగ్గించుకోవచ్చు. ఇలా వీటితో తలెత్తే గ్యాస్‌, అజీర్ణం వంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని