ఆహారమే అమృతం!

కోట లోపలికి శత్రువు చొరబడితే యుద్ధం తప్పదు. మరి శత్రువులెవరూ లేకపోయినా సైనికులు యుద్ధం చేస్తుంటే? తమ మీద తామే దాడి చేసుకుంటుంటే? వినాశనం కొని తెచ్చుకున్నట్టే. మన శరీరంలో తలెత్తే దీర్ఘకాలిక వాపు ప్రక్రియ (క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌) ఇలాంటిదే. హాని కారకాలేవీ లేకపోయినా

Updated : 09 Sep 2022 11:51 IST

కోట లోపలికి శత్రువు చొరబడితే యుద్ధం తప్పదు. మరి శత్రువులెవరూ లేకపోయినా సైనికులు యుద్ధం చేస్తుంటే? తమ మీద తామే దాడి చేసుకుంటుంటే? వినాశనం కొని తెచ్చుకున్నట్టే. మన శరీరంలో తలెత్తే దీర్ఘకాలిక వాపు ప్రక్రియ (క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌) ఇలాంటిదే. హాని కారకాలేవీ లేకపోయినా రోగనిరోధక వ్యవస్థ చేసే ఈ అనవసర యుద్ధం ఎన్నో జబ్బులకు బీజం వేస్తుంది. మంచి విషయం ఏంటంటే- దీన్ని మన జీవనశైలిని మార్చుకోవటం ద్వారా నిలువరించే అవకాశం ఉండటం. ఇందులో ఆహారం పాత్ర చాలా కీలకం.

మన శరీరం నిత్య యుద్ధ క్షేత్రం! ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. మనం ఆరోగ్యంగా ఉండటానికి రోగనిరోధకశక్తి నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. బయటి నుంచి బ్యాక్టీరియా, వైరస్‌, పుప్పొడి, రసాయనాల వంటివేవైనా లోపలికి ప్రవేశిస్తున్నాయా? అని నిశితంగా గమనిస్తూ ఉంటుంది. ఇవి లోపలికి చొరబడితే వెంటనే ఉత్తేజితమవుతుంది. వాటిని ఎదుర్కొని, అణచి వేయటానికి రంగంలోకి దిగుతుంది. వీటితో ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇన్‌ఫెక్షన్లు తలెత్తినా పోరాడుతుంది. ఈ ప్రయత్నంలో అతి కీలకమైంది వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌). జ్వరం, ఒళ్లు నొప్పులు, దెబ్బలు తగిలిన చోట వాపు వంటివన్నీ దీని ఫలితాలే. ఆయా ప్రమాదాలు తొలగిపోయిన తర్వాత వాపు ప్రక్రియ సమసిపోతుంది. ఇది చాలావరకు మనకు మేలు చేసేదే. అయితే కొన్నిసార్లు శరీరానికి హాని చేసేవి లేకపోయినా రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమై కణ స్థాయిలో వాపు ప్రక్రియను ప్రేరేపించొచ్చు. ఇది దీర్ఘకాలమూ కొనసాగొచ్చు. ఈ అంతర్గత వాపు ప్రక్రియ చాలా ప్రమాదకరమైంది. పైకేమీ తెలియకుండానే లోపల్లోపలే దెబ్బతీస్తూ వస్తుంది. నిరంతరం వాపు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంటే శరీరంలో సమతుల్యత దెబ్బతింటుంది. కణాలు సమర్థంగా పనిచెయ్యవు. పరిస్థితి విషమిస్తే పలు సమస్యలూ చుట్టుముడతాయి. క్యాన్సర్లు, గుండెజబ్బులు, మధుమేహం, కీళ్లనొప్పులు, కుంగుబాటు, అల్జీమర్స్‌, ఆస్థమా, పేగుల్లో పూత, ల్యూపస్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులన్నింటికీ కణస్థాయిలో తలెత్తే వాపు ప్రక్రియే మూలమని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని నివారించుకోవటం మీద రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఊబకాయం, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవటం, పొగ అలవాటు వంటివెన్నో వాపు ప్రక్రియను ప్రేరేపితం చేస్తుంటాయి. ఇందులో ఆహారం పాత్రా ఎక్కువే. అనారోగ్యకరమైన పదార్థాలకు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌) ద్వారా ఈ అనవసర వాపు ప్రక్రియ ప్రేరేపితం కాకుండా చూసుకోవచ్చు. ఫలితంగా జబ్బుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అప్పుడు ఆయుష్షూ పెరుగుతుంది. అంటే ఆహారమే అమృతంగా ఉపయోగపడుతుందన్నమాట.

సమతులాహారంలో భాగమే
నిజానికి వాపు ప్రక్రియ నివారణ ఆహారమనేది ప్రత్యేకమైందేమీ కాదు. సమతులాహారంలో భాగమే. ముందుగా దీని గురించి తెలుసుకోవటం ముఖ్యం. మన శరీరం సజావుగా పని చెయ్యటానికి 6 రకాల పోషకాలు అవసరం. అవి ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు. ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు స్థూల పోషకాలు (మాక్రోన్యూట్రియెంట్స్‌). ఇవి మనకు పెద్ద మొత్తంలో అవసరం. మన శరీరం పనిచేయటానికి అవసరమైన శక్తినిచ్చేవి ఇవే. విటమిన్లు, ఖనిజాలు సూక్ష్మ పోషకాలు (మైక్రోన్యూట్రియెంట్స్‌). ఇవి తక్కువ మోతాదులోనే అవసరమవుతాయి. నీరు అత్యవసరమైన స్థూల పోషకం. దీన్ని పెద్దమొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. మన ఆహారంలో ఇవన్నీ సమతులంగా ఉండటం తప్పనిసరి. భోజనంలో పావు వంతు పిండి పదార్థాలు, పావు వంతు ప్రొటీన్లు.. మిగతా సగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే పోషకాలన్నీ సమతులంగా అందుతాయి.

మారిపోతున్న ఆహార అలవాట్లు
ఇటీవలి కాలంలో ఆహార అలవాట్లు గణనీయంగా మారిపోతున్నాయి. బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వులు, నూనెలు తినటం ఎక్కువైంది. అదే సమయంలో పొట్టుతీయని ధాన్యాలు, గింజలు, పండ్లు, కూరగాయలు తినటం తగ్గింది. ఇలాంటి అనారోగ్యకర ఆహారం పెద్ద చిక్కే తెచ్చి పెడుతోంది. మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెరతో చేసిన పానీయాలతో కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. మితిమీరిన కొవ్వు పదార్థాలు, నూనెలతో కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. అధిక బరువుతో అంతర్గత వాపు ప్రక్రియ ముప్పు ఎక్కువవుతుంది. బరువు ఒక్కటే కాదు.. ఆయా పదార్థాల్లోని కొన్ని అంశాలూ వాపు ప్రక్రియను ప్రేరేపించొచ్చు. ఇది సమసి పోకుండా అలాగే దీర్ఘకాలం కొనసాగుతూ రావొచ్చు.

వాపు ప్రక్రియను తగ్గించేవి
పొట్టుతీయని ధాన్యాలు: వాపు ప్రక్రియ నివారణలో వీటి పాత్ర చాలా కీలకం. ఇవి రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కరిగేలా చేస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఇలా బరువు, కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. ఫలితంగా వాపు ప్రక్రియ సైతం అదుపులో ఉంటుంది. కాబట్టి దంపుడు బియ్యం, పెసలు, శనగలు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, క్వీనియా వంటివన్నీ విధిగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. విటమిన్‌ సి, పీచుతో పాటు వీటిల్లో యాంతోసయానిన్లు, ఎలాజిక్‌ యాసిడ్‌ వంటి వృక్ష రసాయనాలుంటాయి. ఇవి వాపు ప్రక్రియ నివారణకు తోడ్పడతాయి.
దానిమ్మ: వీటిల్లోని యాంతోసయానిన్లు వాపు ప్రక్రియను అదుపులో ఉంచుతాయి.
యాపిల్‌: దీనిలోని పెక్టిన్‌, పాలీఫెనాల్స్‌ వంటివి వాపు ప్రక్రియను తగ్గిస్తాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి.
చెర్రీ పండ్లు: వీటిల్లో క్యాటెచిన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి.
ద్రాక్ష: వీటితో యాంతోసయానిన్లతో పాటు రజ్వెరట్రాల్‌ అనే మరో యాంటీఆక్సిడెంటూ లభిస్తుంది.
బత్తాయి, నారింజ: ఇలాంటి పుల్లటి పండ్లలోని విటమిన్‌ సితో పాటు ఫ్లేవనాయిడ్లు, కెరొటినాయిడ్లు ఎంతో మేలు చేస్తాయి.
అవకాడో: ఇందులో పొటాషియం, మెగ్నీషియం, పీచుతో పాటు మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లమూ ఉంటుంది.
టమోటా: దీనికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకోపీన్‌ మంచి యాంటీఆక్సిడెంట్‌. ఇది వాపు ప్రక్రియను బాగా అదుపులో ఉంచుతుంది. టమోటాలను ఆలివ్‌ నూనెతో వండితే ఇంకాస్త ఎక్కువ లైకోపీన్‌ లభిస్తుంది. ఎందుకంటే లైకోపీన్‌ కెరొటినాయిడ్‌. దీన్ని కొవ్వు సమక్షంలోనే శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది. క్యారెట్‌, బీట్‌రూట్‌లోనూ కెరొటినాయిడ్లుంటాయి.
చేపలు: కొవ్వుతో కూడిన సాల్మన్‌, సార్డిన్‌, టూనా, మాకెరెల్‌, రవ్వ, జెల్ల, కొర్రమీను వంటి చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వాపు ప్రక్రియను అదుపులో ఉంచుతాయి.
గింజ పప్పులు: బాదం, అక్రోట్ల వంటి గింజపప్పుల్లోని కొవ్వులు వాపు ప్రక్రియను నిలువరిస్తాయి. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు కూడా మంచివే.
నూనెలు: ఆలివ్‌, వేరుశనగ నూనెల్లోని అసంతృప్త కొవ్వులు మేలు చేస్తాయి.
ఆకుకూరలు: పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో వాపును అదుపులో ఉంచే ఫాలీఫెనాల్స్‌ దండిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా శాకాహారంతోనే లభిస్తాయి. వ్యాధి నిరోధకశక్తిని పెంచి, వాపు ప్రక్రియను నివారిస్తాయి. ఆకుకూరలను సజ్జలతో కలిపి కిచిడీ చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతాయి. కావాలంటే ఆకుకూరలను సలాడ్‌గా చేసి ఉప్పు, నిమ్మకాయ కలిపి తినొచ్చు. వీటిల్లో పీచు ఎక్కువ. కేలరీలు తక్కువ.
బ్రోకలీ: కాలిఫ్లవర్‌ వంటి క్రూసిఫెరస్‌ కూరగాయల జాతికి చెందిన ఇందులో సల్ఫోరఫేన్‌ దండిగా ఉంటుంది. ఇది సైటోకైన్లు, న్యూక్లియర్‌ ఫ్యాక్టర్‌ కప్పా బి మోతాదులను తగ్గిస్తూ వాపును అదుపులో పెడుతుంది.
క్యాప్సికం: ఇందులో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. వీటిల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. బజ్జీ మిరప కూడా మంచిదే. ఇది వృద్ధాప్యం త్వరగా మీద పడకుండానూ కాపాడుతుంది.
పుట్ట గొడుగులు: వీటిల్లో కేలరీలు తక్కువ. సెలీనియం, రాగి, బి విటమిన్లు, ఫీనాల్స్‌, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి.
గ్రీన్‌ టీ: ఇందులో యాంటీఆక్సిడెంట్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. వాపు ప్రక్రియను ప్రేరేపించే సైటోకైన్లను నిలువరించి, కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
కాఫీ: కాఫీ మితంగా తీసుకుంటే వాపు ప్రక్రియ నివారణకు తోడ్పడుతుంది.
పసుపు: దీనిలోని కర్‌క్యుమిన్‌ ఇన్‌ఫ్లమేషన్‌ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. పసుపు, అల్లం కలిపి తీసుకున్నా మంచిదే.
డార్క్‌ చాక్‌లెట్‌, కోకా: వీటిల్లోని ఫ్లేవనాయిడ్లు ఎంతో మేలు చేస్తాయి. అలాగని ఎక్కువగా తీసుకోకూడదు. మితం పాటించాలి.
తేనె: ఇందులో నీళ్లు, కాస్త పసుపు కలిపి తీసుకుంటే వాపు ప్రక్రియను తగ్గించుకోవచ్చు. ఉల్లిగడ్డ, వెల్లులి, అల్లం వంటివీ వాపు నివారణకు తోడ్పడతాయి.


వాపు ప్రక్రియను ప్రేరేపించేవి

కొన్ని పదార్థాలు ప్రత్యేకించి వాపు ప్రక్రియను ప్రేరేపించే అవకాశముంది. ముఖ్యంగా ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండేవి హానికరంగా పరిణమిస్తాయి. వీటిల్లో ప్రధానమైనవి మైదా వంటి బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు. తెల్ల బ్రెడ్డు, కేకులు, బిస్కట్ల వంటివి దీంతో తయారు చేసేవే. నూనెలో బాగా వేయించి చేసే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, ఆలూ చిప్స్‌, వడలు, పూరీలు, బజ్జీల వంటివీ వాపు ప్రక్రియను ప్రేరేపించొచ్చు. కూల్‌డ్రింకులు, సోడా వంటి కార్బొనేటెడ్‌ పానీయాలు.. చక్కెరతో చేసిన పానీయాలూ తక్కువేమీ కాదు. వేట మాంసం (రెడ్‌ మీట్‌).. కార్జం, మెదడు వంటి అవయవాల మాంసం, హ్యామ్‌ వంటి మాంసం ఉత్పత్తులతోనూ ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తుంచుకోవాలి. వెన్న, వనస్పతి, కొవ్వుతో చేసిన లార్డ్‌, మార్గరీన్‌ వంటివీ వాపు ప్రక్రియను ప్రేరేపించొచ్చు.
బాగా శుద్ధి చేసిన పిండితో చేసే పదార్థాలు, కూల్‌డ్రింకులు, వేపుళ్లు, మాంసంతో ఉప్పు, చక్కెర, కొవ్వులు ఎక్కువగా అందుతాయి. వీటితో రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువవుతుంది. ఇవన్నీ వాపు ప్రక్రియను ఉత్తేజితం చేసేవే. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. పూర్తిగా మానేస్తే ఇంకా ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు గానీ అదీ మితంగానే.

మధ్యధరా ఆహారం
వాపు ప్రక్రియ నివారణలో బాగా ప్రాచుర్యం పొందింది మధ్యధరా (మెడిటేరియన్‌) ఆహార పద్ధతి. ఇందులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల పాళ్లు ఎక్కువ. చాలావరకు పచ్చివే తింటుంటారు. అవసరమైతే కొద్దిగా నూనె వేసి తాలింపు వేసుకుంటారు. అదీ ఆలివ్‌ నూనె మాత్రమే వాడతారు. ఇది వాపు ప్రక్రియ నివారణకు బాగా తోడ్పడుతుంది. ఫలితంగా గుండెజబ్బు, క్యాన్సర్లు, మధుమేహం వంటి జబ్బుల బారినపడకుండానూ కాపాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని